
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1,857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల అటవీ సంపద, జంతువులు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించింది. బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆనందరావు అనే అభ్యర్థి, మరో ఐదుగురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన సింగిల్ జడ్జి సర్వీస్ కమిషన్ రూల్ 6ఏ ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని, కోర్టులో పిటిషన్ వేసినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. దానిపై టీఎస్పీఎస్సీ అప్పీల్‌ను బుధవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది. బీట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారిలో ఎవరైనా చేరక పోస్టులు ఖాళీగా ఉంటే పిటిషనర్లలో అర్హులకు అవకాశమివ్వాలని సూచించింది. స్పందించిన టీఎస్పీఎస్సీ.. ఇలా నియమించడం సరికాదని, తర్వాత మరికొందరు ఇలాగే కోర్టుకొస్తే ఎలాగని పేర్కొంది. దీనిపై బెంచ్ వివరణ ఇచ్చింది. ఈ విధానం తొలుత కోర్టుకు వచ్చిన వారికే అమలు చేయాలని సుప్రీం తీర్పు ఉందని గుర్తు చేసింది.