
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మెడికల్ అడ్మిషన్లలో క్రీడల రిజర్వేషన్ కోటా అమలవుతుందో లేదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో క్రీడల కోటా కింద 0.5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ నల్గొండకు చెందిన ఎం.అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో క్రీడా కోటా కింద 0.5% రిజర్వేషన్లు కల్పిస్తూ 2017 జులైలో ప్రభుత్వం జీవో 114 జారీ చేసిందన్నారు. జీవోను అమలు చేయాలని కోరుతూ ఈ ఏడాది జులై 25న వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. క్రీడా కోటా అమలుకు సంబంధించి జీవో అమల్లోనే ఉందా.. ఉపసంహరించారా అన్న వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.