
హైదరాబాద్, వెలుగు: పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తుకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్‌లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టప్రకారం కేసుల దర్యాప్తును చేపట్టాలని, విచారణ సమయంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగించరాదని పోలీసులకు సూచించింది. క్రిమినల్ కేసులో నిందితులైన ఖాతాదారుల వివరాలివ్వాలని, నగలను అప్పగించాలని, వాటిని ఇతరులకు అప్పగించరాదంటూ మంచిర్యాల పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.
వీటిపై బుధవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెన్నూరు ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. బ్యాంకు ఉద్యోగి సహకారంతో బ్యాంకులో అవకవతకలు జరిగాయని, రూ.13.71 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు మాయమయ్యాయని తెలిపారు. నిందితులు బంగారు నగలను పిటిషనర్ల కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందారని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. వాదనలను విన్న జడ్జి.. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు.