
హైదరాబాద్, వెలుగు: గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని జనజాతర సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు చెప్పారు. కింది కోర్టులో కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణ సమయంలోనే కేసు దర్యాప్తును హైకోర్టు నిలిపివేసింది.
సీఎం తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌పై ఫిర్యాదుకు ఆ పార్టీ అధిష్టానం అనుమతించినట్లు ఆధారాల్లేవని చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా ఫిర్యాదు చేయడం చెల్లదన్నారు. వాదనల అనంతరం హైకోర్టు, ఫిర్యాదుదారుడి అభియోగాలకు ఆధారాలు లేవని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయంగా చేసే విమర్శలను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేసుకోవడం సరి కాదన్నారు. అనంతరం రేవంత్ రెడ్డిపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.