- మేడారం జాతర, ముచ్చింతల్ ఉత్సవాల్లో కరోనా గైడ్లైన్స్అమలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫిజికల్ క్లాసులు మొదలైనప్పటికీ ఆన్‌లైన్‌లో కూడా విద్యాబోధన ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ వల్ల ఫిజికల్ క్లాసులకు హాజరుకాని స్టూడెంట్స్ కోసం ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మేడారం జాతర, ముచ్చింతల్‌లో రామానుజాచార్య వేడుకలు సహా ఏ మతపరమైన కార్యక్రమమైనా కరోనా గైడ్‌లైన్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలంది. కరోనాపై దాఖలైన పలు పిల్స్‌ను గురువారం చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి బెంచ్ విచారించింది. కరోనాకు సంబంధించి వారాంతపు సంతల విషయంలో పదే పదే ఆందోళన సరికాదని తెలిపింది. సంతలకు వచ్చిన వారు వెళ్లిపోతారని, బార్లు, రెస్టారెంట్లల్లో చాలా సేపు కూర్చునే వారిని గుర్తుంచుకొని అక్కడ కూడా కరోనా గైడ్‌లైన్స్ అమలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. రామానుజ విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదన్నారు. సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ కల్పించుకొని తాను మూడు రోజులు ఆ వేడుకల్లో ఉన్నానని, గైడ్‌లైన్స్ కచ్చితంగా అమలు అవుతున్నాయని కోర్టుకు చెప్పారు. కరోనా తీవ్రత పెద్దగా లేదని, అందుకే విద్యార్థులు నష్టపోరాదనే స్కూల్స్ తెరిచినట్లు ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు3.40 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో 99 లక్షల ఇండ్లలో ఫీవర్ సర్వే చేసి 4.32 లక్షల మందికి మెడిసిన్ కిట్లను ఉచితంగా ఇచ్చామన్నారు. రోజుకు లక్షకుపైగా టెస్ట్‌లు చేస్తున్నామని, మందులు, బెడ్స్ అన్నీ అందుబాటులో ఉంచామన్నారు. మేడారం జాతరలో కరోనా గైడ్‌లైన్స్ అమలు చేస్తామని కోర్టుకు చెప్పారు. రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఇయ్యాల్టి నుంచి టీవీ పాఠాలు
మూడో తరగతి నుంచి పదో తరగతి దాకా శుక్రవారం నుంచి ఆన్‌లైన్ క్లాసులు కంటిన్యూ చేయనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ క్లాసుల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించింది. విద్యాసంస్థల రీఓపెన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ నెల 1 నుంచి స్కూళ్లు తెరిచినా.. కరోనా భయంతో స్టూడెంట్లు క్లాసులకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులను కూడా ఈ నెల 28 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ నెల 4 నుంచి 8 వరకు ఆన్‌లైన్ క్లాసుల షెడ్యూల్ రిలీజ్ చేశారు. టీశాట్ విద్యా, టీశాట్ నిపుణ చానల్స్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు క్లాసుల షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ విషయాన్ని స్టూడెంట్లకు తెలపాలని డీఈఓలను ఆదేశించారు. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో అటెండెన్స్ మినహాయింపు కూడా ఉందని చెప్పారు.
