మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు హైకోర్టులో ఊరట

మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు హైకోర్టులో ఊరట
  • ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌‌ కొట్టేసిన బెంచ్

హైదరాబాద్, వెలుగు : మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు హైకోర్టులో ఊరట లభించింది. మహబూబ్‌‌నగర్‌‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌‌ను న్యాయ స్థానం డిస్మిస్​ చేసింది. మహబూబ్‌‌నగర్‌‌ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది సీహెచ్‌‌ శ్రీనివాస్‌‌రాజు దాఖలు చేసిన ఎలక్షన్‌‌ పిటిషన్‌‌ను కొట్టివేస్తూ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎం.లక్ష్మణ్‌‌ తీర్పు చెప్పారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నుంచి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలప్పుడు ఆయన తొలుత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకుని మార్పులు చేసి మరోసారి ఇచ్చారని, అది చట్ట వ్యతిరేకమని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రాజు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకుని దానిలో మార్పులు చేసి రెండోసారి సమర్పించడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలన్న వినతిని న్యాయస్థానం కొట్టేసింది. ఆ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెలువరించాలన్న పిటిషన్​ను డిస్మిస్​చేసింది. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికపై జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఏమీ లేదని తీర్పులో పేర్కొంది.

ధర్మమే గెలిచింది : శ్రీనివాస్​గౌడ్

మహబూబ్​నగర్ టౌన్, వెలుగు : ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తాయని, ఈ విషయం కోర్టు తీర్పు ద్వారా తేలిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన ఎన్నికపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేయడంతో క్యాంప్​ఆఫీస్​ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలవాలే తప్ప ఇలా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. 

ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందనే ఉద్దేశంతో ఇలా కుట్ర చేసి బీసీ మంత్రినైన తనపై కేసు వేయించారన్నారు. బలహీన వర్గాలకు చెందిన తనలాంటి నేతలు ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుంటే ఓర్వలేక కేసుల పేరుతో ఐదేండ్లుగా సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవని తేలిందన్నారు. తనపై కుట్రలు చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తానని, వారు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.