మునుగోడు ఓటర్ నమోదు పిటిషన్పై విచారణ ఈ నెల 21కి వాయిదా

మునుగోడు ఓటర్ నమోదు పిటిషన్పై విచారణ ఈ నెల 21కి వాయిదా

మునుగోడు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ నివేదిక పరిశీలించిన అనంతరం విచారణ జరుపుతామని చెప్పింది. ఈ మేరకు కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ మునుగోడు ఓటర్లకు సంబంధించి నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటి వరకు 25వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 12వేల అప్లికేషన్లు మాత్రమే అప్రూవ్ చేసినట్లు చెప్పింది. మరో 7వేల ఓట్లు తిరస్కరించామని, మిగిలినవి పెండింగ్ లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రకియను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్ లో ఉన్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రెండు నెలల్లో కొత్తగా 25వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు 7 నెలల్లో కేవలం 1,474 మంది మాత్రమే ఓటు కోసం అప్లై చేసుకోగా.. ఈ మధ్యకాలంలో 24,781 దరఖాస్తు  చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై 31నాటికి ఉన్న ఓటర్ లిస్టు ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కు ఆదేశించాలని కోరింది. ఈ నెల 14న ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.