డ్రంకెన్‌ డ్రైవ్‌లో బండ్లు సీజ్​ చేయొద్దు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో బండ్లు సీజ్​ చేయొద్దు
  • ఆ అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు
  • వెహికల్​లోని తాగని వ్యక్తికి బండినియ్యాలె
  • ఎవరూ లేకుంటే బంధువులనో, ఫ్రెండ్స్​నో పిలిచి అప్పగించాలె
  • లైసెన్స్​ ఉంటే నడుపుకొని తీసుకెళ్లనియ్యాలె
  • సీజ్​ చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: డ్రంకెన్‌ డ్రైవ్‌‌ పేరుతో వెహికల్స్‌‌ను మోటార్‌‌  వెహికల్స్‌‌ యాక్ట్‌‌ కింద సీజ్‌‌ లేదా స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే పోలీసులకు కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. డ్రంకెన్‌ డ్రైవ్‌‌ పేరుతో తమ వెహికల్స్‌‌ను పోలీసులు సీజ్‌‌ చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన 40కి పైగా రిట్స్​ను జస్టిస్‌‌ కె. లక్ష్మణ్‌‌ విచారించారు. ‘మద్యం తాగి వెహికల్ నడిపితే ఆ వెహికల్​ను సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు లేదు. అదే వెహికల్​లో మందు తాగని మరో వ్యక్తికి ఆ వెహికల్ ​అప్పగించాలి. అతనికి డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ ఉంటే నడిపి తీసుకుళ్లేందుకు అనుమతివ్వాలి. తాగిన వ్యక్తి వెంట ఎవరూ లేకుంటే బంధువు లేదా స్నేహితుడిని పిలిపించి వెహికల్​ఇవ్వాలి. వాళ్లకు డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌ ఉంటే నడిపి తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలి. ఎవరూ రాకపోతే దగ్గరలోని పీఎస్‌‌కు లేదా నిర్ణయించిన జాగాకు వెహికల్​ను తరలించాలి.  స్వాధీనం చేసుకున్న మూడ్రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్‌‌ కోర్టులో పోలీసులు చార్జిషీట్‌‌ వేయాలి. ఆ తర్వాత వెహికల్ ​సీజ్‌‌పై మేజిస్ట్రేట్‌‌ ఉత్తర్వులివ్వాలి. ప్రాసిక్యూషన్‌‌ పూర్తయ్యాక ఆర్టీవోకు ఇన్ఫర్మేషన్‌‌ ఇచ్చి వెహికల్‌ను రిలీజ్‌‌ చేయాలి. వెహికల్ కోసం ఎవరూ రాకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ స్టేట్‌‌ మోటార్‌‌ వెహికల్స్‌‌ యాక్ట్‌‌లోని 448 ఎ రూల్‌‌ను.. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ను పోలీసులు అమలు చేయాలి. గైడ్‌‌ లైన్స్​కు విరుద్ధంగా వెహికల్స్‌‌ను సీజ్‌‌ లేదా స్వాధీనం చేసుకున్న పోలీసులకు కోర్టుధిక్కరణ చట్టం కింద కేసును ఎదుర్కొవాల్సి వస్తుంది’ అని జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ తీర్పు చెప్పారు.