అప్పులు ఇవ్వడానికి బ్యాంకుల వెనుకడుగు

అప్పులు ఇవ్వడానికి బ్యాంకుల వెనుకడుగు

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ లోన్లు మొండి బాకీలుగా (ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలుగా) మారడం పెరుగుతోంది. దీంతో ఈ టైప్ లోన్లను ఇవ్వడానికి బ్యాంకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి.  ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ నాటికి  బ్యాంకుల ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్‌‌‌‌  కేటగిరీలో  7.82 శాతం లోన్లు మొండిబాకీలుగా మారాయి.  ఈ కేటగిరీలో బకాయిలు (తిరిగి చెల్లించాల్సిన అప్పులు) రూ. 82,723 కోట్లకు చేరుకున్నాయి. 2021 మార్చి నాటికి ఇవి రూ.78,823 కోట్లుగా రికార్డయ్యాయి.   ఎన్‌‌‌‌పీఏలు పెరుగుతుండడంతో ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చేటప్పుడు బ్యాంకులు జాగ్రత్త వహిస్తున్నాయి. ఫలితంగా నిజాయతీగా లోన్ కోసం వచ్చేవారికి కూడా అప్పులు మంజూరు కావడం లేదు. ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లు  ఇవ్వడంలో కూడా ఆలస్యం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌‌‌‌లతో జరిగిన మీటింగ్‌‌‌‌లో ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా  ఇదే విషయాన్ని ప్రస్తావించింది. లోన్లు మంజూరు చేయడంలో ఆలస్యాన్ని తగ్గించాలని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ స్కీమ్‌‌‌‌లపై  అవగాహన పెంచాలని తెలిపింది. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డేటా ప్రకారం,  దేశంలోని ఎడ్యుకేషన్ లోన్ల బకాయిల్లో 90 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకులదే ఉంది. ప్రైవేట్ బ్యాంకుల వాటా 7 శాతంగా, రీజినల్ రూరల్ బ్యాంకుల వాటా 3 శాతంగా ఉంది. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్లు వస్తున్నంత వేగంగా ఉద్యోగాలు క్రియేట్ కావడం లేదని, అందుకే ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లను తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రసర్జెంట్‌‌‌‌ ఇండియా ఎండీ జ్యోతి ప్రకాశ్‌‌‌‌ గాడియా అన్నారు. కాగా, ఎటువంటి కొలేటరల్‌‌‌‌ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ లేకుండా రూ.7.5 లక్షల వరకు లోన్‌‌‌‌ను ఇవ్వడానికి బ్యాంకులువెనకడుగేస్తున్నాయి.