ఇటు ఖమ్మం.. అటు కరీంనగర్! కాంగ్రెస్​లో తేలని టికెట్ల పంచాయితీ

ఇటు ఖమ్మం.. అటు కరీంనగర్! కాంగ్రెస్​లో తేలని టికెట్ల పంచాయితీ
  •    పట్టువీడని భట్టి, పొంగులేటి
  •     మధ్యేమార్గంగా తెరపైకి కొత్త పేర్లు
  •     రేసులోకి రామసహాయం రఘురాంరెడ్డి
  •     కరీంనగర్ లో బండి సంజయ్‌కి దీటైన అభ్యర్థి కోసం  కాంగ్రెస్  వేట  
  •     ప్రస్తుతానికి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న మధ్య  పోటీ

ఖమ్మం/కరీంనగర్​,  వెలుగు : కరీంనగర్, ఖమ్మం ఎంపీ సీట్లపై కాంగ్రెస్​లో హైటెన్షన్​ కొనసాగుతోంది. ఖమ్మంలో భార్య కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్ముడి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మెట్టు దిగకపోవడంతో మధ్యే మార్గంగా రామసహాయం రఘురాంరెడ్డి పేరును హైకమాండ్​ సీరియస్​గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అటు కరీంనగర్​లోనూ రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్​రెడ్డి, వెలిచాల రాజేందర్​రావు, తీన్మార్​మల్లన్న మధ్య తీవ్ర పోటీ ఉండగా, ఖమ్మంలో ఓసీకి ఇస్తే కరీంనగర్​నుంచి బీసీని దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఖమ్మంలో ఇదీ పరిస్థితి 

భార్య నందిని కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్ముడి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొడుకు కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంతం వీడకపోడకపోవడంతో ఖమ్మం పార్లమెంట్​టికెట్​పై కాంగ్రెస్ హైకమాండ్​ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. మధ్యేమార్గంగా కాంగ్రెస్​ సీనియర్ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్​రెడ్డి కొడుకు రఘురాంరెడ్డి పేరును సీరియస్​గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈయనకు ఇస్తే సీనియర్​నేత కుటుంబాన్ని గౌరవించుకోవడంతో పాటు పొంగులేటి వియ్యంకుడు కావడం వల్ల జనాల్లోకి వెళ్లేందుకు ఈజీగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

రఘురాంరెడ్డికి ఒక వియ్యంకుడు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కాగా, మరో వియ్యంకుడు సినీ హీరో వెంకటేశ్. గతేడాది పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చి పెండ్లి చేయగా, అంతకు ముందే రఘురాంరెడ్డి పెద్ద కొడుక్కి నటుడు వెంకటేశ్​కుమార్తెతో పెండ్లయ్యింది. దీంతో కమ్మ సామాజికవర్గం బంధుత్వం కలిసి వస్తుందనే టాక్​ఉంది.  ప్రస్తుత పీటముడికి భట్టి, పొంగులేటి పంతం వీడకపోవడమే కారణమని తెలుస్తోంది. పార్టీలో చేరిక సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తన సోదరుడు ప్రసాద్​రెడ్డికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి పట్టుబడుతుండగా, భట్టి అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అవకాశాలిస్తే, ఇన్నేండ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో గతంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కమ్మ సామాజికవర్గానికే ఖమ్మం సీటు కేటాయించాలంటూ వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్​తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈయనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి కూడా కమ్మ సామాజికవర్గం నుంచి తన అనుచరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​మానుకొండ రాధాకిషోర్​ను ప్రతిపాదిస్తున్నారు. ఇక మాజీ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​నేత వీహెచ్​తనకే ఖమ్మం సీటివ్వాలని డిమాండ్​చేస్తున్నారు. రీసెంట్ గా ఈయన సీఎం రేవంత్ ను కలవడంతో పాటు, ఢిల్లీలోనూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇన్ని వాదనలు, అభిప్రాయాల మధ్య బీసీలకు ఛాన్స్​ ఇస్తే బాగుంటుందని మరికొందరు సీనియర్లు కోరుతున్నారు. దీంతో పార్టీ నేత నాగసీతారాములు, లోకేశ్​యాదవ్​ పేర్లను కూడా హైకమాండ్​పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

కరీంనగర్​లోనూ తేలలే..

కరీంనగర్​లోక్​సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్ పోటీ చేయనుండగా కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. పలు దఫాలుగా సర్వే చేయడంతోపాటు పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వచ్చే లోక్​సభ ఎన్నికల్లో కొంత సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో సంజయ్ కి గట్టి పోటీ ఇచ్చి గెలవగలిగే అభ్యర్థి కోసమే కాంగ్రెస్ అధిష్టానం వేచి చూస్తోంది.

ఇప్పటికే కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి సుమారు 15 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కొడుకు రాజేందర్ రావు సీరియస్ గా పోటీ పడుతున్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరికి కాకుండా బీసీకి కేటాయించాల్సి వస్తే తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక ఖమ్మం లోక్ సభ స్థానాన్ని బీసీకి ఇస్తే కరీంనగర్ ను ఓసీకి ఇస్తారని, అక్కడ ఓసీకి ఇస్తే.. కరీంనగర్ టికెట్ బీసీకి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.