ఒక్క ఎంపీ సీటుకు 3 దశల్లో పోలింగ్: ఎందుకిలా?

ఒక్క ఎంపీ సీటుకు 3 దశల్లో పోలింగ్: ఎందుకిలా?

దేశంలో ఏదైనా రాష్ట్రంలో పలు దశల్లో ఎన్నికలు నిర్వహించడం సర్వసాధారణమే. కానీ ఒకే ఒక్క ఎంపీ సీటుకు మూడు విడదల్లో పోలింగ్ పెట్టబోటోంది ఈసీ. దేశ చరిత్రలోనే తొలిసారి ఇది. ఏ నియోజకవర్గమది? ఎందుకిలా? అక్కడి పరిస్థితి ఏంటి? అని ఎవరికైనా అనుమానం రాక మానదు. ఆ వివరాలు తెలుసుకుందాం..

రాష్ట్రాల సైజు.. పరిస్థితిని బట్టి..

దేశంలో లోక్ సభ ఎన్నికల సైరన్ మోగింది. ఏప్రిల్ 11న మొదలుపెట్టి మే 19 వరకు మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహించి.. మే 23న ఫలితాలు ప్రకటిస్తామని సీఈసీ సునీల్ అరోరా నిన్న ప్రకటించారు. రాష్ట్రాల సైజు, అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని బట్టి పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ సహా మరికొన్ని చోట్ల ఒక దశలోనే ఎన్నికలు పెట్టేస్తున్నారు. పెద్ద రాష్ట్రాలైన యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ లలో ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది.

దేశ చరిత్రలోనే తొలిసారి

దేశ చరిత్రలోనే తొలిసారి ఒక్క ఎంపీ సీటుకు మూడు ఫేజ్ లలో ఓటింగ్ జరగబోతోంది. అది జమ్ము కశ్మీర్​లోని అనంతనాగ్​ ఎంపీ స్థానం. ఇక్కడ ఏప్రిల్​ 23, ఏప్రిల్​ 29, మే 6న మూడు దఫాలుగా పోలింగ్​ జరుగుతుందని సీఈసీ ప్రకటించారు. ఒక్క అనంత్ నాగ్ ఎంపీ స్థానానికే మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామని, దీన్ని బట్టే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఈసీ సునీల్ అరోరా  అన్నారు.

2016లోనే ఖాళీ అయినా..

దేశంలోనే అత్యధిక కాలం నుంచి ఖాళీగా ఉన్న ఎంపీ స్థానం కూడా ఇదే. అనంత్ నాగ్ పార్లమెంటు నియోజకవర్గం సీటు 2016లోనే ఖాళీ అయింది. అప్పటి వరకు ఎంపీగా ఉన్న పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆమె తండ్రి మరణంతో ఆమె జమ్ము కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేశారు. దాదాపు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉన్నా అక్కడ ఈసీ ఉప ఎన్నిక నిర్వహించలేక పోయింది. అక్కడ భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.

ఏళ్లుగా అల్లకల్లోలం..

దాదాపు మూడేళ్లుగా ఒక ఎంపీ సీటుకు ఉప ఎన్నిక పెట్టడం కుదరలేదంటేనే అనంత్ నాగ్ లో శాంతి భద్రతల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పీవోకేకు అనుకుని దక్షిణ కశ్మీర్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతమిది. నిత్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో పాక్ కవ్వింపులు, ఉగ్రవాదుల చొరబాట్లు, వారి ఎన్ కౌంటర్లతో అల్లకల్లోలంగా ఉంటుంది ఇక్కడ. 2016 జూలైలో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత అక్కడ శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. ఆ ప్రాంతంలో ఎప్పుడు ఎన్ కౌంటర్ జరిగినా యువత రోడ్లపైకి వచ్చి బలగాలపై రాళ్ల దాడులకు దిగడం, స్థానికులు అల్లర్లు చేయడం సర్వసాధారణమైపోయింది.

ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగిన పుల్వామా ప్రాంతం కూడా అనంత్ నాగ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఓ వైపు ఈ ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోవైపు ఇటీవల జమాతే ఇస్లామీపై నిషేధం, వేర్పాటువాద, హురియత్ నేతల నిర్భందం, ఆర్టికల్ 35(ఏ)పై సుప్రీం రివ్యూ వంటి ఘటనలతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఈ పరిస్థితిలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థులకు రక్షణ, పోలింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడం అత్యంత క్లిష్టమని ఈసీ భావిస్తోంది. అందుకే కశ్మీర్ మొత్తానికి ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఒక్క అనంత్ నాగ్ ఎంపీ సీటుకు మూడు దశల్లో పోలింగ్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్ లో నవంబరు నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ వెనుకడుగు వేస్తోంది. కేవలం పార్లమెంటు ఎన్నికలు మాత్రమే పెడుతోంది.