
- ప్రైవేటు ఆస్పత్రులు దోచుకున్నసొమ్మును రాబట్టండి
- బాధితులకు తిరిగిచ్చేలా చేయాలని.. సర్కారుకు హైకోర్టు ఆదేశం
- లైసెన్స్‌లు రద్దు చేస్తే చాలా? రోగులు ఎక్కడికి పోవాలి?
- అడ్వయిజరీ కమిటీలు ఎందుకు వేయరు?
- కరోనాపై పిల్స్ విచారణలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యల పేరుతో వాటి లైసెన్స్‌లను రద్దు చేస్తే సరిపోతుందా? అక్కడ ఉన్న కరోనా రోగులు లేదా బయట ఉన్న రోగులు వైద్యం చేయించుకోవాలంటే ఎలా? ప్రభుత్వం ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయకపోతే రోగులు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి?’’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సమస్యను మానవీయ కోణంలో చూడాలని చెప్పింది. దోపిడీ చేసిన ఆస్పత్రుల నుంచి రోగులకు డబ్బు తిరిగి ఇచ్చేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అధిక ఫీజులను తిరిగి ఇప్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసుంటే బాధిత రోగులకు మేలు చేసినట్లు అయ్యేదని కామెంట్ చేసింది. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ హామీలు అమలు చేయకుండా భవిష్యత్‌లో చేస్తామంటే ఎలా? అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా.. ఇప్పుడేమీ చేయరా? అని ప్రశ్నించింది. తామిచ్చిన హామీల అమలుపై బుధవారం జరిగే విచారణలో పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా రోగులకు అవసరమైన మందుల పంపిణీకి తీసుకున్న చర్యల గురించి చెప్పాలని కేంద్రానికి చెప్పింది. మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాపై దాఖలైన వేర్వేరు పిల్స్‌ను బెంచ్ విచారించింది.
మీరే హామీ ఇచ్చి అమలు చేయరా?
‘‘అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తే ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లుల దోపిడీని అరికట్టేందుకు నోడల్ ఆఫీసర్‌ను నియమించాలంటే పట్టించుకోలేదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేసే 14 సెంటర్స్ ఏప్రిల్ చివరికి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వమే హైకోర్టుకు చెప్పి ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయలేదు. వీటిని ఏర్పాటు చేయాలని మేము చెప్పలేదు. మీరే హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు’’అని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని.. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అత్యవసర పని నిమిత్తం ఖమ్మం పర్యటనకు వెళ్లారని, వీటికి ఆయనే జవాబు చెప్పగలరని అన్నారు. పిల్లల ఆస్పత్రి నీలోఫర్‌లో 20 బెడ్స్ మాత్రమే కరోనాకు కేటాయించారని సీనియర్ లాయర్ ఎల్.రవిచందర్ చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. థర్డ్ వేవ్ కరోనా ముప్పు ఉందని, మహారాష్ట్రలో ఒక్క జిల్లాలోనే 8 వేల మంది పిల్లలు కరోనా బారినపడ్డారని, రాబోయే పరిస్థితులను అంచనా వేసి వసతుల నుంచి మందుల వరకూ అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.
థర్డ్ వేవ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నం
కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక శాఖ, జైళ్ల శాఖ, జీహెచ్‌ఎంసీలు వేర్వేరుగా అఫిడవిట్లను సమర్పించాయి. ‘‘టెస్టుల సంఖ్య పెంచుతున్నాం. మే 29న లక్ష టెస్టులు చేశాం. ప్రైవేట్ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠినంగా వ్యవహిస్తున్నాం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకంగా 1,500 బెడ్స్ ఏర్పాటు చేశాం’’అని రిపోర్టులో పేర్కొన్నారు.
‘బ్లాక్ ఫంగస్’కు మందులు ఎందుకివ్వలే
బ్లాక్ ఫంగస్ నివారణ మందులను రాష్ట్రానికి ఎందుకు సరఫరా చేయలేదో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అత్యవసర మందుల సరఫరా వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ తరఫున మెమో దాఖలు చేసినట్లు కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నామారపు రాజేశ్వర్‌రావు చెప్పగా దీనిపై బుధవారం విచారిస్తామని తెలిపింది.
మాస్క్ పెట్టుకోలేదని 4.18 లక్షల కేసులు
‘‘రాష్ట్రంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్లను కఠినంగా అమ లు చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకూ 7.49 లక్షల వివిధ రకాల కేసుల నమోదు చేశాం. ఇందులో మాస్క్‌లు పెట్టుకోని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి రూ.35.81 కోట్లు జరిమానా వసూలు చేశాం. లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వాళ్లపై 2.60 లక్షల కేసులు నమోదు చేశాం. మందుల్ని బ్లాక్‌లో అమ్మే వాళ్లపై 150 కేసులు, గుంపులు గుంపులుగా ఉన్న వారిపై 13,867 కేసులు నమోదు చేశాం’’అని రిపోర్టులో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.