డబ్బులే డబ్బులు : ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా

డబ్బులే డబ్బులు : ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన బీఆర్ఎస్, వైసీపీల ఆస్తులు పెరిగినట్టు ప్రముఖ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం - ఏడీఆర్ వెల్లడించింది. 2020-21, 21-22 ఆర్థిక ఆర్థిక సంవత్సరాలకు గానూ దేశంలోని 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు-అప్పులను ఈ సంస్థ విశ్లేషించింది. బీఆర్‌ఎస్‌ ఆస్తుల విషయానికొస్తే.. ఈ కాలంలో ఆ పార్టీ రూ.319.55 కోట్ల నుంచి రూ.512.24 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక వైసీపీవి రూ.250.63 కోట్ల నుంచి రూ.343.28 కోట్లకు పెరిగాయని వెల్లడింది. ఏపీలో ప్రతిపక్షం హోదాలో ఉన్న టీడీపీ ఆస్తులు మాత్రం 3.4 శాతం తగ్గినట్టు ఏడీఆర్ ప్రకటించింది. 2020-21లో టీడీపీ ఆస్తులు రూ.133.42 కోట్లుండగా.. మరుసటి ఏడాదికి రూ.129.37 కోట్లకు తగ్గాయి.

ప్రాంతీయ పార్టీల్లో టాప్‌-10లో ఉన్నవాటిలో అన్నాడీఎంకే, టీడీపీల ఆస్తులు మాత్రమే తగ్గాయని ఏడీఆర్‌ వివరించింది. 2021-22లో బీజేడీ రూ.474కోట్లు, డీఎంకే రూ.399కోట్లు, అన్నాడీఎంకే రూ.256కోట్లు, జేడీయూ రూ.168కోట్లు, ఆప్ రూ.37కోట్లు ఉన్నట్టు వెల్లడింది. మరో గమనించదగ్గ విషయమేమిటంటే.. 2021-22లో అత్యధికశాతం అప్పులు (రూ.42.58కోట్లు) చూపిన పార్టీ టీడీపీనే అని తెలిపింది. అంతకుముందు ఏడాదిలో టీడీపీ అప్పులు రూ.27.09 కోట్లు అని, 2020-21కి సంబంధించి ఎంఐఎం ఆడిట్‌ రిపోర్టు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అసంపూర్తిగా ఉందని తెలిపింది.