సిగరెట్లపై హెల్త్ ట్యాక్స్ : మీ ఇష్టం కానీయండి..

సిగరెట్లపై హెల్త్ ట్యాక్స్ : మీ ఇష్టం కానీయండి..

సిగరెట్లతోపాటు బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని.. భారీగా విధించాలని కేంద్రం ఆలోచిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. పొగాకు ఉత్పత్తి, తయారీ కంపెనీల నుంచి పెద్దగా పన్నులు రావటం లేదంట.  ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో రాబడి లేకపోవటంతో.. ఈ మేరకు హెల్త్ ట్యాక్స్ విధించాలనే ఆలోచన చేస్తుందంట. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇదే విషయాన్ని పబ్లిక్ హెల్త్ గ్రూప్స్ కూడా నిర్థారించాయి. 

పొగాకు కంపెనీల నుంచి జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉంటున్నాయని.. టార్గెట్ రీచ్ అవుతున్నా.. పెరుగుదల మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవటంతో.. సిగరెట్లు, బీడీల అమ్మకాలపై హెల్త్ ట్యాక్స్ విధించాలని ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని పబ్లిక్ హెల్త్ గ్రూప్స్ వెల్లడించటం ఇప్పుడు విశేషం. 

ఇప్పటికే మార్కెట్ లో సిగరెట్లు ధరలు భారీగా ఉన్నాయి. ఒక్క గోల్డ్ ప్లాక్ కింగ్ సైజ్ సిగరెట్ 20 రూపాయలుగా ఉంది. మిగతా సిగరెట్ల రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. జీఎస్టీ వచ్చిన తర్వాత.. ఆరేళ్లలోనే సిగరెట్ల ధరలు 75 శాతం పెరిగాయి. అయినా కేంద్రానికి ఆదాయం రావటం లేదని చెప్పటం ఏంటని పొగరాయుళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం సిగరెట్లపై 49 శాతం, బీడీలపై 22 శాతం, పొగ లేని పొగాకు ఉత్పత్తులపై 63 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. అంటే 20 రూపాయల సిగరెట్ పై 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు పొగరాయుళ్లు. ఇంత పన్ను కడుతున్నా.. హెల్త్ ట్యాక్స్ విధించటం ద్వారా ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు వ్యాపారులు.

ధరలు పెంచటం ద్వారా వినియోగదారులను ఆ అలవాటు నుంచి దూరం చేయొచ్చనే ఆలోచన కూడా చేస్తుంది కేంద్రం. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం పొగాకు ఉత్పత్తులపై 75 శాతం పన్నులు విధించాలనే సూచన ఉంది.. ఈ రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే మాత్రం సిగరెట్ రేట్లు వచ్చే బడ్జెట్ నుంచి భారీగా పెరగటం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు.