హిమాచల్‌, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన

హిమాచల్‌, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు  ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజంతా(జూన్25)మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే, ఈసమయంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు రానున్న మూడు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 28 నాటికి రుతుపవనాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా వాతావరణ శాఖ అంచనా వేసింది. 

యూపీకి రుతుపవనాలు

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యూపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదివారం(జూన్25)నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని అనేక నగరాల్లో గత కొన్ని గంటలుగా ( వార్త రాసే సమయానికి)  అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం పొందారు. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌లో ఒకటి లేదా రెండు రోజుల్లో ఎప్పుడైనా తాకవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ముంబైలో భారీ వర్షం .. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ముంబైలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) శనివారం (జూన్24) ముంబైకి ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రాబోయే 4-5 రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం నైరుతి రుతుపవనాలు శనివారం(జూన్ 24) నగరానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రాబోయే 5 రోజుల్లో(జూన్ 25, 26, 27,28,29) తీవ్రమైన వాతావరణాన్ని అంచనా వేస్తున్నట్టు ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఎల్లోఅలర్ట్  అంటే నివాసితులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ( జూన్ 23,24)  మహారాష్ట్రలోని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ జూన్ 26,27 తేదీలలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. రాయ్‌గఢ్, థానే, పాల్ఘర్ మరియు ముంబై జిల్లాల్లో శనివారం ( జూన్ 24)నుంచి  తేలికపాటి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిపార్జోయ్ తుఫాను కారణంగా దాదాపు 10 రోజుల ఆలస్యం తర్వాత జూన్ 23-25 మధ్య రుతుపవనాలు ముంబైకి వస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. జూన్ 11న రుతుపవనాలు రత్నగిరి తీరప్రాంతానికి చేరుకున్నప్పటికీ, బిపార్జోయ్ తుఫాను కారణంగా ఎటువంటి పురోగతి సాధించలేకపోయిందని ముంబై వాతావరణ శాఖాధికారి తెలిపారు.

ALSO READ:కొండెక్కాలంటే భయపడుతున్న భక్తులు.. .తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం