ముస్లిం పర్సనల్ లా ప్రకారం హిందూ – ముస్లిం వివాహం చెల్లదు

ముస్లిం పర్సనల్ లా ప్రకారం హిందూ – ముస్లిం వివాహం చెల్లదు
  • ముస్లిం పర్సనల్ లా ప్రకారం హిందూ-– ముస్లిం వివాహం చెల్లదు
  • మధ్యప్రదేశ్  హైకోర్టు తీర్పు

భోపాల్: ముస్లిం పర్సనల్  లా ప్రకారం ముస్లిం యువకుడు, హిందూ యువతి మధ్య వివాహం చెల్లదని మధ్యప్రదేశ్  హైకోర్టు పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టం కింద హిందూ–ముస్లిం వివాహం.. ముస్లిం పర్సనల్  లా ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక వివాహ చట్టం 1954 కింద తమ మతాంతర వివాహాన్ని రిజిస్టర్  చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ‘‘ముస్లిం యువకుడు, హిందూ యువతి స్పెషల్  మ్యారేజ్  యాక్ట్  ప్రకారం పెళ్లి చేసుకున్నా.. ముస్లిం లా కింద వారి వివాహం చెల్లుబాటు కాదు. ఎందుకంటే, విగ్రహారాధన చేసే లేదా అగ్నిహోత్రిని ఆరాధించే యువతిని ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని మహమ్మదన్  చట్టం ఒప్పుకోదు” అని జస్టిస్  గుప్పాల్  సింగ్  అహ్లువాలియా స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీచేశారు. మతాంతర వివాహం చేసుకున్న ముస్లిం యువకుడు, హిందూ యువతి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. 

ఆ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వారి పెళ్లిని ఆమోదిస్తే, సమాజం తమను ఒంటరిని చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు యువతి బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయిందని తెలిపారు. జంట తరపున అడ్వొకేట్  వాదిస్తూ.. ప్రత్యేక వివాహ చట్టం కింద వారు పెళ్లి చేసుకున్నారని, వారికి పోలీసు రక్షణ ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక వివాహ చట్టం కింద వారు పెండ్లి చేసుకున్నా.. ముస్లిం పర్సనల్  చట్టం ప్రకారం అది చెల్లదని తీర్పు చెప్పింది.