- 12,728 స్థానాల్లో మహిళలకు 5,849.. మొత్తంగా 46 శాతం కేటాయింపు
- ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, జనరల్ 5,244
- 12 జిల్లాల్లో 200కుపైగా
- స్థానాలు మహిళలకే
- మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు
- అత్యధిక సర్పంచ్ స్థానాలు
- 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో
- ఎస్సీలకు 100కు పైగా పదవులు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు దాదాపు సగం వాటా దక్కింది. జిల్లాలవారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు వారికే లభించనున్నాయి. 12,728 పంచాయతీల్లో మహిళలకు 5,849 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. మొత్తం స్థానాల్లో ఇది 46 శాతానికి సమానం. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచ్‌లే పాలన సాగించనున్నారు.
సామాజిక వర్గాలవారీగా..ఎస్టీలకు 3,201 స్థానాలు, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110 స్థానాలు దక్కాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీలకే 100 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఓవరాల్‌గా గిరిజనులకే అత్యధిక సర్పంచ్ సీట్లు దక్కాయి. ఇవి పోగా, మిగిలిన 5,244 స్థానాలు జనరల్ (అన్రిజర్డ్వ్) కోటా కింద ఉంచారు.
నల్గొండ జిల్లాలో అత్యధికం..
రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో మహిళలకు 200కు పైగా సర్పంచ్‌స్థానాలు దక్కాయి. 50 శాతం కోటా కింద ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లోనూ మహిళలకు సర్పంచ్పీఠాలు దక్కనున్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 404 స్థానాలు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలో 200, ఆపైన సర్పంచ్‌స్థానాలు మహిళలకు కేటాయించడం విశేషం.
షెడ్యూల్డ్ ఏరియాలో పూర్తిగా ఎస్టీలకే..
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో దాదాపు 1200కు పైగా గ్రామాలున్నాయి. ఇందులో సర్పంచ్, వార్డు స్థానాలు పూర్తిగా ఎస్టీలకే దక్కాయి. భద్రాద్రి కొత్తగూ డెంలో 460 స్థానాలు, ఆదిలాబాద్ 312, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో 100 నుంచి 200 వరకు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.
జనరల్‌స్థానాల్లో నల్గొండ టాప్.. భద్రాద్రి లాస్ట్
జనరల్ స్థానాల్లో నల్గొండ టాప్‌లో నిలిచింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 385, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి 271, వికారాబాద్‌లో 257 సర్పంచ్పదవు లు జనరల్కేటగిరీకి దక్కాయి. ములుగు జిల్లాలో కేవ లం 146 పంచాయతీలు మాత్రమే ఉండగా.. జనరల్‌కు అత్యల్పంగా 31 లభించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 9 స్థానాలు మాత్రమే జనరల్కేటగిరీలో ఉన్నాయి. ఈ జిల్లా మొత్తం మీద ఒక్కస్థానం కూడా బీసీకి రిజర్వ్ కాకపోవడం గమనార్హం.
రిజర్వేషన్ల ఖరారు ఇలా..
2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ స్థానాలను కేటాయించగా.. బీసీ రిజర్వేషన్లకు సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే (ఎస్ఈఈఈపీసీ) ను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్గ్రామాలతోపాటు100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు.
ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్థానాల్లో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23 శాతానికి అటు ఇటుగా 46 జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సర్పంచ్రిజర్వేషన్ల కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను (అవరోహణ క్రమంలో) పరిగణనలోకి తీసుకున్నారు.
గతంలో రిజర్వ్అయిన గ్రామాలను రొటేషన్పద్ధతిలో ఈ లిస్టుల్లోంచి తొలగించారు. సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీవోల ఆధ్వర్యంలో పూర్తి చేయగా, వార్డు స్థానాలను ఎంపీడీవోలు ఖరారు చేశారు.
బీసీలకు 100కుపైగా..
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో 100కుపై సర్పంచ్ స్థానాలు దక్కాయి. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 139, ఆ తర్వాత సిద్దిపేట136, నిజామాబాద్125, కామారెడ్డి 123, మెదక్ 108, సంగారెడ్డి117, వికారాబాద్107, యాదాద్రి భువనగిరి జిల్లాలో 105 స్థానాలు లభించాయి. ఎస్సీలకు ఐదు జిల్లాల్లో 100పైగా స్థానాలు కేటాయించారు. నల్గొండలో 153, సంగారెడ్డిలో 126, ఖమ్మంలో 110, రంగారెడ్డి 106, వికారాబాద్‌లో 111స్థానాలు దక్కాయి.
సామాజిక వర్గాలవారీగా మహిళ, జనరల్ వివరాలు..
ఎస్టీ మహిళ 1,464 ఎస్టీ జనరల్ 1,737
ఎస్సీ మహిళ 928 ఎస్సీ జనరల్ 1,182
బీసీ మహిళ 968 బీసీ జనరల్ 1,210
అన్రిజర్వ్డ్మహిళ 2,489 అన్రిజర్వ్డ్ జనరల్2,757
