సంక్రాంతికి సంప్రదాయ ఆటలు..వీటన్నింటి వెనక కొంత చరిత్ర

సంక్రాంతికి సంప్రదాయ ఆటలు..వీటన్నింటి వెనక కొంత చరిత్ర

పండుగంటే ఆటలు పాటలు అన్నీ ఉండాలి. అందుకే పండుగల్లో ఆటలు కూడా ఒక భాగంగా ఉంటాయి. కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం, దసరాకు బతుకమ్మ ఆడడం, సంక్రాంతికి కోడి పందాలు.. ఇలా రకరకాల ఆటలు ఉంటాయి. అయితే, వీటన్నింటి వెనక కొంత చరిత్ర, ఫిలాసఫీ కూడా ఉన్నాయి. 

గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి పందెం కోళ్ల హడావిడి మామూలుగా ఉండదు. ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతాయి. కోడి పందాలు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ టైంలో బరిలోకి దింపాలి? ఏ కోడిపుంజు బాగా ఆడుతుంది? ఏది గెలుస్తుంది? వంటి వాటికి ఒక లెక్క ఉంది. అవన్నీ తెలుసుకుని కోడి పందాలకు రెడీ చేస్తారు. అందుకోసం కుక్కుట శాస్త్రంలో చెప్పినట్టు చేస్తారట! అందులో నక్షత్రాల కదలికను బట్టి గెలుపోటముల్ని అంచనా వేస్తారు. 

పందెం కోళ్లను బాదం, జీడిపప్పు, పిస్తా, మాంసం పెట్టి పెంచుతారు. పందెం కోళ్లకు హంస, కాకి, సేతు, డేగ, నెమలి వంటి పేర్లు పెడతారు. సంక్రాంతికి రెండు మూడు నెలల ముందే పందెం కోసం ప్రత్యేకంగా కోళ్లు కొని, వాటిని పెంచుతుంటారు.

ఈ పోటీ జరిగేటప్పుడు బెట్టింగ్​లు కూడా పెడుతుంటారు. కానీ1960లో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్​ కింద కోడి పందాలను ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే 2018లో ట్రెడిషనల్ పద్ధతిలో సరదాకి మాత్రమే పోటీలు నిర్వహించాలని సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కోళ్లకు కత్తులు, బ్లేడ్స్ కట్టడం, గ్యాంబ్లింగ్​ లేదా బెట్టింగ్ చేయొద్దని చెప్పింది. 
కోడి పందాలు ఆంధ్రప్రదేశ్​లో చాలా ఫేమస్. 2019 రిపోర్ట్ ప్రకారం.. ఈ పోటీ వల్ల మూడు రోజుల్లో 900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకుపైగా కోడి పుంజులు పందాల్లో పాల్గొంటాయట! 

అదో సరదా

పూర్వం ఇండియాలో ఎంటర్​టైన్​మెంట్​ కోసం అడవి కోడి, కోడి పుంజుల మధ్య పందెం పెట్టేవాళ్లు. వీటిని ‘బ్యాటిల్​ ఆఫ్​ పల్నాడు’ పేరిట 1178–1182  పేరుతో రికార్డ్​ చేశారు. అవే కోడిపుంజుల పందాలుగా ఆంధ్రప్రదేశ్​లో జరుగుతుంటాయి. తెలంగాణ, కర్నాటక, ఒరిస్సాలలో కూడా కొన్ని చోట్ల ఇవి జరుగుతుంటాయి. 

పందాలకోసమే..

కోడిపందెం అనేది పాతకాలం నాటి క్రీడ. ఇది సింధులోయ నాగరికత అప్పుడు జరిగినట్లు ఆధారాలున్నాయి. ఇండియాలోనే కాదు, చైనా, పర్షియాలతోపాటు తూర్పు దేశాల్లో ఈ పందాలు పాపులర్​. అక్కడి నుంచి పురాతన గ్రీస్​ దేశానికి పరిచయమైంది. సింధు నాగరికతలో కోళ్లను తినడానికి కాకుండా పందాల కోసమే పెంచేవాళ్లు. అది కాస్తా క్రీస్తు పూర్వం వెయ్యో సంవత్సరం నుంచి మతపరమైన అంశంగా మారిపోయింది. 

ఇలాగే తమిళనాడులో కూడా జల్లి కట్టు జరుగుతుంది. ఇది ఎద్దుల పోటీ. అయితే, ఇందులో మనుషులకు గాయాలవ్వడం పెద్ద ఇష్యూగా మారింది. దాంతో మొదట దీన్ని కూడా బ్యాన్ చేశారు. ఆ తర్వాత 2017లో ఈ ఆటని కంటిన్యూ చేయొచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ముల్లై అనే ప్రాంతంలో ఉండే అయర్​ అనే తెగ వాళ్లు ఈ ఆట ఆడేవాళ్లు. ఈ ఆట దాదాపు కొన్ని వందల ఏండ్ల నాటిది. ఆ తర్వాత కాలంలో ఈ ఆటను ధైర్యానికి ప్రతీకగా చూస్తున్నారు. ఇది కూడా సింధులోయ నాగరికత నుంచే వచ్చింది. అందుకు సంబంధించిన శిల్పం ఒకటి న్యూఢిల్లీలోని నేషనల్​ మ్యూజియంలో ఉంది. తమిళనాడు మ్యూజియంలో మరో ప్రతిమ ఉంది. 
 
పదపదవే... పతంగి

సంక్రాంతి పండుగ టైంలో పతంగులు ఎగరేయడం కూడా ఆనవాయితీ. సరదాగా ఆకాశంలోకి పతంగు​లు ఎగరేస్తుంటారు. అయితే సంక్రాంతికి ఇలా పతంగులు ఎగరేయడం వెనక ఒక కారణం ఉంది! అదేంటంటే.. సంక్రాంతి అంటే సూర్యదేవుడి పండుగ. సూర్య కిరణాలు శరీరాన్ని తాకితే..శీతాకాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్, రోగాలు దరి చేరవు. సూర్యరశ్మి వల్ల డి–విటమిన్ అందుతుంది.

అందుకే పతంగులు ఎగరేయమన్నారట! పతంగులు ఎగరేయడం వెనక ఇది ఒక కారణం అయితే... సిరిసంపదలు ఇచ్చిన దేవుడికి ‘కృతజ్ఞతలు’ చెప్తూ గాలిపటాలు ఎగరేస్తారని కొందరు చెప్తారు. సంక్రాంతి పండుగ రోజుల్లో దేశమంతా పతంగులు ఎగరేస్తారు. కానీ, గుజరాత్, రాజస్తాన్​లో మాత్రం ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. గుజరాత్​లో1989 నుంచి ప్రతి ఏటా ‘ఇంటర్నేషనల్​ కైట్ ఫెస్టివల్​’ భారీ ఎత్తున జరుగుతుంటుంది.