- అక్టోబర్ 1 నుంచి 8 శాతం వరకు పెంచనున్న తయారీ కంపెనీలు
- కాపర్ రేట్లు, రవాణా ఛార్జీలు పెరగడమే కారణం
- ఇరాన్ యుద్ధంతో ఆయిల్, ప్లాస్టిక్ సంబంధిత ధరలూ జంప్
న్యూఢిల్లీ:హోమ్ అప్లయెన్స్ తయారీ కంపెనీలు దసరా ముందు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. తమ ప్రొడక్ట్‌ల ధరలను 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఎయిర్ కండీషనర్లు (ఏసీలు), ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనుకునే వారిపై భారం పెరగనుంది. హోమ్ అప్లయెన్స్‌ల ధరలు పెరగడం ఈ ఏడాది ఇది మూడోసారి. జనవరి, ఏప్రిల్‌లోనూ ధరలు పెరిగాయి.
రేట్లు పెరగడానికి గల కారణాలు
ధరల పెంపునకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ముడిసరుకుల ఖర్చులు పెరగడమే కారణమని తయారీదారులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలకంగా వాడే రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో మెట్రిక్ టన్నుకు 8,000–9,000 డాలర్లు (దాదాపు రూ.8.6 లక్షలు) గా ఉన్న రాగి ధర ప్రస్తుతం ఏకంగా 14,500 డాలర్ల (రూ.13.92 లక్షల) కు చేరింది. ఒక్కో ఏసీ తయారీకే 3 నుంచి 4 కిలోల రాగి అవసరం అవుతుంది. దీనికితోడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల క్రూడాయిల్, ప్లాస్టిక్ సంబంధిత ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరిగాయి. రూపాయి విలువ క్షీణించడం, విదేశాల నుంచి సరుకు రవాణా చేసే షిప్పింగ్ ఛార్జీలు విపరీతంగా పెరగడం కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది.
ఎయిర్ కండీషనర్లు: రాగి వినియోగం ఎక్కువ కాబట్టి ఏసీల ధరలు అత్యధికంగా 5శాతం నుంచి 8శాతం వరకు పెరగనున్నాయి. డైకిన్ వంటి సంస్థలు ఇప్పటికే 8–-10శాతం వరకు పెంచేశాయి. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే అక్టోబర్ తర్వత మరోసారి రేట్ల పెంపు ఉంటుందని తెలిపాయి.
టీవీలు, వాషింగ్ మెషిన్లు: వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 3శాతం నుంచి 4శాతం వరకు పెరగనున్నాయి. చిన్న సైజు స్క్రీన్ టీవీల ధరలు దీపావళి తర్వాత 20శాతం వరకు, పెద్ద సైజ్ స్క్రీన్ టీవీల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తయారీదారులు హెచ్చరిస్తున్నారు. బ్లూస్టార్, గోద్రెజ్, హైయర్, డైకిన్, ఎస్‌పీపీఎల్ (థామ్సన్, కొడాక్, బ్లూపంక్ట్), ఎల్‌జీ, హిటాచీ బ్రాండ్లు ఇప్పటికే ధరల పెంపును ఖరారు చేయగా, ప్యానసోనిక్ మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. హైయర్ సంస్థ అక్టోబర్ నుంచి జనవరి లోపు విడతలవారీగా దాదాపు 15శాతం వరకు పెంచే యోచనలో ఉంది.
కొంత ఊరట
సాధారణంగా ఎలక్ట్రానిక్స్ యాన్యువల్ సేల్స్‌లో 30 నుంచి 40శాతం వ్యాపారం ఓనం నుంచి దీపావళి మధ్యలోనే జరుగుతుంది. అలాంటి సమయంలో ధరల పెంపు పండుగ అమ్మకాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కొందరిలో ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఒక చిన్న ఊరట ఉంది. డీలర్లు, దుకాణదారులు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే పాత ధరలకే పెద్ద ఎత్తున స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంచారు.
ఈ నిల్వలు మరో నెల లేదా నెలన్నర వరకు సరిపోతాయి. ఫలితంగా, చాలా వరకు దుకాణాల్లో దీపావళి ముగిసే వరకు పాత ధరలకే ఉత్పత్తులు లభించే అవకాశముంది. అయితే దీపావళి ముగిసిన వెంటనే కొత్త, పెరిగిన ధరలు పూర్తిగా అమలులోకి రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
