మంత్రి బందోబస్తుకు వచ్చిన హోంగార్డ్ మిస్సింగ్

మంత్రి బందోబస్తుకు వచ్చిన హోంగార్డ్ మిస్సింగ్
  • వెతుకుతున్న అమ్రాబాద్ పోలీసులు
  • దొరకని ఆచూకీ... 

అమ్రాబాద్, వెలుగు: మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగా మంగళవారం డ్యూటీ చేసిన ఓ హోంగార్డ్ కనిపించకుండా పోయాడు. సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో మంగళవారం ఉదయం స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. దీంతో ఈగలపెంట పీఎస్ లోని హోంగార్డు వెంకటేశ్​తో పాటు మరో ఇద్దరికి గ్రామంలోని దుర్వాసుల చెరువు, హరిత హోటల్ వద్ద డ్యూటీ వేశారు. మధ్యాహ్నం డ్యూటీ పూర్తయ్యాక తోటి హోంగార్డులందరూ వెళ్తుండగా ‘నేను వస్తున్నా ..కొంచం ఆలస్యమవుతుంది. మీరు వెళ్లండి’ అని చెప్పి పంపించారు.

కానీ, ఈగలపెంట పోలీస్​స్టేషన్​లో సాయంత్రం జరిగిన పరేడ్ కు హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఆరా తీయగా అతడితో డ్యూటీ చేసిన సిబ్బంది జరిగింది చెప్పారు.  సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా డ్యూటీ తర్వాత చెరువు వైపు వెళ్లినట్లు కనిపించిందని సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వీరమల్లు తెలిపారు. చెరువుతో పాటు అడవిలో వెతికించినా ఆచూకీ దొరకలేదన్నారు. బంధువులను విచారించామని, ఫోన్​ కలవడం లేదని తెలిపారు. వెంకటేశ్​భార్య మాట్లాడుతూ మంగళవారం ఉదయం డ్యూటీలో ఉన్నప్పుడు తాను కాల్ ​చేశానని, మధ్యాహ్నం ఇంటికి వస్తా అని చెప్పాడని, అంతలోనే ఎటు పోయాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.