హోమ్​ లోన్స్​ జోరు.. ఇళ్ల కొనుగోలుపై తగ్గని ఆసక్తి

హోమ్​ లోన్స్​ జోరు.. ఇళ్ల కొనుగోలుపై తగ్గని ఆసక్తి

వెలుగు బిజినెస్​ డెస్క్​: దేశంలోని బ్యాంకులు గడచిన ఫైనాన్షియల్​ ఇయర్లో కార్పొరేట్లకు కంటే ఇంటి లోన్లే ఎక్కువగా ఇచ్చాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇంటి కొనుగోలుపై మోజు తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. కార్పొరేట్లు తీసుకునే అప్పులు అనుకున్న దానికంటే నెమ్మదించాయి. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో కార్పొరేట్​ లోన్లు 5.7 శాతం మాత్రమే పెరిగాయి. అంతకు ముందు ఫైనాన్షియల్​ ఇయర్లో కార్పొరేట్​ లోన్లు 7.5 శాతం పెరగడం గమనించాలి. మరోవైపు 2022–23 లో ఇండ్ల అప్పులు 15 శాతం గ్రోత్​ కనబరిచినట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) డేటా వెల్లడించింది. 2021–22 లో హోమ్​ లోన్లు 12.9 శాతమే పెరిగాయి. 

కస్టమర్ల కోసం బ్యాంకుల వేట...

కార్పొరేట్​ లోన్లు ఆశించినంతగా పెరగకపోవడంతో చాలా బ్యాంకులు ఇండ్ల అప్పులు ఇవ్వడం కోసం కస్టమర్లను వెతకడం మొదలెట్టాయి. ఫలితంగా మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో ఇంక్రిమెంటల్​ హౌసింగ్​ లోన్లు రూ.  2.5 ట్రిలియన్​లకు చేరాయి. గత 15 ఏళ్లలో బహుశా ఇదే అత్యధికమని ఆర్​బీఐ డేటా చెబుతోంది. పరిశ్రమలకు 2022–23 లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు రూ. 1.8 ట్రిలియన్​లకే పరిమితమయ్యాయి. లోన్​ రీపేమెంట్లను మినహాయించి ఈ లెక్కలు కట్టారు. 2021–22 లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ సంవత్సరంలో కార్పొరేట్లు రూ. 2 ట్రిలియన్​ల మేరకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాయి. అదే ఏడాదిలో ఇంటి లోన్లు రూ. 95,419 కోట్లు మాత్రమే. 
ఇంటి లోన్లు తీసుకునే వారి బిహేవియర్​ ఒకే విధంగా ఉండటం లేదు. ఒక్కో బ్యాంకులో  ఒక్కో రకంగా ఉంటోంది. హోమ్​లోన్లకు డిమాండ్​ పెద్దగా కనబడటం లేదని కొన్ని బ్యాంకులు చెబుతుంటే, మరికొన్ని బ్యాంకులు మాత్రం ఇంటి కొనుగోలును కొంత మంది వాయిదా వేసుకుంటున్నట్లు చెబుతున్నాయి. కిందటేడాది మే నుంచి రెపో రేటును 250 బేసిస్​ పాయింట్ల మేర రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) పెంచింది. మా ఇంటి లోన్ల పోర్ట్​ఫోలియో ఈ ఏడాది మరింత వేగంగా పెరిగే ఛాన్స్​ ఉందని కెనరా బ్యాంకు చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ కే సత్యనారాయణ రాజు చెప్పారు. ఇంటి రుణాలు తీసుకునే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హోమ్​లోన్ల సెక్టార్ కెనరా బ్యాంకుకు చాలా ముఖ్యమైనది, ఈ అవకాశాన్ని వదులుకోవడం మాకు ఇష్టం లేదని రాజు వెల్లడించారు. ఈ బ్యాంకు ఇండ్ల కొనుగోళ్లకు ఇచ్చిన అప్పులు 2022–23 లో 14.3 శాతం పెరిగాయి.  ఇంటి లోన్లకు డిమాండ్​ తగ్గే సూచనలేవీ లేదని రాజు చెబుతున్నారు. మరోవైపు ఈ బ్యాంకు ఇచ్చిన కార్పొరేట్ లోన్లు కూడా 2022–23 లో 21 శాతం ఎగిశాయి. సెక్వెన్షియల్​గా చూస్తే మాత్రం ఇవి కొంత తగ్గాయి.

పెరిగిన పోటీ..

హోమ్​లోన్లకు డిమాండ్​ ఎక్కువైన నేపథ్యంలో బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల మధ్య పోటీ తీవ్రమైంది. యాక్సిస్​ బ్యాంక్​ హోమ్​ లోన్లు 5 శాతం పెరిగాయి. ఈ సెగ్మెంట్లో  పోటీ ఎక్కువైందని, ఫలితంగా రేట్లు తగ్గిస్తున్నారని యాక్సిస్​ బ్యాంక్​ సీఈఓ అమితాబ్​ చౌదరి ఎనలిస్టుల మీటింగ్​లో చెప్పారు. కొటక్​ మహీంద్రా బ్యాంక్​ హోమ్​లోన్​– లోన్​ ఎగెనెస్ట్​ ప్రాపర్టీ (ల్యాప్​) సెగ్మెంట్​ 2022–23 లో 22 శాతం ఎక్కువైంది. చివరి క్వార్టర్లో కొంత డిమాండ్​ తగ్గింది. మార్చి నెలలోనైతే రేట్ల విషయంలో పోటీ తీవ్రమైందని కొటక్​ మహీంద్రా బ్యాంకు హోల్ టైమ్​ డైరెక్టర్​ శాంతి ఏకాంబరం వెల్లడించారు. ప్రీమియం, లగ్జరీ ఇండ్ల కొనుగోలు మాత్రం డిమాండ్​ పుంజుకుంటోందని ఆమె చెప్పారు.

ఎఫర్డబుల్​ హౌసింగ్​ డిమాండ్​ తగ్గుతోంది..

ఇంటి కొనుగోళ్లపై వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం అసలు లేనే లేదని చెప్పడం తప్పవుతుంది. కానీ, ఎఫర్డబుల్​ హౌసింగ్​ సెగ్మెంట్లో ఈ ఎఫెక్ట్​ ఎక్కువగా కనబడుతోంది. వడ్డీ రేట్ల పెంపుదల ఈ సెగ్మెంట్లోని కస్టమర్లపై ప్రభావం బాగా చూపెడుతోంది. మిడ్​రేంజ్, అప్​మార్కెట్​ కస్టమర్లపై మాత్రం వడ్డీ రేట్ల పెంపు ఎఫెక్ట్​ అంతగా కనిపించడం లేదని బ్యాంకింగ్​ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా మిడ్​ రేంజ్​ హోమ్స్​ సెగ్మెంట్​ హౌసింగ్​ డిమాండ్​ను పెంచుతోందని ఇటీవల సీఐఐ–ఎనరాక్​ రిపోర్టు పేర్కొంది. డెవలపర్లు కూడా ప్రీమియం సెగ్మెంట్లో కొత్త ప్రాజెక్టులను తక్కువ రేట్లకు లాంఛ్​ చేస్తున్నట్లు ఈ రిపోర్టు వివరించింది.