వాట్సాప్ గ్రూపులలో హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల డేటా

వాట్సాప్ గ్రూపులలో హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల డేటా

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. దాంతో యావత్ ప్రజానీకం ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నవారిని కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్వారంటైన్‌లో ఉన్న వారి గురించి సోషల్ మీడియాలలో ప్రచారం కావడం మాత్రం చాలా మందిని బాధపెడుతుంది. హోం క్వారంటైన్ ఉన్న ఇంటి ముందు ప్రభుత్వ అధికారులు హోం క్వారంటైన్ స్టిక్కర్ వేస్తున్నారు. దాంతో ఆ ఇంటి హోం క్వారంటైన్ గురించి ఇరుగుపొరుగు వాళ్లకు తెలుస్తుంది. అంతేకాకుండా.. వారి గురించి వాట్సాప్ గ్రూపులలో కూడా ప్రచారం జరుగుతుంది. దాంతో ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆ ఇంటిని, ఆ ఇంటి కుటుంబసభ్యులను వెలివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

హోం క్వారంటైన్‌లో ఉన్న తమ గురించి ప్రసార మాధ్యమాలలో ప్రచారం కావడం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. అలా ప్రచారం కావడం వల్ల తమ యొక్క వ్యక్తిగత సమాచారం అంతా బహిరంగమవుతుందని వారు అంటున్నారు. ఇలా కరోనా బాధితుల యొక్క సమాచారాన్ని ప్రభుత్వాలు బహిరంగపరచడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని.. ఇది చాలామంది వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగిస్తుందని వారు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇళ్ల ముందు హోం క్వారంటైన్ స్టిక్కర్లు వేయడం మానుకోవాలని కరోనా బాధితులు కోరుతున్నారు.

హోం క్వారంటైన్ స్టిక్కర్ ఉన్న ప్రతి ఇంట్లో.. కరోనా పాజిటివ్ కేసు ఉన్నట్లు కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్ శ్రీవాస్తవ అన్నారు.

బెంగళూరులో హోం క్వారంటైన్‌లో ఉన్న ఒక వ్యక్తి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో గురువారం పోస్టు చేశాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి పోస్టు ప్రకారం.. ఆ ఇంటి ముందు వేసిన హోం క్వారంటైన్ స్టిక్కర్ కొన్ని రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వంచే వేయబడింది. ఆ స్టిక్కర్ అక్కడి వాట్సాప్ గ్రూపులలో తెగ చక్కర్లుకొడుతుంది. ఆ స్టిక్కర్‌పై ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడం వల్ల తాను తీవ్రంగా మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఆయన అన్నారు. దిగ్బంధంలో ఉన్న ఒక వ్యక్తి డేటాను బహిరంగపరచడం అన్యాయమని ఆయన అంటున్నారు.

అయితే ఈ విషయానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇలా చేయడం వల్ల మరెవరూ బయటకు రావడానికి సాహసించరు అని అన్నారు.

పబ్లిక్ షేరింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. అటువంటి సమాచారాన్ని పంచుకోవడం చట్టరిత్యా నేరమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి అన్నారు. ‘నేను నా కాలనీ వాట్సాప్ గ్రూప్‌లో ఒక జాబితా చూశాను. అందులో క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల పేర్లు, చిరునామాలు, పాస్‌పోర్ట్ వివరాలు, పుట్టిన తేదీ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ సమాచారం.. డేటా దొంగతనానికి కారణమవుతుంది’ అని ఆమె అన్నారు.

కాగా.. ఇలా డేటా ప్రచారం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ శశి కౌషల్ మాత్రం సమర్థించుకుంటున్నారు. తాము హోం క్వారంటైన్ ఇంటికి స్టిక్కర్ వేయడమే కాదు… ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లను మరియు ఆ ఏరియా పోలీసులను కూడా కలుసుకొని ఆ ఇంటిపై నిఘా ఉంచమని చెబుతామని ఆయన అన్నారు. హోం క్వారంటైన్ ఇంటికి ఎవరూ వెళ్లొద్దని రాయడంలో తప్పులేదని ఆయన అంటున్నారు. ఇలా రాయడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన అంటున్నారు.

దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే సమాచారాన్ని బహిరంగం చేస్తున్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎపిడెమిక్స్ డిసీజ్ యాక్ట్ సెక్షన్ 2 కింద మార్గదర్శకాలను జారీ చేసి.. దీనిని ఆపివేయించాలని పలువురు కోరుతున్నారు. ఈ బహిరంగ సమాచారంపై ఒరిస్సా ప్రభుత్వం మార్చి 21న ఒక ఉత్తర్వు కూడా జారీ చేసి.. సమాచారాన్ని బహిరంగం చేయవద్దని ఆదేశించింది.

For More News..

సిబ్బంది కోసం రూ. 750 కోట్లు కేటాయించిన వార్నర్ మీడియా

మాస్కు లేకుంటే 300.. గుంపుగా ఉంటే 500 ఫైన్

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి