విరాళాలతో పుట్టిన హోండా

విరాళాలతో పుట్టిన హోండా

ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నడకే దిక్కు. ఆ తర్వాత జంతువుల్ని వెహికల్స్​గా మార్చుకున్నారు. మెల్లగా సైకిల్స్​, ట్రైన్స్​, కార్స్​, మోటార్​ బైక్స్​, ఫ్లైట్స్​ వచ్చాయి. అయితే, వీటిలో సామాన్యునికి బాగా దగ్గరైంది మాత్రం రెండే.. ఒకటి సైకిల్​, రెండు మోటార్ ​బైక్​. ముఖ్యంగా మనదేశంలో వీటిదే రాజ్యం. ఇప్పుడైతే సైకిల్​కన్నా బైక్​లదే హవా. మార్కెట్లో రకరకాల కంపెనీల బైక్​లు కనిపిస్తున్నా, వాటిలో టాప్​‌‌‌‌–5లో కచ్చితంగా ఉండేది హోండా. ఈ కంపెనీ బైక్​లకు అంత డిమాండ్​ ఉంది మనదగ్గర. అంత ఫేమస్​ అయిన హోండా కంపెనీ పుట్టుక వెనక ఎన్నో కష్టాలున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి కఠోర శ్రమ, పట్టుదల, లక్ష్యం వదిలిపెట్టని స్వభావం ఉన్నాయి. ఆయనే సోయిచిరో హోండా. 

జపాన్​లోని ఇవట జిల్లాలో ఉన్న కోమ్యో అనే చిన్న గ్రామంలో నవంబర్​17, 1906లో పుట్టాడు సోయిచిరో హోండా. తల్లిదండ్రులు గిహెయి, మికా. వీరికి సోయిచిరో తర్వాత మరో 8 మంది పిల్లలు పుట్టారు. అయితే, సరైన వైద్య సౌకర్యాలు లేక వీళ్ళలో సగం మంది పుట్టిన కొన్నేండ్లకే చనిపోయారు. దాంతో సోయిచిరోకు తోడుగా ముగ్గురు మాత్రమే మిగిలారు. తండ్రి గిహెయి పాత సైకిళ్లు రిపేర్​ చేసేవాడు. తల్లి మికా నేత పని చేసేది. 

ఆ మూడు సంఘటనలు 

సోయిచిరోకు చదువు అబ్బలేదు. స్కూల్​లో మార్కులు కూడా తక్కువగా వచ్చేవి. అయితే, చిన్నప్పటి నుంచే మెషిన్స్​, వెహికల్స్​ మీద చాలా ఇష్టం ఉండేది. అతని జీవితంలోని మూడు సంఘటనలు ఈ విషయాన్ని చెప్తాయి. కోమ్యో గ్రామం చుట్టుపక్కల రైస్​ మిల్లులు ఉండేవి. వీటిలో బియ్యం పాలిష్​ చేసేవాళ్ళు. దీనికి గ్యాసోలిన్​ స్టీమ్​ ఇంజిన్లు వాడేవాళ్ళు. చిన్నప్పుడు ఈ రైస్​ మిల్లుల్లోకి తాతతో కలిసి వెళ్ళేవాడు సోయిచిరో. స్టీమ్​ ఇంజిన్లు పనిచేసేటప్పుడు ఆసక్తిగా చూసేవాడు. వాటి నుంచి వచ్చే నీలం రంగు పొగ, ఆయిల్​ వాసన బాగా నచ్చేది. మరోసారి ఊళ్ళోకి ఒక కారు వచ్చింది. దాని వెంట పరిగెత్తి, కారు వెనక బంపర్​ పట్టుకొన్నాడు. గ్రీజు, ఆయిల్​, పొగ మొఖంపైన, ఒంటి మీద పడ్డాయి. ఈ సంఘటన తర్వాత ఎప్పుడూ కార్ల గురించే ఆలోచించేవాడు సోయిచిరో. మరోసారి.. దగ్గరలోని హమమత్సు సిటీకి ఆనుకుని ఉన్న ఎయిర్​బేస్​లోకి విమానం వచ్చింది. దాన్ని చూడ్డానికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళాడు. తండ్రి జేబులోంచి కొంత డబ్బు, షాపులోని సైకిల్ తీసుకెళ్ళాడు. అయితే, అది పెద్దవాళ్ళ సైకిల్​. సోయిచిరోకు సీట్​ అందలేదు. అందుకని హాఫ్​ పెడల్​ తొక్కుకుంటూ20 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్​బేస్​కు చేరుకున్నాడు. ఎంట్రీ ఫీజుకు డబ్బు సరిపోకపోవడంతో ఎయిర్​బేస్​ గోడకు ఆనుకొని ఉన్న చెట్టెక్కాడు. విమానం చూసి, తీరిగ్గా ఇంటికొచ్చాడు. అప్పటికే అతని కోసం వెతుకుతున్న తండ్రి.. కుమారుడు వెళ్ళిన పని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఇలా మెషిన్స్​, వెహికల్స్​ మీదే మనసు ఉండడంతో చదువు ఎనిమిదో తరగతితోనే ఆగిపోయింది. ఆ తర్వాత తండ్రికి పనిలో సాయం చేసేవాడు సోయిచిరో.      

మెకానిక్​ షాపులో చేరి..

జపాన్​లో అప్పటికే టొయొటా కంపెనీ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో ఉంది. అందులో పనిచేయాలనేది సోయిచిరో కల. కానీ, ఊళ్ళో ఉంటే తన కోరిక నెరవేరదు అని అనిపించింది. అదే టైంలో పనివాళ్ళు కావాలంటూ టోక్యోలోని ‘ఆర్ట్​ షొకాయ్’ ఆటోమొబైల్​ సర్వీస్​​ షాప్​ ఇచ్చిన ప్రకటన చూశాడు. తండ్రిని ఒప్పించి, 16 ఏండ్ల వయసులో టోక్యోకు చేరుకున్నాడు. ‘ఆర్ట్​ షొకాయ్’లో అప్పటికే పనిచేస్తున్న సీనియర్లు సోయిచిరోను చిన్నచూపు చూసేవాళ్లు. పని నేర్పించకుండా, యజమాని పిల్లాడిని ఎత్తుకొని ఆడించమనేవాళ్లు. వాళ్లు చెప్పిన పనల్లా చేసేవాడు. ఆటోమొబైల్స్​ ఇంజిన్​లో ముఖ్యమైన పిస్టన్​ రింగ్​ తయారీపై ఖాళీ టైంలో, రాత్రి పూట ప్రయోగాలు చేసేవాడు.  అలా ఒక రింగ్​ తయారుచేసి టొయొటా కంపెనీకి తీసుకెళ్ళాడు. కానీ, దాన్ని వాళ్లు రిజెక్ట్​ చేశారు. అక్కడి ఇంజినీర్లు ఎగతాళి చేసి పంపారు. అయినప్పటికీ సోయిచిరో నిరాశ పడలేదు. మెకానిక్​ షాప్​లో ఏ పని అయినా చేసేవాడు. 1923లో వచ్చిన భూకంపంలో ‘ఆర్ట్​ షొకాయ్​’ తీవ్రంగా దెబ్బతింది. షాప్​లో పనిచేసేవాళ్ళంతా ఇండ్లకు వెళ్లిపోయారు. యజమానికి తోడుగా సోయిచిరోతోపాటు మరొక సీనియర్​ మాత్రమే మిగిలారు. ఆ టైంలో సోయిచిరోపై యజమానికి నమ్మకం కుదిరింది. అతడికి మెకానికల్​ రిపేర్లతోపాటు కస్టమర్లతో మాట్లాడే పద్ధతి కూడా నేర్పించాడు.1923లో ఆర్ట్​ షొకాయ్​ కంపెనీ రేసింగ్​ కార్లు తయారుచేయడం మొదలుపెట్టింది. ఇక్కడ తయారైన ‘కుర్టిస్​’ స్పోర్ట్స్​ కార్​ ‘జపాన్​ ఆటోమొబైల్​ కాంపిటీషన్’లో ఫస్ట్​ ప్రైజ్​ గెలుచుకుంది. దాంతో కంపెనీకి ఆర్డర్స్​ పెరిగాయి. 1928లో ఆర్ట్​ షొకాయ్​ కంపెనీ తమ రెండో బ్రాంచ్​ను హమమత్సులో మొదలుపెట్టింది.​ బాధ్యతలు సోయిచిరోకు అప్పగించింది.  

బాంబుదాడి, భూకంపం 

హమమత్సులోని ఆర్ట్​ షొకాయ్​లో పనిచేసేటప్పుడు ఆటోమొబైల్స్​లో రకరకాల కొత్త ప్రొడక్ట్స్​ తెచ్చేందుకు ప్రయోగాలు చేశాడు సోయిచిరో. కంపెనీని బాగా డెవలప్​ చేశాడు. 1935లో సాచిని పెండ్లి చేసుకున్నాడు. 1936లో ఒక కార్​ రేసులో పాల్గొన్నప్పుడు యాక్సిడెంట్​లో కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అదే సంవత్సరం‘టొకాయ్​ సియొకి హెవీ ఇండస్ట్రీస్’ పేరుతో టోక్యోలో సొంత కంపెనీ పెట్టాడు. దీనికి తోడుగా ‘ఆర్ట్​ పిస్టన్​ రింగ్​ రీసెర్చ్​ సెంటర్’ కూడా మొదలుపెట్టాడు. ఇందులో రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేసేవాడు. చివరికి కొత్త డిజైన్​లోని పిస్టన్​ రింగ్​ తీసుకొని మళ్ళీ టొయొటాకు వెళ్లాడు. ఈసారి కంపెనీ అతనికి పిస్టన్ రింగ్స్​ తయారీ కాంట్రాక్టు ఇచ్చింది. 50 మంది వర్కర్లను తీసుకొని పని మొదలుపెట్టాడు. కంపెనీ మెల్లగా డెవలప్​ అయింది. టొయొటాతోపాటు జపాన్​ సైన్యానికి కావల్సిన పిస్టన్​ రింగ్స్​ సప్లయ్​ చేసేవాడు. అయితే,1941లో జపాన్​ యుద్ధంలోకి దిగింది.

‘టొకాయ్​ సియొకి’ కంపెనీని ఆధీనంలోకి తీసుకుంది​. ఆ మరుసటి ఏడాది​ కంపెనీలోని 45శాతం వాటాను టొయొటా కొనుక్కొంది. దాంతో అప్పటివరకూ కంపెనీకి ప్రెసిడెంట్​గా ఉన్న సోయిచిరో.. సీనియర్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా మారాడు. మరోవైపు కంపెనీలోని మగ ఉద్యోగులు యుద్ధంలోకి వెళ్ళడంతో ఆడవాళ్లను పెట్టాల్సి వచ్చింది. ఇక్కడితో సమస్య ముగిసిపోలేదు. యుద్ధం జరుగుతుండగా కంపెనీపై బాంబు పడింది. దాంతో చాలావరకు ధ్వంసమైంది. ఎలాగోలా దాన్ని బాగు చేసుకుంటుంటే, 1945 జనవరి 13న వచ్చిన భూకంపం పూర్తిగా నాశనం చేసింది. దాంతో కంపెనీని పూర్తిగా టొయొటాకు అమ్మేశాడు సోయిచిరో. 

హోండా మోటార్​ కార్పొరేషన్​ లిమిటెడ్​

యుద్ధంలో ఓడిపోయిన జపాన్​ అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా వెహికల్స్​కు ఇంధనం దొరకడం కష్టమైంది. దాంతో రవాణారంగం కుదేలైంది. ఈ పరిస్థితిని గమనించాడు సోయిచిరో. తన వద్ద మిగిలిన చిన్న మోటార్​ను ఒక సైకిల్​కు బిగించాడు. మోటార్​సైకిల్​ మాదిరి తయారయ్యాక, దాని మీద సిటీలో తిరగడం మొదలుపెట్టాడు. ఆ వెహికల్​ జనానికి విపరీతంగా నచ్చింది. వాటికోసం సోయిచిరో వద్దకు ‘క్యూ’ కట్టారు. దాంతో తిరిగి బిజినెస్​లోకి దిగాడు సోయిచిరో. అయితే, ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా అతని దగ్గర డబ్బులేదు. స్నేహితులు, బంధువులు ఎవరూ సాయం చేయలేదు. ఒక ఫ్రెండ్​ ద్వారా జపాన్​ మినిస్టర్​ను కూడా కలిశాడు. అయినా లాభం లేదు. దాంతో చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. దేశంలోని18వేల మంది సైకిల్​ షాప్​ ఓనర్లకు లెటర్స్​ రాశాడు. ‘నేను​ ఇంజిన్ల తయారీ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నా. తోచినంత డబ్బు పంపండి’ అని అడిగాడు. ఈ లెటర్స్​ చదివి దాదాపు 3వేల మంది రెస్పాండ్ అయ్యారు. డబ్బు కూడా పంపారు. ఆ సొమ్ముతో 1946లో ‘హోండా టెక్నికల్​ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’​ పెట్టాడు. దీంట్లో ఇంజిన్లతోపాటు మోటార్​బైక్​లు కూడా తయారుచేయడం మొదలుపెట్టాడు. మొదట హోండా ‘ఎ–టైప్’ బైక్​లు తయారుచేశాడు. వాటికి విపరీతంగా డిమాండ్​ వచ్చింది. దాంతో కంపెనీ స్పీడ్​గా డెవలప్​ అయింది. కంపెనీ పేరు 1948లో హోండా మోటార్​ కార్పొరేషన్​ లిమిటెడ్​గా మారింది. ఇక్కడ తయారైన బైక్​లు ఇంటర్నేషనల్​ బైక్​ రేస్​ల్లో ప్రైజ్​లు గెలవడంతో విదేశాల్లోనూ గిరాకీ పెరిగింది. ఆ తర్వాత కార్ల తయారీ కూడా మొదలుపెట్టారు. వాటికీ ఫుల్​ డిమాండ్​ వచ్చింది. జపాన్​తోపాటు, యూరప్, అమెరికాలో హోండా బ్రాంచ్​లు మొదలయ్యాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

జపాన్​లోని అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపుపొందాడు సోయిచిరో. ఎన్నో అవార్డులు, బిరుదులు వచ్చాయి. బైక్​, కార్​ రేస్​లు అంటే చాలా ఇష్టపడేవాడు. రిటైరయ్యాక రేస్​ల్లోనే ఎక్కువ టైం గడిపేవాడు.1991, ఆగస్ట్​ 5న చనిపోయాడు.

సొంత ఎయిర్​పోర్ట్​ 

  • హోండా కంపెనీకి జపాన్​లో రెండు సొంత ఎయిర్​పోర్ట్​లు​ ఉన్నాయి. వీటిని హోండా ఎయిర్​వేస్​ ఆపరేట్​ చేస్తుంది. అలాగే హోండా కంపెనీ ‘హెచ్​–420’ పేరుతో ఒక ప్రైవేట్​ జెట్​ ఎయిర్​క్రాఫ్ట్​ కూడా తయారుచేసుకుంది.
  • ప్రపంచంలోనే అత్యధికంగా ఇంజిన్లు తయారుచేసే కంపెనీ హోండానే. ఏడాదికి దాదాపు 16 మిలియన్ల ఇంజిన్లు తయారుచేస్తుంది.  
  • బైక్​లు, కార్లతోపాటు ఎయిర్​క్రాప్ట్స్, వాటర్​క్రాఫ్ట్స్​, ఏటీవీస్​, సోలార్​ సెల్స్, లాన్​ ఎక్విప్​మెంట్స్​ కూడా హోండా కంపెనీలో తయారవుతాయి. ‘అసిమో’ అనే ఒక హ్యుమనాయిడ్​ రోబోను కూడా తయారుచేసింది హోండా.

హోండా పేరులోని మొదటి అక్షరం ఇంగ్లీష్​ ‘హెచ్’తో కంపెనీ లోగో ఉంటుంది. ఇందులో ‘హెచ్​’ కింది భాగం కంటే పైభాగం కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది చూడ్డానికి ఒక వ్యక్తి రెండు చేతులూ ఆకాశంవైపు చాచినట్లు కనిపిస్తుంది. అది కంపెనీ ఎదుగుదలను చెప్తుంది. అయితే హోండా​ బైక్స్​ లోగో డిఫరెంట్​గా ఉంటుంది. ఇంగ్లీష్​లోని హోండా అక్షరాలకు పైన పక్షి రెక్కలను జతచేసినట్లు ఉంటుంది. ఈ లోగో బాగా ఫేమస్​ అయింది కూడా.