గుర్రపు స్వారీ @ కరీంనగర్​

గుర్రపు స్వారీ @ కరీంనగర్​

గుర్రపు స్వారీ అంటే చాలు ఎగిరి గంతేస్తారు పిల్లలు. గుర్రం మీద కూర్చొని ‘చల్ చల్ గుర్రం... చలాకి గుర్రం’ అని పాట పాడుతూ తెగ సంబరపడిపోతారు. పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా ఒక్కసారైనా గుర్రపు స్వారీ చేయాలని ఉంటుంది. అయితే, హార్స్ రైడింగ్ క్లబ్​లు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే ఉన్నాయి. వాటిల్లో  ఫీజు లక్షల్లో  ఉంటుంది. అంత డబ్బు ఖర్చుచేయలేని వాళ్లకోసం కరీంనగర్​లో  గుర్రం స్వారీ ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు ఏరువ ప్రేమ్ రెడ్డి.  

చిన్నప్పటి నుంచి ప్రేమ్​ రెడ్డికి ‘గుర్రం ఎక్కాలి.. దానిపై కూర్చొని తిరగాల’ని కోరిక.  కానీ, చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా గుర్రపు స్వారీ నేర్పించేవాళ్లు  లేరు. దాంతో, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ గుర్రాలు కనిపిస్తే చాలు  వాటి మీద స్వారీ చేసేవాడు. ప్రస్తుతం ఈయన కరీంనగర్​లోని ఎయిడెడ్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు గుర్రపు స్వారీ చేయడం కోసం తాను ఎదురుచూసినట్టు ఈకాలం పిల్లలు ఎదురుచూడొద్దు అనుకున్నాడు. అందుకోసం సొంతంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

స్కూళ్లు తెరిచాక... 

గుర్రపు స్వారీకి ఉపయోగించే గుర్రాలు, వాటి తిండి, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ల గురించి తెలుసుకోవాలని  హైదరాబాద్​లోని  హార్స్ రైడింగ్ క్లబ్​లకు వెళ్లాడు. అక్కడ ఎలాంటి గుర్రాలు ఉన్నాయి? ఏ గుర్రాలు అయితే పిల్లలకు, పెద్దలకు స్వారీ నేర్పించడం ఈజీ అనే విషయాలు తెలుసుకున్నాడు. రెండేండ్ల కిందట నాలుగు గుర్రాలు తీసుకొచ్చి  కరీంనగర్ శివారులోని రేకుర్తిలో ఎకరం స్థలంలో హార్స్​ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్​  హార్స్ క్లబ్స్​లో పనిచేసిన అనుభవం ఉన్న కోచ్​ని తీసుకొచ్చాడు ప్రేమ్ రెడ్డి. అంతలోనే కరోనా మొదలైంది. కరోనా తగ్గి  స్కూళ్లు స్టార్ట్ అయ్యాక గుర్రపు స్వారీ నేర్పించడం మొదలుపెట్టాడు ప్రేమ్. పిల్లలకు ఇప్పుడు సెలవులు కావడంతో ఉదయం, సాయంత్రం వచ్చి ఎంతో ఇష్టంతో హార్స్ రైడింగ్​ నేర్చుకుంటున్నారు. ట్రైనింగ్​కు వచ్చే పిల్లల సంఖ్య పెరగడంతో ఈమధ్యే  రెండు గుర్రాల్ని తెప్పించాడు ప్రేమ్. ఇప్పుడు మొత్తం తొమ్మిది గుర్రాలు ఉన్నాయి అతని దగ్గర.

బేసిక్స్ నుంచి రైడ్ వరకు 

గుర్రపు స్వారీ చేయడానికి ముందు గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి.  పిల్లలకు గుర్రాలంటే ఉన్న భయం పోగొట్టడానికి గుర్రాలని ప్రేమగా ముట్టుకోవడం, వాటితో ఎక్కువ సేపు గడపడం  అలవాటు చేస్తారు కోచ్​లు.  దగ్గరికి  వెళ్లినా గుర్రం ఏమీ అనదనే నమ్మకం పిల్లలకు వచ్చాక వాళ్లని గుర్రం మీద కూర్చొబెట్టి వారం రోజులు వాకింగ్ చేయిస్తారు. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత చిన్న రింగ్​లో  వాకింగ్ చేయిస్తారు. ఆ తరవాత ( థ్రాట్) నెమ్మదిగా రన్ చేయడం నేర్పిస్తారు. ఆ తరువాత (క్యాంటర్) జంప్​ చేయడం, (గ్యాలప్) రింగ్స్​లో కాకుండా బయట మైదానాల్లోకి తీసుకెళ్లి స్పీడ్ రన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్​లో యాక్టివ్​గా ఉన్న పిల్లలతో చెరువు గట్లు, మైదాన ప్రాంతాల్లో లాంగ్ రైడ్​లు కూడా ప్రాక్టీస్ చేయిస్తారు. 

తక్కువ ఖర్చుకే..

హార్స్ రైడింగ్ నేర్చుకోవాలంటే హైదరాబాద్, బెంగళూరు... ఇలా పెద్ద సిటీలకు వెళ్లాలి. పైగా వాటిల్లో  ఫీజు కూడా ఎక్కువే. అందుకని హార్స్ రైడింగ్​ని ఇష్టపడేవాళ్ల కోసం కరీనంగర్​లోనే ట్రైనింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది అనిపించింది. సొంత డబ్బులతో హార్స్ రైడింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను.మొదట్లో చిన్న గుర్రాలమీద ట్రైనింగ్​ ఇస్తాం. తర్వాత పెద్ద గుర్రాల మీద స్వారీ నేర్పిస్తాం. పిల్లల సామర్థ్యం బట్టి నెల, రెండునెలల్లో గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. రోజు ఉదయం, సాయంత్రం గంట సేపు ట్రైనింగ్ ఇస్తాం. ఫీజు నెలకి ఐదు వేలు. ప్రస్తుతం 45 మంది పిల్లలు గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు.
గుర్రాలకు షెడ్లు,  వాటికి దాణాతో  కలిపి దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాను.  
- ఏరువ ప్రేమ్ రెడ్డి

::: ఓడపల్లి యాకయ్య, 
కిరణ్ కుమార్ గూడూరు,  
కరీంనగర్, వెలుగు