గుర్రాల దోస్త్

గుర్రాల దోస్త్

గుర్రపు స్వారీ నేర్పిస్తా

గుర్రపు స్వారీ ఒక ఆర్ట్​.. అందుకే  భవిష్యత్తు తరాలకి గుర్రపు స్వారీలో ట్రైనింగ్​ ఇస్తున్నా.  తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి  కూడా నా దగ్గరికి స్వారీ నేర్చుకోవడానికి వస్తుంటారు. పోలీసు​ ఆఫీసర్లు కూడా హార్స్​ రైడింగ్​ శిక్షణ తీసుకుంటుంటారు. గుర్రాలు కొనేవాళ్లు,  అమ్మేవాళ్లు కూడా నన్ను సలహాలు అడుగుతారు. ప్రస్తుతం నా దగ్గర పది గుర్రాలు ఉన్నాయి. వాటిని ముద్దు పేర్లతోనే పిలుస్తా . పచ్చిగడ్డితో పాటు కంది , శెనగ, పెసర పొట్టుని వాటికి దాణాగా వేస్తా’’ అని తన ఫ్రెండ్లీ గుర్రాల గురించి ప్రేమగా చెప్పాడు  ప్రకాశ్ పటేల్​. 

నిజామాబాద్​ జిల్లా, కోటగిరి మండలంలోని హంగర్గ. అక్కడ 1970లో ఇంటికో గుర్రం ఉండేది. రాకపోకలన్నీ వాటిపైనే సాగేవి. కానీ బస్సులు, ఆటోలొచ్చాక ఆ ఊరంతా గుర్రాల్ని అమ్మేసింది. ప్రకాశ్​ పటేల్​ మనసు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. గుర్రాలపై ఉన్న ప్రేమ అతడ్ని హార్స్ రైడింగ్ వైపు నడిపించింది. గుర్రపు స్వారీ​​ ట్రైనర్​గా మార్చింది. అంతేకాదు గుర్రాల పటేల్​గాను మారిపోయాడు. రాష్ట్రంలోనే గుర్రాల వ్యాపారంలో తనకంటూ  ఓ మార్క్​ క్రియేట్​ చేసుకున్న అతని గురించి..

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది హంగర్గ. ఈ చిన్న పల్లెటూళ్లో గుర్రపు స్వారీ​లో  వందల మందికి శిక్షణ ఇస్తున్నాడు ప్రకాశ్​ పటేల్​. అది కూడా ఎన్నో యేండ్ల నుంచి. ఇదొక్కటే కాదు గుర్రాలకి డాన్స్​ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. వాటితో సలామ్​ కూడా కొట్టిస్తున్నాడు. అన్నింటికీ మించి గుర్రాల బిజినెస్​లో లక్షలు సంపాదిస్తున్నాడు. ‘గుర్రాలతో సావాసం ఎలా మొదలైంద’ని అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు ప్రకాశ్​ పటేల్​.. 

లాభం ఇరవై ఆరు

మా తాతముత్తాతలు గుర్రపు స్వారీ చేసేటోళ్లు. వాళ్ల నుంచి వారసత్వంగా మా నాన్నకీ అబ్బింది. చుట్టు పక్కల ఏ చిన్న పని ఉన్నా.. దానిపైనే వెళ్లి వచ్చేవాడు నాన్న. నన్నూ రోజూ గుర్రంపై తిప్పేవాడు. హార్స్​ రైడింగ్​ కూడా నేర్పించేవాడు. అలా మా ఇంట్లో ఉండే గుర్రం మంచి ఫ్రెండ్​ అయింది నాకు. అప్పుడే నాకంటూ ఓ గుర్రం ఉంటే బాగుండు అనిపించింది. కానీ, గుర్రం కొనాలంటే దగ్గర దగ్గర వంద రూపాయలు కావాలి. ఇప్పట్లో వంద రూపాయలంటే పెద్ద విషయం కాకపోవచ్చు... కానీ, 80ల్లో వేలతో సమానం. దాంతో ఆ  డబ్బు జమ చేయడానికి అష్టకష్టాలు పడ్డా. ఇంట్లో వాళ్లు ఇచ్చే ఐదు, పది పైసల్ని దాచుకున్నా. అలా పోగు చేసిన 99  రూపాయలతో పదిహేనేండ్ల వయసులో గుర్రం కొన్నా. నాన్న  దాన్ని చూసి.. ‘గుర్రం బాగుంది. ఎవరిది?’ అని అడిగాడు.. ‘నాదే ఈరోజే కొన్నా’ అని  చెప్తే నమ్మలేదు. నిజం తెలిశాక ‘ఇప్పట్నించే ఇవన్నీ నీకెందుకు? అని చెడామడా తిట్టాడు. అమ్మేయమని బలవంతం చేశాడు. దాంతో చేసేదేంలేక ఆ గుర్రాన్ని  125 రూపాయలకి అమ్మేశా. 26 రూపాయల లాభం రావడంతో అప్పటివరకు  తిట్టిన ఇంట్లోవాళ్లే మెచ్చుకున్నారు. అలా నా గుర్రాల బిజినెస్​ మొదలైంది. 

శిక్షణ ఇచ్చి అమ్ముతా... 

గుర్రాల వ్యాపారం చేసేవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ కాదని నా గుర్రాల్ని వెతుక్కుంటూ రావాలంటే వాటిల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే గుర్రాలకి స్పెషల్ ట్రైనింగ్​ ఇస్తుంటా. డాన్స్ .. సలామ్​​ కొట్టడం, షేక్​ హ్యాండ్​ ఇవ్వడం నేర్పిస్తా. వాటికి ఫిజికల్​ ట్రైనింగ్​ కూడా ఇస్తా.  అలాగని ట్రైనింగ్​ పేరుతో వాటినేం ఇబ్బంది పెట్టను. ఓ  దోస్తులా వాటిని మచ్చిక చేసుకుని  సరదాగా అన్నీ నేర్పిస్తా. పుష్టిగా ఉండటానికి ఒక్కో గుర్రానికి రోజుకి నాలుగొందల రూపాయలు వరకు ఖర్చు చేస్తా. గుర్రాలు అన్ని విధాల ఫిట్​గా ఉన్నప్పుడు  మహారాష్ట్ర-, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్​లకి తీసుకెళ్లి అమ్ముతా. నా దగ్గర ట్రైన్ అయిన  ఒక్కో గుర్రానికి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రేటు పలుకుతుంటుంది. 
::: పులగం దేవిదాస్​, నిజామాబాద్​, వెలుగు