
ఇంటికే దవాఖాన
టెస్టులు, ట్రీట్‌మెంట్ అన్నీ మన వద్దకే..
ఆఫర్లు ఇస్తున్న ల్యాబ్స్, హాస్పిటల్స్
రూ.వెయ్యి, 1500కే 30, 40 టెస్టులు
షుగర్ పరీక్షల నుంచి ఎక్స్రే వరకు..
ఇంటికొచ్చి శాంపిల్ కలెక్షన్.. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా
కరోనా వచ్చాక పెరిగిన ఆదరణ
పెద్దవాళ్లకు, పేషెంట్లకు ఉపయోగం
24X7 మెడికల్ ఎమర్జెన్సీ సేవలు
ట్యాబ్లెట్ల నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ దాకా అన్నీ ఇంటికే
హైదరాబాద్, వెలుగు: బీమార్ వస్తే దవాఖానకు పోవాల్సిన పనిలేదు.. డాక్టరే ఇంటికొచ్చి ట్రీట్మెంట్ చేస్తరు.. టెస్టుల కోసం ల్యాబ్లకు పోనక్కర్లేదు.. టెక్నీషియన్లే వచ్చి శాంపిల్స్ తీసుకుంటరు. చెకప్ కోసం క్లినిక్కు వెళ్లాల్సిన పని లేదు.. వాళ్లే వచ్చి అన్నీ చూసుకుంటరు. అంతెందుకు ఇంటికే హాస్పిటల్ వచ్చేస్తది. ఓ ఆండ్రాయిడ్ ఫోన్, దానికింత నెట్ ఉంటే చాలు. ఇంటికాడే ఉండి టెస్టులు చేయించుకోవచ్చు.. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.. డాక్టర్ను కన్సల్ట్ కావచ్చు.. అది కూడా అతి తక్కువ ఖర్చులో!! ఈ ఫెసిలిటీస్ అందించేందుకు మార్కెట్లోకి కొత్త స్టార్టప్స్ వచ్చాయి. యాప్స్, వెబ్సైట్ల ద్వారా అన్ని రకాల మెడికల్ హోమ్ కేర్ సర్వీసులను అందజేస్తున్నాయి. ల్యాబ్స్, ఆస్పత్రులు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి. కరోనా టైమ్లో రిస్క్ ఎందుకు అనుకునే వాళ్లు, పెద్ద వయసులో ఉన్న వాళ్లు ఈ సదుపాయాన్ని ఎంతో సౌకర్యంగా ఫీలవుతున్నారు. స్టార్టప్స్కు వస్తున్న ఆదరణ చూసి కొన్ని సర్టిఫైడ్ ల్యాబ్స్ కూడా టెస్టింగ్ ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. హాస్పిటళ్లు కూడా డిఫరెంట్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. టెస్టుల నుంచి ట్రీట్మెంట్ దాకా అన్నీ ‘ఎట్ హోమ్’ ప్యాకేజీలు అందజేస్తున్నాయి.
చీప్గా టెస్టులు
కరోనా కారణంగా చాలా మంది హాస్పిటళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కొన్ని మెడికల్ స్టార్టప్స్.. తొలుత మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేయడం మొదలుపెట్టాయి. తర్వాత ల్యాబ్ టెస్టులు ఇంటికే వచ్చి చేయడం షురూ చేశాయి. మెడ్ప్లస్, వన్ ఎంజీ, థైరోకేర్, స్టార్ ల్యాబ్ ఇండియా, లాబ్ టెస్ట్స్, హెల్దీయన్స్, మెడికల్ ల్యాబ్ టెస్ట్స్, డా.లాల్ పాథ్ ల్యాబ్స్, థైరో ల్యాబ్స్, లాబ్ రిజల్ట్స్, ఎంఫైన్ వంటి స్టార్టప్స్ ‘ఎట్ హోమ్’ ఆఫర్లు అందజేయడం మొదలుపెట్టాయి. ఈ సంస్థల యాప్స్లో బుక్ చేసుకుంటే టెక్నీషియన్లు ఇంటికే వచ్చి బ్లడ్, యూరిన్ శాంపిళ్లు కలెక్ట్ చేసుకుంటారు. కదలలేని పేషెంట్లు ఉంటే ఎక్స్రే లాంటి సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆర్థోపెడీషియన్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఎక్సర్సైజులు చేయిస్తారు. టెస్టులకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. రూ.599 నుంచి రూ.1,500కే 30, 40 రకాల టెస్టులు చేస్తున్నాయి. దీంతో చాలా మంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. విజయా డయాగ్నస్టిక్స్, టెనెట్ డయాగ్నస్టిక్స్, లూసిడ్ డయాగ్నస్టిక్స్ వంటి మేజర్ సర్టిఫైడ్ ల్యాబ్స్తో స్టార్టప్స్ టైఅప్ అవుతున్నాయి. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబోరేటరీస్ సర్టిఫైడ్ చేసిన ల్యాబ్స్, హాస్పిటల్స్తో అసోసియేట్ అయి పేషెంట్లకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. కరోనా పీక్గా ఉన్నప్పుడు కోమార్బిడిటీస్ పేషంట్లకు ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడింది. ఇంటికే టెక్నీషియన్లను పిలిపించుకుని తక్కువ రేట్లకే టెస్టులు చేయించుకున్నారు. ఆన్లైన్లో డాక్టర్లను కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ పొందారు.
ఆల్ సర్వీసెస్
క్యాబ్ సర్వీసుల మాదిరే హెల్త్ స్టార్టప్స్ పని చేస్తున్నాయి. వివిధ సేవలకు సంబంధించిన ఆప్షన్స్ యాప్స్, వెబ్సైట్స్లో ఉంటాయి. ల్యాబ్ టెస్టింగ్, డాక్టర్, నర్స్, ఫిజియోథెరపీ, ఈసీజీ, ఎక్స్రే, వ్యాక్సిన్, మెడికల్ ఎక్వీప్మెంట్, ఫార్మసీ సర్వీస్.. తదితరాలు ఉంటాయి. మనకు కావాల్సిన స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్లను పంపిస్తారు. వీళ్లు రూ.వెయ్యి నుంచి 2 వేల దాకా కన్సల్టేషన్ ఫీజు చార్జ్ చేస్తారు. రెగ్యులర్గా బీపీ, షుగర్ లాంటి రీడింగ్స్ చెక్ చేసుకోవాల్సిన వాళ్లు.. గాయాలైతే డ్రెసింగ్ చేయాల్సిన వాళ్లు.. ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన వాళ్ల కోసం నర్సింగ్ సర్వీసులు ఉంటాయి. సర్వీస్ను బట్టి విజిట్కు రూ.500 నుంచి రూ.వెయ్యి దాకా చార్జ్ చేస్తారు. ఎవరికైనా మెడికల్ ఎక్వీప్మెంట్ కావాలన్నా సప్లై చేస్తారు. ఆక్సిజన్ సిలిండర్లు, పోర్టబుల్ వెంటిలేటర్లు రెంటుకు ఇస్తున్నారు. సేల్ కూడా చేస్తారు. పిల్లలకు వ్యాక్సిన్లు కూడా ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఆంబులెన్స్ సర్వీసుల్లో భాగంగా రెగ్యులర్ వెహికల్స్తోపాటు ఎయిర్ ఆంబులెన్స్ లు ప్రొవైడ్ చేస్తున్నారు.
లాక్డౌన్ నుంచి..
లాక్ డౌన్ నుంచి హోమ్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. మా దగ్గర ఐదుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. కరోనా టెస్ట్ లతో పాటు ఈ మధ్యనే హోమ్ శాంపిల్స్ కలెక్షన్ సర్వీసెస్ ప్రారంభించాం. ఇతర వ్యాధులకు సంబంధించి డాక్టర్స్ ద్వారా వీడియో కన్సల్టేషన్ అందిస్తున్నాం. - అనిత, ప్రగతి హెల్త్ కేర్
ఇంట్లో సేఫ్ అని..
2012 నుంచి హోం సర్వీసెస్ అందిస్తున్నాం. పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అటెండర్, నర్స్, ఫిజియోథెరపిస్ట్ లను పంపిస్తాం. ఒక ల్యాబ్ తో టైఅప్ అయ్యాం. టెస్ట్ లను బట్టి బీఫోర్ బ్రేక్ ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేయిస్తాం. బయట ల్యాబ్స్, హాస్పిటల్స్ కంటే తక్కువ చార్జ్ లకే టెస్ట్ లు చేస్తాం. ఇప్పుడు హోమ్ కేర్ సర్వీసెస్ ప్రిఫర్ చేస్తున్న పేషెంట్లు పెరిగారు. ఇంట్లో అయితే సేఫ్ అని భావిస్తున్నారు. - నుస్రత్ సుల్తానా, నైటింగేల్స్ హోమ్ కేర్ సర్వీసెస్
70 శాతం తక్కువ
ఇండియాలో ఐదు టాప్ రిఫరల్ ల్యాబ్స్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా తాము చేయలేని టెస్టులను వీటికే పంపుతాయి. శాంపిల్ పొద్దున ఇస్తే సాయంత్రానికి రిపోర్టులు పంపిస్తారు. మేం ఇలాంటి సర్టిఫైడ్ ల్యాబ్స్తో టై అప్ అయి.. కస్టమర్ బేస్డ్ హోమ్ సర్వీస్ అందిస్తాం. కార్పొరేట్ హాస్పిటల్స్కు, ల్యాబ్స్కు వెళ్లి చేయించుకునే చార్జ్ లలో 50 నుంచి 70 శాతం తక్కువ ఖర్చులో టెస్ట్ లు చేస్తాం. బయట టెస్ట్కు రూ.వెయ్యి అయితే మేం 300కే చేస్తాం. ఎమర్జెన్సీని బట్టి 2, 3 గంటల్లోనే టెస్ట్ ల రిజల్ట్స్ను పేషెంట్కు పంపుతాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో చేయించుకునే వారికంటే సొంతంగా టెస్ట్ లు చేయించుకునే వారు ఎక్కువగా ఉన్నారు. మాకు డైలీ 10 నుంచి 15 వరకు న్యూ బుకింగ్స్ వస్తుంటాయి.
- కేఎస్ రాజు, బ్లడ్ శాంపిల్ కలెక్షన్ సర్వీసెస్
ఎనీ టైం సర్వీస్
‘హెల్త్ ఎట్ హోమ్’ అనే యాప్, వెబ్ సైట్ ద్వారా అన్ని రకాల మెడికల్ సర్వీసెస్ అందిస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్కు చెందిన డాక్టర్లు మా టీంలో ఉన్నారు. బుక్ చేసుకుంటే పేషెంట్ ఇంటికి డాక్టర్ వెళ్తారు. ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాం. హోమ్ టు హాస్పిటల్, హాస్పిటల్ టు హోమ్ కంప్లీట్ సర్వీస్ ఉంటుంది. నేరుగా హాస్పిటల్కు వెళ్లి చెక్ చేయించుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే మా దగ్గర తక్కువే ఉంటుంది. ఇప్పుడిప్పుడే బుకింగ్స్ పెరుగుతున్నాయి. అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉండటంతో జనాలు ఎక్కువగా హోమ్ కేర్ సర్వీసెస్ నే ఇష్టపడుతున్నారు.
డాక్టర్ చల్లా చైతన్య, జనరల్ ఫిజిషియన్, హెల్త్ ఎట్ హోమ్ స్టార్టప్