నా భార్యను చంపేశారు.. ప్రాణం పోతుందన్నా ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదు

నా భార్యను చంపేశారు.. ప్రాణం పోతుందన్నా ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదు

కరోనా లక్షణాలున్నాయని ట్రీట్ మెంట్ చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులన్నీ నిరాకరించడంతో ప్రాణం పోయిన ఘటన రాష్ట్ర రాజధానిలో జరిగింది. ప్రైవేట్ లో కూడా కరోనా ట్రీట్ మెంట్ చేయాలని ప్రభుత్వం చెబితే.. బయట పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. కరోనా పేషంట్ కు ట్రీట్మెంట్ చేస్తే.. కరోనా తమకు సోకుతుందని భావించి ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో రోహితను అనే మహిళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ చనిపోయింది.

అత్తాపూర్ కు చెందిన రోహిత జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. ఆమె భర్త శ్రీకాంత్ ఆమెను తీసుకొని బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాడు. అయితే అక్కడ రోహితకు కరోనా లక్షణాలున్నాయని ట్రీట్మెంట్ చేయలేదు. దాంతో ఆమెను తీసుకొని శ్రీకాంత్ మరో హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ కనీసం ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టకముందే.. రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. దాంతో శ్రీకాంత్ తన భార్యను మరో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారు కూడా ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు కానీ, కాసేపు ఆక్సిజన్ పెట్టి పంపించారు.

దాంతో శ్రీకాంత్ అదే రాత్రి కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ బెడ్స్ ఖాళీగా లేవని చేర్చుకోలేదు. దాంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ కూడా నిరాశే ఎదురయింది. వెంటిలేటర్, బెడ్స్ లేవని చెప్పి తిప్పి పంపారు. ఇక చివరగా గాంధీ ఆస్పత్రికి వెళ్తే.. కరోనా అనుమానితులు ఇక్కడకు రాకూడదన్నారు. ఇలా శ్రీకాంత్ తన భార్యను తీసుకొని బుధవారం రాత్రి 11 నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పది ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ ఎక్కడా ఆమెకు వైద్యం అందలేదు. దాంతో చివరకు మళ్లీ శ్రీకాంత్.. తన భార్య రోహితను తీసుకొని గాంధీకి చేరాడు. అక్కడికి వచ్చిన కాసేపటికే రోహిత మృతిచెందింది. తన భార్య చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత ఉన్నా కూడా.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని శ్రీకాంత్ అంటున్నాడు.

‘నా భార్యను తీసుకొని మొదట సన్ షైన్ హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ వారు చేర్చుకోలేదు. కానీ, బతిలాడితే కాసేపు ఆక్సిజన్ పెట్టి పంపించారు. అక్కడినుంచి అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లాను. అక్కడ కూడా కాసేపు ఆక్సిజన్ పెట్టి పంపించారు. వారికి కరోనా లక్షణాలు ఉంటే తీసుకోవద్దని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయంట. దాంతో అక్కడి నుంచి విరించి హాస్పిటల్ కు వచ్చాను.అక్కడ మరీ ఘోరంగా ఉంది. కనీసం పేషంటును ముట్టుకోలేదు. బెడ్సు లేవు.. ఆక్సిజన్ లేదు.. మీరు వెళ్లిపోవాలి అన్నారు. దాంతో జంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లాను. అక్కడ వాళ్లను ఆక్సిజన్, పల్స్ లెవల్స్ పడిపోతున్నాయని దండం పెడితే.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటే.. కాసేపు ఆక్సిజన్ పెడతామని కండీషన్ పెట్టి ఆక్సిజన్ పెట్టారు. ఈ పేషంట్ కు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం కచ్చితంగా కావాలి అని చెప్పి అక్కడి నుంచి పంపించారు.

అక్కడి నుంచి అంబులెన్సులో కింగ్ కోఠి హాస్పిటల్ కు వచ్చాం. అక్కడ లోపలికి వెళ్లకముందే.. వాచ్ మెన్ మా దగ్గర బెడ్స్ లేవు అని చెప్పాడు. కాసేపటికి నర్సు వచ్చి మా దగ్గర అయితే బెడ్స్ లేవు. మీ ఇష్టం. మీరు ఎక్కడైనా.. ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పింది. ఉస్మానియాకు వెళ్తే ఎలాంటి వారినైనా చేర్చుకుంటారని చెప్పింది. చేసేదేంలేక దేవుడి మీద భారం వేసి.. ఉస్మానియాకు వెళ్లాం. అక్కడ కనీసం ఒక్కరు కూడా కనిపించలేదు. స్ట్రెచర్ కోసం వెతికి వెతికి ఐసీయూలోకి వెళ్లి.. విరిగిపోయిన ఒక వీల్ చెయిర్ తీసుకొని వస్తున్న. అప్పడు అక్కడే కూర్చొన్న రిసెప్షనిస్ట్.. ఫోన్ డిపాజిట్ చేసి.. చెయిర్ తీసుకెళ్లమని చెప్పింది. అప్పుడు ఫోన్ అక్కడ పెట్టి వెళ్లి నా భార్యను వీల్ చెయిర్ మీద లోపలికి తీసుకొచ్చాను. వాళ్లు కనీసం పేషంట్ కు ఆక్సిజన్ కూడా పెట్టడం లేదు. దాంతో చుట్టూ ఉన్న పేషంట్లను చూసి.. ఆక్సిజన్ నేనే పెట్టాను. కాసేపటికి వచ్చి ఎక్స్ రే లు తీయాలని రాసిచ్చింది. ఎక్స్ రే రూం దగ్గరకు వెళ్తే.. అక్కడ ఎవరూ లేరు. అదే రూంలో ఆక్సిజన్ ఫెసిలిటీ లేకపోవడంతో.. ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాం. ఆయా వచ్చి ఫ్యాన్ ఎందుకు వేశారని అరిచి ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్లిపోయింది. కాసేపటికి టెక్నిషియన్ వచ్చాక ఎక్స్ రే తీయించుకొని.. నర్సు దగ్గరికి వెళ్లాం. పేషంట్ పల్స్ పూర్తిగా పడిపోతుందని.. వెంటిలేటర్ లేదని.. వేరే హాస్పిటల్ కు వెళ్లాలని చెప్పింది.

తెలిసిన డాక్టర్ సలహాతో కూకట్ పల్లిలో ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లా. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ చేసి.. సీటీ స్కాన్ తీయాలని రూంలోకి తీసుకెళ్లారు. అయితే పేషంట్ కు కరోనా లక్షణాలున్నాయని.. ఎవరూ పట్టించుకోకుండా స్కానింగ్ రూంలో అలాగే వదిలేశారు. దాంతో వాళ్లతో గొడవపడితే ఆక్సిజన్ పెట్టి గాంధీకి పంపించారు. అంత కష్టపడి గాంధీకి వస్తే.. ఇక్కడ బండ్లు లోపలికి రానీయం అని పోలీసులు అంటారు. కొంచెం గట్టిగా మాట్లాడితే లోపలిదాకా పోనిచ్చారు. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎవరూ వచ్చి ముట్టలేదు. ఆక్సిజన్ పెట్టలేదు. కాసేపటికే నోట్లోంచి నురుగులు కక్కి నా భార్య చనిపోయింది. నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. గవర్నమెంట్ అన్నీ ఉత్త మాటలు చెబుతుంది. పేపర్ల మీద తప్పుడు లెక్కలు చూపిస్తుంది’ అని మృతురాలు రోహిత భర్త శ్రీకాంత్ ఓ వీడియో విడుదల చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

For More News..

పరీక్షల వాయిదాకు ఒప్పుకోని తెలంగాణ హైకోర్టు.. రేపటి నుంచి నిర్వహించే ఛాన్స్

తండ్రి కోసం దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

ప్రైవేట్ దందా.. ఐసోలేషన్ బెడ్ రోజుకి రూ. 24,000-25,000