టూ మచ్ బాస్: ఇంట్లో మందు పార్టీకి.. పర్మీషన్ తీసుకోవాలా..!

టూ మచ్ బాస్: ఇంట్లో మందు పార్టీకి.. పర్మీషన్ తీసుకోవాలా..!

మీరు నోయిడా లేదా గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారా.. మీ ఇంట్లో లేదా మద్యం సేవించే కమ్యూనిటీ హాల్‌లో పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే అలాంటి వారి కోసం అక్కడి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. మందు పార్టీలు చేసుకోవాలంటే బార్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంట్లో లేదా కమ్యూనిటీ స్థాయిలో కూడా పార్టీలకు మద్యం లైసెన్స్ లేకపోవడం అనేది నిబంధనలను ఉల్లంఘించడమేనని, అలాంటి వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా వర్తిస్తాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా ఎక్సైజ్ అధికారి (DEO) సుబోధ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఎవరైనా లైసెన్స్‌తో మద్యం అందిస్తున్నట్లయితే, అది ఉత్తరప్రదేశ్‌లో లేదా రాష్ట్రం వెలుపల అమ్మకానికి ఉద్దేశించిన మద్యం అయినా సరే అది చట్టవిరుద్ధమని, ఎక్సైజ్ శాఖ చర్య తీసుకుంటుందని శ్రీవాస్తవ చెప్పారు.

పార్టీలలో మద్యం సర్వ్ చేయడానికి లైసెన్స్‌లు రెండు కేటగిరీల్లో అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి రూ. 4వేల రుసుముతో కూడిన హౌస్ పార్టీల వంటి వాటి కోసం. మరొకటి రూ.11వేలతో కమ్యూనిటీ హాళ్లు, రెస్టారెంట్లు లేదా విందులు వంటి కార్యక్రమాలకు హాజరయ్యే పెద్ద సమూహాలకు మద్యం అందించడానికి అనుమతిస్తుంది. ఈ రెండు లైసెన్స్‌లు ఒక రోజు వరకు చెల్లుబాటు అవుతాయని, దరఖాస్తుదారులు పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీ కింద  upexciseportal.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని DEO తెలిపారు.

అధికారిక లెక్కల ప్రకారం, 2022లో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 వరకు అధికారులు 5వేల 820 లైసెన్సులు జారీ చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 8వేల 770 జారీ చేయగా.. ఇది గతేడాదితో పోలిస్తే 40 శాతం ఎక్కువ.