బంగారం లాంటి హోటల్​!

బంగారం లాంటి హోటల్​!

మార్కెట్లో బంగారం ధర10 గ్రాములకు నలభై వేల దాకా ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనే ధైర్యం చేయాలంటే సాహసమే అనుకోవాలి. కానీ.. బంగారు పళ్లెంలో తినాలని కోరిక పుడితే.. గోల్డెన్​ స్పూన్​తో ఫుడ్​ టేస్ట్​ చేయాలని ఆశ కలిగితే.. బంగారు బాత్​టబ్​లో స్నానం చేయాలని మనసు కోరుకుంటే.. ‘ఏంటీ.. ఆశకు హద్దుండాలి’ అనాలనిపిస్తుందా? వియత్నాంలోని గోల్డెన్​ బే దనాంగ్​ హోటల్​కెళ్తే పై కోరికలన్నీ తీరిపోతాయి.

ఇంతకీ ఆ బంగారు హోటల్​ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? వియత్నాంలో ఉంది. అక్కడికెళ్లి ‘గోల్డెన్​ బే దనాంగ్​ హోటల్’​ అని ఎవరిని అడిగినా..  కళ్లు మూసుకొని అడ్రస్​ చెప్తారు. ఆ హోటల్​కెళ్లి హ్యాండ్​వాష్​ చేసుకోవాలన్నా.. బంగారు వాష్ బేసిన్లే ఉంటాయి. నల్లాలు కూడా బంగారంతో చేసినవే ఉంటాయి. టేబుల్​ మీద కూర్చొని ఫుడ్​ ఆర్డరిస్తే.. సప్లై చేసే గిన్నెలు, వడ్డించే స్పూన్లు, తినే ప్లేట్లు, నీళ్లు తాగే గ్లాసులు అన్నీ బంగారుమయమే. ఆ ప్లేట్లలో పెట్టుకొని తింటుంటే.. తిండి కంటే ఎక్కువ ఆ బంగారు పాత్రల మీదనే ఎక్కువ దృష్టి పెడతారేమో జనాలు.

అంతెందుకూ.. గోల్డెన్​ బే దనాంగ్​ హోటల్​లోని ప్రెసిడెంట్​ సూట్​లో బాత్​రూమ్​ ఫిట్టింగ్, బట్టలు వేలాడేసుకునే హ్యాంగర్లు కూడా బంగారువే ఉంటాయి తెలుసా. సరదాగా స్నానం చేయాలనిపిస్తే.. బంగారు ఈత కొలనులో.. అదేనండీ.. స్విమ్మింగ్​పూల్​లో ‘జలకాటలలో.. ఏమి హాయిలే అలా..’ అంటూ విలాసంగా స్నానం చేయొచ్చు. బంగారు సోప్​ బాక్స్​లోంచి సబ్బు తీసుకొని రాజభోగం అనుభవించవచ్చు.

అంతేనా చీకటైతే చాలు.. టాప్​ వ్యూ నుంచి ఫైర్​వర్క్స్​ చూడాలంటే.. రెండు కళ్లు సరిపోవు. లాంజ్​లో కూర్చుని కింద జిగేల్​మనిపించే స్విమ్మింగ్​పూల్​ చూస్తుంటే.. ఈ ప్రపంచాన్ని మరిచిపోవచ్చు.  24 క్యారెట్ల బంగారంతో కట్టిన స్విమ్మింగ్​ పూల్​ చూడాలే గానీ.. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నిత్యం జరిగే రకరకాల ఈవెంట్లకు సంబంధించిన లైటింగ్​ఎఫెక్ట్​, ఫైర్​ వర్క్స్​ రాత్రిని మైమరిపించి మిరిమిట్లు గొలిపే వెలుగును పంచుతాయి. ఈ హోటల్​లో ఉండే లగ్జరీ సేవలకు వసూలు చేసే డబ్బులు కూడా లగ్జరీగానే ఉంటాయి. ఆసియాలోనే అత్యంత విశాలమైన, విలాసమైన హోటల్​ ఇదే.

ఈ హోటల్​లో మొత్తం 949 రూమ్స్​ ఉన్నాయి. అన్నీ రూముల్లో గోల్డ్​తో ఫీచరింగ్​ చేసిన వస్తువులే ఉంటాయి. కస్టమర్ల కోసం ఏడు రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. అక్కడ వడ్డించే మద్యం, ఫుడ్​ కూడా బంగారు పాత్రల్లోనే. ఈ హోటల్​ల్లోకి అడుగుపెడితే..  ఎవరైనా గోల్డెన్​ స్పూన్​తో తినాల్సిందే. ఏదైనా దావత్​ చేయాలంటే కనీసం 300 మందికి తగ్గకుండా అతిధులకు ఏర్పాట్లు చేయవచ్చు. ఇక్కడి 949 రూమ్స్​లో ప్రతీ రూమ్​ నుంచి సముద్రం, పర్వతాలు 360 డిగ్రీల కోణంలో కనిపిస్తాయి. అదే ఇక్కడి మరో స్పెషాలిటీ. ఈ గోల్డెన్​ హోటల్లో ఒక్క రాత్రి గడపాలంటే మన కరెన్సీలో దాదాపు ఏడు వేల రూపాయలు ఇస్తే చాలు.