
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి, అతని భార్య విషం తాగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు తెలిపారు.
30 ఏళ్ల వ్యక్తి, అతని 27 ఏళ్ల భార్య సెప్టెంబర్ 21న విషం తీసుకున్నారు. అదే రోజు భర్త చనిపోగా, భార్య తరువాతి రోజు గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో మరణించిందని బస్తీ ఎస్పీ గోపాల్ కృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 20, 21 మధ్య రాత్రి భార్యపై ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని దంపతుల బంధువులు ఆరోపించారని ఎస్పీ చెప్పారు. ఆత్మహత్యకు ముందు, దంపతులు నిందితుల పేర్లను తెలిపిన వీడియోను రికార్డ్ చేశారని పోలీసులు తెలిపారు.
మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376 డి (గ్యాంగ్ రేప్), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు ఆదర్శ్ (25), త్రిలోకి (45)లను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తాము విషం తాగి చనిపోతామని తల్లిదండ్రులు చెప్పారని మృతుడి పిల్లలు పోలీసులకు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, ఎనిమిది, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నట్లు వారు వివరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అత్యాచార ఘటనకు మృతురాలి ఆధీనంలో ఉన్న భూమి అమ్మకంతో ముడిపడి ఉందని వారు తెలిపారు.