
- పని మనిషిగా చేరి.. ఫ్లాట్ కబ్జా
- ఒంటరి వృద్ధురాలిని గెంటేసిన మహిళ
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
- చొరవతో బాధితురాలికి న్యాయం
ఎల్బీ నగర్,వెలుగు: ఒంటరిగా ఉంటోన్న వృద్ధురాలి ఫ్లాట్ లో పనిమనిషిగా చేరిన ఓ మహిళ తర్వాత ఆమెనే ఇంట్లో నుంచి తరిమేసింది. వృద్ధురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించడంతో అధికారులు బుధవారం వృద్ధురాలికి ఫ్లాట్‌ను అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధురాలైన ఆవుల విజయలక్ష్మి , కొడుకు రామకోటేశ్వర్ రావుతో కలిసి బాలాపూర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని ఉంటోంది. గతేడాది గుగులోతు దేవమ్మ అనే మహిళ వీరి ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఈ ఏడాది మే 25న రామకోటేశ్వర్ రావు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో విజయలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఫ్లాట్‌ను పనిమనిషి దేవమ్మ సొంతం చేసుకోవాలనుకుంది. విజయలక్ష్మిని తరచూ వేధించి, చివరికి ఇంట్లో నుంచి తరిమేసింది. దీంతో బాధితురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. స్పందించిన జడ్జి శ్రీదేవి.. కేసు విచారించి, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బాధితురాలికి ఇంటిని తిరిగి అప్పగించింది.