మన మిలటరీకి ‘ఏఐ’ పవర్: యుద్ధవ్యూహాల్లో టెక్నాలజీ

మన మిలటరీకి ‘ఏఐ’ పవర్: యుద్ధవ్యూహాల్లో టెక్నాలజీ

యుద్ధవ్యూహాల్లో టెక్నాలజీ వాడకంపై ఆర్మీ కసరత్తు

ఇండియన్ ఆర్మీలో ఎంత మంది సైనికులున్నారో తెలుసా? దాదాపు13 లక్షల మంది. ఒకవేళ శత్రుదేశాలతో యుద్ధం వస్తే.. ఇంతమందిని సరైన దిశలో నడిపిస్తూ, శత్రువులను మట్టి కరిపించడం అనేది చాలా కష్టమైన పని. అందుకే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ (ఐబీజీ) ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. అంటే.. యుద్ధ రంగంలో సైనికులను గ్రూపులుగా విడదీసి శత్రువులను చావు దెబ్బ తీసేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లే బృందాలు అన్నమాట. ఐబీజీల్లో టి–90 యుద్ధ ట్యాంకులు, వాటి చుట్టూ ఆర్టిలరీ, పదాతి దళాలు, పై నుంచి దాడి చేసేందుకు ఫైటర్ జెట్ల వంటివన్నీ ఉంటాయి. అయితే వీటన్నింటిని సమర్థంగా ముందుకు నడిపించాలంటే రాడార్లు, శాటిలైట్ల నుంచి సమాచారం అందుకుని, శత్రువుల కదలికలను అంచనా వేసి, అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడమన్నది అత్యంత అవసరం.

ఇందులో ఏ కొంచెం పొరపాటు జరిగినా.. శత్రువులను హతమార్చడం అటుంచి.. మనమే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే.. యుద్ధరంగంలో సైనిక బలానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని జోడించాలని మన ఆర్మీ భావిస్తోంది. దీనిపై కసరత్తులో భాగంగా హర్యానాలోని హిస్సార్ లో వచ్చే వారం ‘ఏఐ మెకనైజ్డ్ వార్​ఫేర్’ అంశంపై రెండు రోజుల పాటు ఆర్మీ అధికారుల సమావేశాన్ని నిర్వహించాలని సౌత్ వెస్టర్న్ కమాండ్ (ఎస్ డబ్ల్యూసీ) నిర్ణయించింది. మిలటరీలో ఏఐ వినియోగంలో చైనా ఇప్పటికే చాలా దూరం ముందుకెళ్లిందని, మనం కూడా ఎలాగైనా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి, చైనాను అందుకోవాల్సిందేనని ఎస్​డబ్ల్యూసీ చీఫ్​ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ క్లేర్ వెల్లడించారు.

యుద్ధరంగంలో ఏఐ వాడకంతో మన దళాలను సమర్థంగా నడిపించడమే కాకుండా.. శత్రుపక్షానికి మరింత ఎక్కువ నష్టం కలిగించవచ్చని ఆయన తెలిపారు. 2024 నాటికి రక్షణ రంగంలో 25 ప్రత్యేక ఏఐ ప్రొడక్ట్స్​ను సిద్ధం చేసుకోనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల చేసిన ప్రకటించారని గుర్తు చేశారు. ‘‘యుద్ధ సమయాల్లో రాడార్లు, డ్రోన్లు, శాటిలైట్ల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎక్కువ మంది అధికారులను ఇందుకు వాడుకోవాలని అనుకున్నా, గందరగోళంగా మారే అవకాశముంటుంది. అదే మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకోగల ఏఐ టెక్నాలజీ రెడీగా ఉంటే.. యుద్ధ సమయంలో తప్పకుండా మనదే పైచేయి అవుతుంది. అందుకే ఈ దిశగా ఎస్ డబ్ల్యూసీ కసరత్తు మొదలుపెట్టింది” అని ఆయన వివరించారు.