
- ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5 శాతం పడిన సేల్స్
- విలువ పరంగా 9 శాతం వృద్ధి: క్రెడాయ్–సీఆర్‌ఈ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 5శాతం తగ్గి 2,53,119 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో 2,67,219 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రెడాయ్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ కలిసి విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఇండ్ల రేట్లు పెరగడంతో సేల్స్ పడిపోయాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అమ్ముడైన ఇండ్ల విలువ మాత్రం ఏడాది లెక్కన 9శాతం పెరిగి రూ.3.59 లక్షల కోట్లకు చేరింది. గతేడాది మొదటి ఆరు నెలల్లో ఈ నెంబర్ రూ.3.31 లక్షల కోట్లుగా ఉంది. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై ఎంఎంఆర్, పుణె, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఇండ్ల అమ్మకాల డేటాను సేకరించి ఈ రిపోర్ట్‌ను రెడీ చేశారు.
క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ మాట్లాడుతూ, హోమ్ బయ్యర్లు పెద్ద, ప్రీమియం, మెరుగైన లొకేషన్‌లో గల ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనే విషయం దీని ద్వారా తెలుస్తోందని అన్నారు. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో విలువ పరంగా ఇండ్ల సేల్స్ 21శాతం వృద్ధి చెందాయని తెలిపారు. టైర్ 1 మార్కెట్లలో ఇండ్ల సగటు టికెట్ సైజ్ 14శాతం పెరిగి గతేడాది నమోదైన రూ.1.24 కోట్ల నుంచి రూ.1.42 కోట్లకు చేరిందని, గురుగ్రామ్, నోయిడాలో లగ్జరీ ఇండ్ల విక్రయాలు పెరిగాయని సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా అన్నారు.