‘అనఫీయల్​ ఫుడ్​ హాలిడేస్​’ ఎలా మొదలయ్యాయంటే..

‘అనఫీయల్​ ఫుడ్​ హాలిడేస్​’ ఎలా మొదలయ్యాయంటే..

ప్రతి దేశంలోనూ ఏటా సంప్రదాయం ప్రకారం పండుగలు చేసుకోవడం మామూలే. వాటికోసం గవర్నమెంట్లు సెలవులు​ కూడా ఇస్తాయి. అయితే, గ్లోబలైజేషన్​, టెక్నాలజీ పెరిగాక కొత్తగా ‘డే’ల పేరుతో అన్నిచోట్లా పండుగలు స్టార్ట్​ అయ్యాయి. ఇలాగే జపాన్​లో ఈ మధ్య అనధికారిక​ హాలిడేస్​ చాలా పుట్టుకొచ్చాయి. ‘స్ట్రాబెర్రీ డే’, ‘బనానా డే’, ‘కర్రీ డే’, ‘షార్ట్​​కేక్​ డే’.. అంటూ ఏదో ఒక పండుగ జరుగుతోంది. ఆ దేశ క్యాలెండర్లలో కూడా ఇవి ఉంటున్నాయి. ఈ కొత్త ట్రెండ్​ని ఆ దేశంలోని రెస్టారెంట్స్​, హోటల్స్​, మాల్స్​ తమ బిజినెస్​ కోసం ఫుల్​గా వాడుకుంటున్నాయి. ఇంతకీ ఈ ‘అనఫీయల్​ ఫుడ్​ హాలిడేస్​’ ఎలా మొదలయ్యాయంటే..

జపాన్​లో ఈ కొత్త ‘డే’స్​ రావడం వెనక ఉండేది ఆ దేశంలోని భాషే. ఉదాహరణకు ‘బనానా డే’ ఎలా వచ్చిందంటే.. జపనీస్​లో ‘బ’ అంటే ఎనిమిది, ‘న’ అంటే ఏడు. ఆ ప్రకారం ఏడో నెల ఎనిమిదో తేదీని ‘బనానా డే’గా మార్చుకున్నారు! అలాగే స్ట్రాబెర్రీని జపనీస్​లో ‘ఇచిగొ’ అంటారు. ఇందులో ‘ఇచి’ అంటే ఒకటి, ‘గొ’ అంటే ఐదు. దీన్ని బట్టి ప్రతి నెల 15వ తేదీ లేదా జనవరి 15ను ‘స్ట్రాబెర్రీ డే’ గా చేసుకుంటున్నారు. ఇక ‘షార్ట్​కేక్ డే’ది మరో సంగతి. జపాన్​లో ప్రతి షార్ట్​కేక్​ పైన స్ట్రాబెర్రీ పెడతారు. ఆ ప్రకారం ‘స్ట్రాబెర్రీ డే’ జరుపుకున్న వారం తర్వాత ‘షార్ట్​కేక్​ డే’గా జరుపుకుంటున్నారు. అయితే,  ఇలాంటి వాటిలో మంచి కారణాలతో వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ‘కర్రీ డే’. జపాన్​ ప్రభుత్వం స్కూళ్ళలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా ఒక ‘కర్రీ’ ఉండాలని 1982, జనవరి 22న ఒక చట్టం చేసింది. దాని ప్రకారం జనవరి 22 ‘కర్రీ డే’ అయింది. 

జపాన్​లో బంగాళాదుంపతో చేసే ‘పొకి’ ఫుడ్​ ఫ్రెంచ్​ ప్రైస్​లా ఉంటుంది. ఇందులో స్టిక్స్​లా ఉండే ప్రైస్​ని చూస్తే ‘11’ సంఖ్య గుర్తుకొస్తుంది. ఇది అమెరికాలో జరిగిన 11/11 దుర్ఘటనను గుర్తుచేస్తున్నట్లు ఉంటుందని, నవంబర్​ 11న ‘పొకి డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే జపనీస్​లో మాంసాన్ని ‘నికు’ అంటారు. ‘ని’ అంటే రెండు, ‘కు’ అంటే తొమ్మిది. ఈ రెండింటినీ కలిపి ప్రతి నెల 29న, లేదా ఫిబ్రవరి 9న ‘మీట్​ డే’ చేసుకోవడం మొదలుపెట్టారు. ‘హనీ డే’ కథ కూడా ఇలాంటిదే. ‘ని’ అంటే రెండు కదా, ‘హ’ అంటే ఎనిమిది. దీని ప్రకారం ఆగస్ట్​ 2 ‘హనీ డే’ అయింది! ​ఇలా జపాన్​ క్యాలెండర్​లో కొత్త కొత్త ‘డే’లన్నీ పుట్టుకొస్తున్నాయి. వీటిని ‘అనఫీయల్​ హాలిడేస్​’గా చేసుకుంటూ ఎంజాయ్​ చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. ఈ కల్చర్​ ఎప్పుడు? ఎలా? మొదలైందో కానీ జపాన్​లోని మాల్స్​, రెస్టారెంట్స్​, హోటల్స్​, రిసార్ట్స్​ పండగ చేసుకుంటున్నాయి. వాటి బిజినెస్​ మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది. 

ఇది చదివాక, కొన్నేండ్ల కిందట మనదేశంలో కూడా ఒక కొత్త పండుగ జరిగినట్లు గుర్తొచ్చిందా? అదేనండి.. అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు బట్టలు పెట్టడం. దీనివల్ల అప్పట్లో కొన్ని రోజులపాటు బట్టలషాపులు కిటకిటలాడిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది!