
- ఈ జీవోను సపోర్టు చేస్తుండా? అపోజ్ చేస్తుండా? సీఎం చెప్పాలె: సంజయ్
- ఇది ట్రిపుల్మెన్ జీవోగా మారిందని కామెంట్
- రైతుల దగ్గర తక్కువ ధరకు వందల ఎకరాలు కొని, కోట్లు దండుకున్నారని ఫైర్
రాష్ట్రం కోసం 1,400 మంది ప్రాణత్యాగం చేశారు. కానీ కేసీఆర్.. అమరుల సంఖ్యను 600లకు తగ్గించాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు, పడిపోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పథకాలు ఎక్కువ. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని, ఉద్యోగాలు ఊడగొడ్తున్న ఈ సర్కార్.. దళిత బంధు వంటి పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తోంది. – బండి సంజయ్, స్టేట్ బీజేపీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: ‘‘జీవో 111.. ట్రిపుల్ మెన్ జీవోగా మారింది. దీని పరిధిలోనే కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు, అల్లుడు హరీశ్ రావుకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. వాటిని ఎట్ల కట్టిన్రు” అని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. మంగళవారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా చిలుకూరు చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర మొయినాబాద్ కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో సంజయ్ మాట్లాడారు. రైతుల దగ్గరి నుంచి తక్కువ ధరకు వందల ఎకరాలు కొని, వేల కోట్లు దండుకుంటున్నారని కేసీఆర్, ఆయన కుటుంబంపై మండిపడ్డారు.
అమరులకు అవమానం..
‘‘రాష్ట్రం కోసం 1,400 మంది ప్రాణత్యాగం చేశారు. కానీ కేసీఆర్.. అమరుల సంఖ్యను 600లకు తగ్గించాడు” అని సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘జిల్లాకు చెందిన యాదిరెడ్డి, సరిత, మహేశ్ గౌడ్ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నారు. వీళ్లందరికీ ఉరితాళ్లు, అగ్గిపెట్టెలు దొరికినయ్. కానీ కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి, ఆ పార్టీ నాయకులకు మాత్రం అగ్గిపెట్టెలే దొరకలేదట” అని విమర్శించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని ఈ సర్కార్.. దళిత బంధు వంటి పథకాలు పెట్టి మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, 2023లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర సర్కార్ ఏమీ చేస్తలేదని, కేంద్రమే రూ.1,040 కోట్లు ఇచ్చిందని చెప్పారు.
టీఆర్ఎస్ బాక్సు బద్దలు..
ఇప్పటికే ఎంఐఎం బాక్సు బద్దలైందని, ఇక ఈ యాత్రకు వస్తున్న జనాన్ని చూసి టీఆర్ఎస్ బాక్సు కూడా బద్దలవుతోందని సంజయ్ అన్నారు. ‘‘పాతబస్తీకి వచ్చి సభ పెట్టే దమ్ముందా? అని మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా ప్రధానికి సవాల్ చేస్తే.. భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి వద్ద సభ పెట్టి బీజేపీ దమ్మేంటో చూపించాం. మళ్లీ సవాల్ చేస్తే.. దారుస్సలాం వద్ద సభ నిర్వహించి, మా సత్తా ఏందో చూపిస్తం” అని చెప్పారు. కాగా, బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండలానికి చెందిన పలువురు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
కేసీఆర్.. ఫామ్ హౌస్ సీఎం: సంబిత్ పాత్రో
‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినవ్. నీ కొడుకు, అల్లుడికి మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వాళ్లకెందుకు ఉద్యోగాలు ఇస్తలేవ్, ఇలాంటి ఫామ్ హౌస్ సీఎంను ఎక్కడా చూడలేదు” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ నెల 4న వికారాబాద్ లో జరిగే యాత్రలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, 7న సంగారెడ్డిలో జరగనున్న యాత్రలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.