పదేండ్లలో ఎన్ని హామీలు అమలు చేసిన్రు? : మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఎన్ని హామీలు అమలు చేసిన్రు? :   మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ, వెలుగు: బీజేపీ పదేండ్ల పాలనలో ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలని బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటుడంతో బండి సంజయ్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీల్లో మొదట చేయాల్సినవి అమలు చేశామన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్​కు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. 

ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లడుతూ.. అవినీతికి పాల్పడితేనే బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఎంపీగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. రాముని పేరు చెప్పి ఓట్లు అడగడమే బీజేపీ పని అని విమర్శించారు. గత ఎన్నికల్లో మంగళ సూత్రాలు అమ్మినోళ్లకు ఇప్పుడు నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.  

మోదీ దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు పంచిస్తున్నారని  విమర్శించారు. ఓడిపోతున్నామనే భయంతోనే కాంగ్రెస్​పై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ  కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శంకర్, మండల అధ్యక్షుడు ధర్మయ్య, సుధాకర్, తిరుపతిరెడ్డి, రాజయ్య, రవీందర్, శ్రీధర్, శ్రీకాంత్ ఉన్నారు.