అవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్

అవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్

న్యూఢిల్లీ:  డయాబెటిస్ బాధితుడు అయినప్పటికీ బెయిల్ కోసం అర్వింద్​ కేజ్రీవాల్ జైలులో మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్​ఫోర్స్​మెంట్  డైరెక్టరేట్​ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం ఖండించారు. కేవలం మూడు మామిడి పండ్లు, ఆరు సార్లు మాత్రమే స్వీట్ తిన్నట్టు కోర్టుకు వివరించారు. తీహార్ జైలులో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్​ వేసిన పిటిషన్‌‌‌‌ పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదనను ఆయన కోర్టుకు వినిపించారు. ‘‘తీహార్ జైల్లో నేనొక ఖైదీని. గౌరవప్రదమైన జీవితం, మంచి ఆరోగ్యం పొందే హక్కు నాకు లేదా? నా డాక్టర్​తో 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్​కు కూడా అనుమతించలేని గ్యాంగ్​స్టర్​నా? నా బ్లడ్​లో షుగర్ లెవల్స్ కావాలనే పెంచుకుంటున్నట్టు ఈడీ ఆరోపిస్తున్నది. బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నట్టు చెప్తున్నది. బెయిల్ పొందేందుకు పక్షవాతం బారినపడేంత రిస్క్ నేనెందుకు చేస్తా? నా డాక్టర్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్న’’ అని కేజ్రీవాల్​ తెలిపారు. 

48 సార్లు ఇంటి భోజనం తిన్న

2012 నుంచి డెయిలీ 50 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్నట్టు అర్వింద్ కేజ్రీవాల్ కోర్టుకు చెప్పారు. ఉదయం 28 యూనిట్స్, రాత్రి 22 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకోవాల్సిందిగా డాక్టర్ సూచించినట్టు తెలిపారు. 29 రోజులుగా ఇన్సులిన్ తీసుకోవడంలేదని కోర్టుకు వివరించారు. ‘‘తీహార్ జైలులో నాకోసం ఇంటి నుంచి 48 సార్లు భోజనం వచ్చింది.  జైలులో ఇప్పటి వరకు మూడు మామిడి పండ్లే తిన్న. ఏప్రిల్​8 తర్వాత నుంచి ఒక్క పండు కూడా తినలే. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్న. అది కూడా నవరాత్రి ప్రసాదమని చెప్తే తీసుకున్న. మామిడి పండ్లు.. షుగర్ బుల్లెట్ల మాదిరి చేస్తాయన్న ఈడీ కామెంట్లు విని షాక్ గురయ్యా. బ్రౌన్, వైట్ రైస్ కంటే మామిడి పండ్లలోనే షుగర్ తక్కువగా ఉంటది. మెడికల్ బెయిల్ కోసం ఎవరైనా లైఫ్​ను రిస్క్​లో పెడ్తారా? ఈడీ చేస్తున్న వాదనల్లో నిజంలేదు’’అని అన్నారు. చాయ్​లో షుగర్ వేసుకుని తాగుతున్నారన్న ఈడీ వాదనను ఆయన ఖండించారు. షుగర్ ఫ్రీ చాయ్ మాత్రమే తాగుతున్నట్టు తెలిపారు. తన డైట్​పై మీడియాలో ఇష్టమొచ్చినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. 

స్వీట్, ఫ్రూట్స్ కావాలనే తింటున్నరు

కేజ్రీవాల్ డైట్ చార్ట్​ను ఈడీ అధికారులు కోర్టులో సబ్మిట్ చేశారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కోర్టు ఆర్డర్ మేరకు లీగల్ ములాఖత్​లు ఆపేశాం. డైట్ చార్ట్ ప్రకారం కేజ్రీవాల్ ఫుడ్ తీసుకోవడంలేదు. జైల్లో సరిపడా మెడికల్ స్టాఫ్ ఉంది. ప్రతి రోజూ హెల్త్ చెకప్ చేయిస్తున్నం. డైట్ చార్ట్​లో స్వీట్ లేదా ఫ్రూట్స్ తినాలని లేదు. చార్ట్​కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు. దీంతోనే బ్లడ్​లో షుగర్ లెవల్స్ పెరుగుతున్నయ్. మామిడిపండ్లు, అరటిపండ్లు, చీకూ వంటి స్వీట్ ఐటెమ్స్ తినొద్దని ఎయియ్స్ డాక్టర్లు కూడా సూచించారు” అని ఈడీ వాదించింది. ఈడీ ఆరోపణలపై రిప్లై 
ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్​ను కోర్టు ఆదేశించింది.