తుఫాన్ పోయింది.. తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు

తుఫాన్ పోయింది.. తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు

ఓ వైపు చలికాలం కొనసాగుతుంటే మరోవైపు వర్షాలు ప్రజల్ని వణికిస్తున్నాయి.  తాజాగా బంగాళాఖాతంలో  ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై గట్టిగానే  పడింది. ఈ క్రమంలో  రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తుఫాన్ ప్రభావం తగ్గిపోయినప్పటికీ మళ్లీ భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.  

రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.   ముఖ్యంగా లోతట్ట ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల  కోతకు వచ్చిన వరి, కల్లాల్లో పోసిన వడ్లకు తీవ్ర నష్టం కలిగించాయి.  పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను ఆరబోసేందుకు, కుప్పలు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక ఇబ్బంది పడ్తున్నారు. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలడంతో నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు.