
- కాల్పులు ఆగిన విషయం తెలియగానే విమానం నుంచి దిగివచ్చిన రికీ
- పంజాబ్ కింగ్స్ ఫారిన్ ప్లేయర్లు ఇండియాలోనే ఉండేలా ఒప్పించిన హెడ్ కోచ్
న్యూఢిల్లీ: ఇండియా–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఫారిన్ ప్లేయర్లు తిరిగి ఇండియాకు వస్తారని ఐపీఎల్ జట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీసుకున్న నిర్ణయం అన్ని ఫ్రాంచైజీల్లోని ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఐపీఎల్ ఆగిపోవడంతో శనివారం సాయంత్రం తమ దేశానికి చెందిన పంజాబ్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడ్డిన్‌తో కలిసి రికీ పాంటింగ్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరేందుకు విమానం ఎక్కాడు.
అయితే, దాయాది దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన రావడంతో పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ తనకు ఈ సమాచారం అందించారు. దాంతో పాంటింగ్, హడ్డిన్ మరో క్షణం ఆలోచించకుండా విమానం దిగి ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు జట్టులోని కొందరు ఫారిన్ ప్లేయర్లు ఇండియాలోనే ఉండిపోయేలా రికీ వారిలో ధైర్యం నింపాడు. దాంతో శనివారం రాత్రి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్లంతా మనసు మార్చుకొని ఇక్కడే ఉండిపోయారు. ‘ఇది పాంటింగ్ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఆయన మాత్రమే ఇలాంటి పని చేయగలరు’ అని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ చెప్పారు.
ఈనెల 8న ధర్మశాలలో మ్యాచ్ ఆగిపోయిన తర్వాత ఆందోళనలో ఉన్న ఆటగాళ్లు రోడ్డు, రైలు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. ‘ఫారిన్ ప్లేయర్లకు ఇలాంటి పరిస్థితులు అలవాటు లేవు. అందుకే వాళ్లు ఆందోళన చెందడం సహజం. స్టోయినిస్ నేతృత్వంలో వారంతా వీలైనంత త్వరగా స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్నారు.
కానీ కాల్పుల విరమణ తర్వాత పాంటింగ్ వారిని ఉండమని ఒప్పించారు. ఇది నా దృష్టిలో అద్భుతం’ పంజాబ్ కింగ్స్ జట్టు అధికారి ఒకరు చెప్పారు. పంజాబ్ జట్టులోని సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్, అఫ్గాన్ ప్లేయర్ ఒమర్‌జామ్ మాత్రమే ఇండియా నుంచి వెళ్లిపోయిన ఫారిన్ ప్లేయర్లు. వీళ్లు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. లీగ్ తిరిగి ప్రారంభం అయితే తిరిగి వచ్చే అవకాశం ఉంది.