మీ ఇళ్లలో, ఆఫీస్లో ఉండే సీసీ కెమెరాల హ్యాకింగ్ ఎలా జరుగుతుందంటే..

మీ ఇళ్లలో, ఆఫీస్లో ఉండే సీసీ కెమెరాల హ్యాకింగ్ ఎలా జరుగుతుందంటే..

విదేశీ సర్వర్లతో అనుసంధానమైన సీసీ కెమెరాల్లో భద్రతా ప్రమాణాలు అత్యంత బలహీనంగా ఉంటున్నాయి. హ్యాకర్లు భద్రత లేని ప్రోటోకాల్‌‌‌‌లు, ఎన్‌‌‌‌క్రిప్ట్ చేయని వెబ్‌‌‌‌సైట్ల ద్వారా వీడియో ఫీడ్‌‌‌‌ను రిమోట్‌‌‌‌గా స్వాధీనం చేసుకుంటున్నారు. చాలా కెమెరాలు ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌‌‌‌లో ఉండే "అడ్మిన్/అడ్మిన్" వంటి అత్యంత బలహీనమైన పాస్‌‌‌‌వర్డ్​లతోనే వస్తున్నాయి. వీటిని బ్రూట్-ఫోర్స్ దాడుల ద్వారా హ్యాకర్లు సులభంగా ఛేదిస్తున్నారు.

పాతబడిన ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌లు, ప్యాచ్ చేయని ఫర్మ్​వేర్ వల్ల సాఫ్ట్​వేర్‌‌‌‌లో ఏర్పడే 'బగ్‌‌‌‌లు' మాల్‌‌‌‌వేర్ దాడులకు తలుపులు తీస్తున్నాయి. భారత్‌‌‌‌లో వినియోగిస్తున్న మెజారిటీ కెమెరాల డేటా దేశం వెలుపల ఉన్న కంప్యూటర్ల(సర్వర్లలో) ద్వారా పంపబడుతోంది. అంటే, ఇంట్లోనో లేదా ఆఫీసులోనో రికార్డ్ అవుతున్న దృశ్యాలు నేరుగా వేరే దేశంలోని సర్వర్లలో నిక్షిప్తమవుతున్నాయి.

మొబైల్‌‌‌‌లో సీసీటీవీ ఫుటేజ్ చూడాలనుకున్నప్పుడు, ఆ సిగ్నల్  కెమెరా నుంచి నేరుగా మన ఫోన్‌‌‌‌కు రాదు. అది ముందుగా కెమెరాను తయారు చేసిన కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్‌‌‌‌కు (చైనా, జపాన్, అమెరికాలోని సర్వర్లకు) వెళ్లి, అక్కడి నుంచి తిరిగి మన ఫోన్‌‌‌‌కు వస్తుంది. మన డేటా సరిహద్దులు దాటి వెళ్లినప్పుడు దానిపై భారత ప్రభుత్వానికి, మన చట్టాలకు నియంత్రణ ఉండదు.

డేటా అంత దూరం ప్రయాణించే క్రమంలో ఎక్కడైనా భద్రతా లోపాలు ఉంటే హ్యాకర్లు దొంగిలించడం సులభం అవుతుంది. ఈ నేపథ్యంలో  కేంద్ర హోంశాఖ, సైబర్ బ్యూరో అధికారులు"మేడ్ ఇన్ ఇండియా" కెమెరాలను వాడమంటున్నారు. మన దేశంలోనే సర్వర్లు ఉన్న కంపెనీలను ఎంచుకుంటే మన డేటా సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.