ఇంట్లో ఆసరాగా ఉంటనని ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఎలా..? : వైఎస్ షర్మిల

ఇంట్లో ఆసరాగా ఉంటనని ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఎలా..? : వైఎస్ షర్మిల

8 ఏళ్లుగా కేసీఆర్ పథకాల పేరు చెప్పి మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకొని.. 
హన్మకొండ జిల్లాలోకి వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ వద్ద వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, కేసీఆర్ జన్మకి ఒక్క మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. వైఎస్ఆర్ 5 ఏళ్లలో కులాలకు, మతాలకు అతీతంగా పరిపాలన చేశారని చెప్పారు. సీఎం అంటే వైఎస్ఆరేనని, ఇప్పుడు వైఎస్సార్ పాలన లేదని తెలిపారు. వైఎస్సార్ పథకాలు పూర్తిగా బంద్ పెట్టారని ఆరోపించారు.

108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్న వైఎస్ షర్మిల..  ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంట్లో ఆసరాగా ఉంటనని ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలు అన్నీ గారడి అన్న ఆమె...5 వేలు ఇచ్చి రైతులకు కోటీశ్వరులు చేశానని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో 40 వేల సబ్సిడీ పథకాలు ఉండేవని, అవన్నీ బంద్ పెట్టి ముష్టి 5 వేలు ఇచ్చి గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. అసలు ప్రపంచంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఎన్నికలతోనే పని.. ఓట్లు వస్తేనే బయటకు వస్తాడన్నారు. ఓట్లు గుద్దించుకుంటారు.. ఫామ్ హౌజ్ లో పంటారని కామెంట్ చేశారు.

తెలంగాణ లో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారన్న పట్టింపు లేదని, అప్పుల పాలై చస్తుంటే పట్టించుకోరని షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. రూ. 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారన్నారు. ఇప్పటికీ కేసీఆర్ ను రెండు సార్లు నమ్మింది చాలన్న షర్మిల... మళ్ళీ నమ్మితే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాడని మండిపడ్డారు. మళ్ళీ కేసీఆర్ ను నమ్మితే మన బిడ్డలు మనలను క్షమించరన్న ఆమె.. వైఎస్ఆర్ పాలన తెలంగాణలో మళ్ళీ రావాలని, వైఎస్సార్ పథకాలు మళ్ళీ అమలు కావాలన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజల కోసం పని చేసేది కాదన్న షర్మిల... ప్రజల పక్షాన నిలబడే పార్టీనే లేదని చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నారు. వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని షర్మిల స్పష్టం చేశారు.