బరువు తగ్గించుకోవడం ఎలా?

బరువు తగ్గించుకోవడం ఎలా?

కాస్త లావైతే చాలు. ‘ఏంటి లావైపోయావ్​? ఏదైనా సమస్యా?’ అంటూ వంద రకాల ప్రశ్నలు.‘ఇంత లావుగా ఉంటే పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు’... అని సూటిపోటి మాటలు. అంతెందుకు ప్రాణంగా ప్రేమించానని చెప్పుకునేవాళ్లు కూడా ‘అమ్మాయి లావైతే.. పెండ్లి చేసుకోవాలా? వద్దా’ అని ఆలోచించే స్టేజ్​కి వెళ్లిపోయారు. ఇంకొందరైతే పెళ్లయ్యాక కూడా ‘లావుగా ఉన్నావ్, నువ్వు నాకొద్దు’ అని మొహం మీదే చెప్తున్నారు. అలాగని ఇది కేవలం ఆడవాళ్ల సమస్య కాదు. మగవాళ్లకూ సమస్యే. వాళ్లకూ పెళ్లి చూపుల నుంచే మొదలు బరువు సమస్య. నలుగురు కలిసినప్పుడు నవ్వుకోవడానికి, జోక్స్​ వేసుకోవడానికి లావుగా ఉన్నవాళ్లే టార్గెట్. ఇది ఒక్క ఊరికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఎదురవుతున్న సమస్య. అందుకే ఇది ఇప్పుడు ‘గ్లోబల్ ఇష్యూ’ అయిపోయింది. 

ఇంతమందిని వేధిస్తున్న బరువు తగ్గించుకోవడం ఎలా? అంటే... ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో తెలిస్తే సొల్యూషన్ కనిపెట్టొచ్చు. బరువు ఎలా పెరిగారు? ఎందుకు పెరిగారో కారణాలు తెలుసుకుంటే తగ్గడం చాలా ఈజీ అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితా ఒకటి చేశారు. అందులో నౌరు, కుక్ ఐలాండ్స్, పలావ్, మార్షల్ ఐలాండ్స్, తువలు, నియు, టోంగా, సమోవా, కిరిబటి, మైక్రోనేసియా అనే ఈ పది దేశాల్లో ఊబకాయలు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ మార్షల్ ఐలాండ్స్, పలావ్​ తప్ప మిగతా ఎనిమిది దేశాలు దక్షిణ పసిఫిక్​లోనే ఉన్నాయి. మనదేశం ప్రపంచంలో ఒబేసిటీ తక్కువ ఉన్న పది దేశాల్లో ఒకటిగా ఉంది.  జాతీయ స్థాయిలో ఒబేసిటీ రేటు తక్కువే కదా... మరి ఇప్పుడు ఈ విషయం అవసరమా? అనిపిస్తుంది. కానీ రాష్ట్రస్థాయిలో ఒబేసిటీ రేటు ఎక్కువే. దానికి కారణాలు ఏంటి?

రాష్ట్రం బరువెక్కింది!

తెలంగాణలో ప్రజారోగ్యం విషయానికి వస్తే అంత బాగాలేదని ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్-5) రిపోర్ట్స్​ చెప్తున్నాయి. ఆ సర్వేలో, రాష్ట్రంలోని పురుషుల్లో ఒబేసిటీ2015-–16లో 24.2 శాతం ఉంది. అది2019-–20 నాటికి 32.3 శాతానికి పెరిగింది. ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్-5 కోసం30 జూన్, 2019 నుండి14 నవంబర్, 2019 వరకు ఫీల్డ్ వర్క్ చేశారు. అందులో భాగంగా 27,351 ఇండ్లు తిరిగి, 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులతో మాట్లాడి సమాచారం సేకరించారు. ఈ సర్వే ప్రకారం, పల్లెలతో పోలిస్తే సిటీలో ఉంటున్న మగవాళ్లలో ఒబెసిటీ చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 28.1 శాతం ఉంటే, సిటీల్లో 40.2 శాతం మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. సిటీల్లో ఉండే ఆడవాళ్లలో ఊబకాయం 41.7 శాతంగా ఉంటే.. గ్రామీణ మహిళల్లో కూడా ఊబకాయుల సంఖ్య పెరిగింది. కానీ... 2015-–16లో 28.6 శాతం ఉండగా, 2019నాటికి 30.1 శాతానికి పెరిగింది. అయితే వీళ్లను బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఆధారంగా25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం లేదా అధిక బరువుగా విభజించారు. 

తెలంగాణ మహిళల జనాభా, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించింది కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్​మెంట్(సీఎస్​డీ). తెలంగాణలో మొత్తం మహిళల్లో30.1 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. అందులోనూ 51 శాతంతో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉంది. సిటీలోని ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాగే 14 శాతంతో ఆసిఫాబాద్​ కొమురం భీం జిల్లా చివరి స్థానంలో ఉంది. 

పెరగడానికి కారణాలు 

బరువు పెరగడానికి ముఖ్యంగా పోషకాహారలోపం, ఎక్కువగా తినడం, జీన్స్, కల్చర్​, మెటబాలిజం.... ఇలా వీటిలో ఏదో ఒక కారణం ఉంటుంది. బరువు పెరిగితే రకరకాల జబ్బుల్ని ఆహ్వానించినట్లే.1975తో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ మూడింతలు పెరిగింది. వారిలో 13 శాతం పెద్దవాళ్లు ఒబేసిటీతో బాధపడుతుంటే, 39 శాతం మంది ఓవర్ వెయిట్​ అయ్యారు. బరువు పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. శారీరక శ్రమ చేయకపోవడం. నిద్ర సరిపడా లేకపోవడం. అతిగా తినడం. వీటివల్లే చాలామంది ఓవర్ వెయిట్ అవుతున్నారు. కొందరు ఒబెసిటీ బారిన కూడా పడుతున్నారు. 

అతిగా తినడం 

బరువు పెరుగుతుంది అంటే అవసరానికి మించి తినడం మొదటి కారణం. తిన్నదానికి తగ్గ శారీరక శ్రమ లేకపోవడం మరో కారణం. సిటీల్లో ఉండే జనాలు రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అలా ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా అనిపించడం ఆలస్యం ఫోన్​లో పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్, ఐస్​క్రీమ్... ఆర్డర్ పెడుతున్నారు. లేదా ఫ్రిజ్​లో తినేవి ఉంటే వాటిని ఖాళీ చేస్తున్నారు. కూర్చుని పొట్ట నిండా తింటారు. ఇంకొందరేమో.. ఆర్డర్ పెట్టిన ఫుడ్ కొంచెం తినగానే సరిపోయినా ఎక్కడ వేస్ట్ అవుతుందో అని కడుపు నిండినా... మిగిలిపోయింది బలవంతంగా నోట్లో కుక్కుకుంటారు. ఇలా చేస్తే బరువు పెరగకుండా ఉంటారా? పైగా తినేదేమన్నా హెల్దీ ఫుడ్డా అంటే కానే కాదు.. ‘‘అంతగా ఆకలేస్తే... తప్పదు తినాలి అనుకుంటే బరువు పెరిగే ఫుడ్ కాకుండా ఆకలి తీర్చే ఫుడ్ తినాలి. అంటే, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినాలి” అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు.

శారీరక శ్రమ లేకపోవడం

సైన్స్ ప్రకారం, తిన్న ఫుడ్ ఎప్పటికప్పుడు ఖర్చవ్వాలి. అలా ఖర్చుకానిదంతా కొవ్వుగా మారిపోతుంది. అది క్రమంగా పొట్టలో అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. దాంతో బరువు పెరుగుతారు. అందుకని రోజూ కాసేపు వాకింగ్, రన్నింగ్, ఎక్సర్​సైజ్​ల వంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. కానీ, పాటించేవాళ్లు లేరు. బద్ధకం బాగా పెరిగిపోయింది. అందుకు ముఖ్య కారణం టెక్నాలజీ. ఇంట్లో అంట్లు తోమడం నుంచి బట్టలు ఉతకడం, పిండి రుబ్బే గ్రైండర్, రోటీ మేకర్... ఇలా ప్రతి పనికి మెషిన్​ ఉంది. ఒకప్పుడు అన్ని పనులూ స్వయంగా చేసుకునేవాళ్లు. ఒళ్లు వంచి కష్టపడేవాళ్లు. ఇప్పుడేమో ఏ పనికి ఆ మెషిన్ లేకపోతే, ఆ పని ఆగిపోయినట్లే. ఇదివరకు రోజుల్లో మార్కెట్​లోకి కొత్తగా ఒక మెషిన్​ వచ్చిందంటే అది ఒక లగ్జరీగా చూసేవారు. కానీ ఇప్పుడు అది ఒక అవసరంగా మారిపోయింది.

నిద్ర లేమి

బరువు పెరిగేందుకు ముందు చెప్పుకున్న కారణాలు ఒక రకమైతే... మరో ప్రధాన కారణం నిద్ర లేమి. నిద్ర తక్కువ కావడం వల్ల శరీరంలో హార్మోన్స్​ ఇంబాలెన్స్ అవుతాయి. దాంతో ఎక్కువ తినేలా చేస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లు ఆకలిని పెంచుతాయి. నిద్ర సరిలేదంటే ఈ హార్మోన్లు ఆకలిని పెంచుతాయి. ఇదేకాకుండా హార్మోన్ లోపం వల్ల కార్టిసాల్​ స్థాయిలు తగ్గుతాయి. వీటి వల్ల ఒబెసిటీ రావొచ్చు. సరిపడా నిద్ర లేకపోతే జీవక్రియలు కూడా దెబ్బ తింటాయి. నిద్ర తక్కువైతే ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్ తినాలనిపిస్తుంది. అంతేకాకుండా శరీరానికి ఎక్సర్​సైజ్​ లేకపోయినా నిద్ర సరిగా పట్టదు. దాంతో రోజంతా నిద్ర మత్తులో ఉంటారు. ఇవి బరువు పెరగడానికి ప్రత్యక్ష కారణాలు. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు కూడా బరువు పెరగడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. అవేంటంటే... మానసిక ఒత్తిడి, డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు. 

మానసిక ఒత్తిడి 

మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ విడుదలై గ్లూకోజ్​ పెరిగేలా చేస్తుంది. దాంతో జీవక్రియలు దెబ్బతిని కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. దాని వల్ల కూడా విపరీతంగా తింటారు. కానీ, శక్తి ఉండదు. దాంతో ఏ పనీ చేయలేక ఎప్పుడూ మబ్బుగా కూర్చునే ఉంటారు. ఇదేకాకుండా మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్​ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అలవాట్లు ఉన్నవాళ్లు తిండి సరిగా తినరు. టైంకి తినకుండా, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటుంటారు. పైగా వాళ్లు తినే ఫుడ్ కూడా హెల్దీగా ఉండదు. జంక్​ ఫుడ్స్, మసాలా ఐటమ్స్ తినడానికి ఇష్టపడతారు. అవి తినడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. ఆటోమెటిక్​గా బరువు పెరుగుతారు. 

తెగ పెరుగుతున్నారు

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఒక బూచిలా బెదిరిస్తోందని చెప్పొచ్చు. ఇంటికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్​తో బాధపడుతున్నారని ఇటీవల సర్వేల్లో తేలింది. పైగా బరువు పెరగడానికి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా పెరిగిపోతున్నారు.ఈ మధ్యకాలంలో ఒబేసిటీ, ఓవర్​ వెయిట్ రేటు ఇంకాస్త పెరిగిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కరోనా లాక్​డౌన్​ మూలంగా ఇంటికే పరిమితమైన జనాలు.. విపరీతంగా బరువు పెరిగిపోయారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో ఈ రేటు బాగా ఎక్కువైందని స్టడీల్లో వెల్లడైంది. కాబట్టి... ఇప్పటికైనా మేల్కొని.. బరువు తగ్గాల్సిందే. అలాగయితేనే రాబోయే తరాలు బాగుంటాయని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. అయితే బరువు పెరగడంలోనూ రకరకాలున్నాయి. ఒకటి ఓవర్ వెయిట్, రెండోది ఒబెసిటీ. బిఎంఐ ప్రకారం వీటిని విభజిస్తారు. ఇది పిల్లల్లో, పెద్దల్లో వేరుగా ఉంటుంది. 

నిద్ర తక్కువైనా...

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే ఎక్కువ నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే అధిక బరువు లేదా ఒబెసిటీ బారిన పడే ప్రమాదముంది. నిజానికి నిద్ర తక్కువైన పిల్లల్లో కూడా పెద్దవాళ్లలో లాగానే హార్మోన్​లలో మార్పులొస్తాయి. దాంతో బరువు పెరుగుతారు. పొద్దున పూట కూడా నిద్ర మత్తుగా ఉంటారు. దాంతో చురుకుగా ఉండరు. పోషకాలు లేని ఫుడ్ తినే పిల్లలు లేటుగా నిద్రపోతారు. పోషకాలు కలిగిన ఫుడ్, పండ్లు, వెజిటబుల్స్ తింటారో వాళ్లు త్వరగా నిద్రపోతున్నారని చెప్తోంది. ఈ రీసెర్చ్​ ప్రకారం, నైట్ అంతా మేల్కొని ఉండే పిల్లల్లో ఓవర్ వెయిట్ సమస్య పెరుగుతోంది. తక్కువ నిద్రపోయే పిల్లలు ఇదే కాకుండా మరికొన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్లలో అబ్​స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా(ఓఎస్ఏ), గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్(జిఇఆర్​డి), డిప్రెషన్, ఆస్తమా, ఆస్టియోఆర్థరైటిస్​ సమస్యలు వస్తాయి. 

కొవ్వు ప్రమాదం

శరీర ఎత్తు, బరువులను బట్టి 30 శాతం కన్నా ఎక్కువ బీఎంఐ ఉన్నవాళ్లని ఒబె పర్సన్స్​గా చెప్తారు. అయితే కొన్నిసార్లు బీఎంఐ బాగానే ఉన్నా, ఫ్యాట్​డిఫరెంట్​గా ఉండొచ్చని పోయినేడాది లండన్​ సైంటిస్ట్​లు తెలిపారు. ఇంట్లో ఒకరికి ఒబెసిటీ ఉంటే, వాళ్లలో ఉండే జీన్స్ పిల్లలకు వచ్చినప్పుడు వాళ్లకి కూడా ఒబెసిటీ వస్తుంది. ఒకే ఒక్క జన్యువు వల్ల వస్తుంది కాబట్టి దీన్నిమోనోజెనిక్ ఒబెసిటీ అంటారు. ఒబెసిటీ ఉన్నా కొందరు హెల్దీగా ఉంటారు. ఎలాగంటే చర్మం కింద కొవ్వు పేరుకుపోయినా, లివర్​లో ఎక్కువగా పేరుకోదు. అందువల్ల వాళ్లకు డయాబెటిస్, హార్ట్ అటాక్​ సమస్యలు రావు. నిజానికి చర్మం కింద  కొవ్వు చేరడమే ఎక్కువ ప్రమాదం. కానీ, కొన్ని అనుకూల జన్యువుల కారణంగా హెల్దీగా ఉండే వాళ్లు కొందరే. 

ప్రచారం పెరిగింది

ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ రేటు చూస్తే వివిధ దేశాల ప్రజల లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటోంది. ఒబెసిటీ రేటుకి, ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, కొన్ని సంపన్న దేశాలు ఒబెసిటీ మీద అవగాహన కల్పించడానికి క్యాంపెయిన్స్​, అవేర్​నెస్ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నాయి. ప్రజల కొనుగోలు అలవాట్లను గమనించి, వాళ్లకు చెప్తున్నాయి. ఈ ప్రయత్నం వల్ల ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగి అవి ‘ఆరోగ్యవంతమైన దేశాలు’గా మారుతున్నాయి. మరో వైపు దక్షిణ పసిఫిక్​ లాంటి ప్రాంతాల్లో పోయిన ఐదేండ్లలో ఒబెసిటీ రేటు విపరీతంగా పెరిగింది. కొన్నేండ్ల నుంచి అమెరికా కూడా ఆరోగ్యకరమైన లైఫ్​స్టైల్ గురించి క్యాంపెయిన్స్ చేస్తోంది.

కరోనా ముందు.. తర్వాత...

కొవిడ్​ మహమ్మారి వల్ల దేశం మొత్తం లాక్​డౌన్ విధించడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. చాలారోజుల పాటు ఇండ్లలోనే ఉండటం వల్ల కూడా దేశంలో ఒబెసిటీ రేటు పెరిగిందని అనుకున్నారు. దాంతో ఈ విషయంపై స్పష్టత కోసం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ న్యూట్రిషన్​ (ఎన్​ఐఎన్​) కలిసి స్టడీ చేయాలనుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్​లో చెప్పాయి. అందులో భాగంగా ముఖ్యంగా పిల్లల్లో ఒబెసిటీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నారు సైంటిస్ట్ ఆవుల లక్ష్మయ్య.   

బరువు పెరిగితే...

శరీరానికి కావాల్సిన వేడిని, శక్తిని ‘కొవ్వు’ ఇస్తుంది. కానీ, అది శరీర అవసరాలకు మించి ఒంట్లో చేరి... పొట్ట, రొమ్ము, పిరుదులు, నడుము మొదలైన భాగాల్లో పేరుకుపోతుంది. ఈ రకంగా ఏర్పడిన కొవ్వు నుంచి కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇది రక్తనాళాల్లో పేరుకోవడం వల్ల బీపీకి దారితీస్తుంది. క్రమంగా గుండె, కాలేయం, మూత్రపిండాల పనితీరును కూడా అడ్డుకుంటుంది. ఫలితంగా  గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. 
అధిక బరువుతో బాధపడేవాళ్లు కొంచెం శారీరక శ్రమకు లోనైనా ఊపిరి పీల్చుకోలేకపోతారు. దానివల్ల ఆస్తమా బారిన పడే అవకాశం కూడా ఉంది. ఏ పని చేయాలన్నా మందకొడిగా ఉంటారు. చురుకుదనం పూర్తిగా తగ్గిపోతుంది. రాత్రిళ్లు నిద్రలో గురకపెట్టడానికి కారణం కూడా ఈ ఊబకాయమే.ఒబెసిటీ వల్ల శరీరంలోని కణాలు ఇన్సులిన్​కు స్పందించవు. దాంతో వాటిలోకి గ్లూకోజ్ వెళ్లదు. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడంతో మైటోకాండ్రియా దెబ్బతింటుంది. ఫైనల్​గా సెల్స్ డామేజ్ అవుతాయి. గ్లూకోజ్ పెరిగినప్పుడు క్లోమగ్రంథి ఇన్సులిన్​ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో క్లోమం పనితీరు తగ్గిపోవడంతో డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది. అంతేకాదు, ప్రొటీన్​, ఫ్యాట్స్​లో గ్లూకోజ్​ పేరుకుపోతుంది. దాంతో రక్తనాళాల మృదుత్వం దెబ్బతిని, సాగే గుణం తగ్గుతుంది. ఫలితంగా హైబీపీ, హార్ట్​ అటాక్​, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఒబెసిటీ వల్ల ఆడవాళ్లలో పీసీఒఎస్ (పాలీ సిస్టిక్ సిండ్రోమ్)​ రావొచ్చు. దానివల్ల పిల్లల్ని కనడానికి ఇబ్బందులు వస్తాయి.

హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఊబకాయులు బీపీ, కొలెస్ట్రాల్ తగ్గేలా జాగ్రత్తపడాలి. బరువు తగ్గితే డయాబెటిస్​కు చెక్​ పెట్టొచ్చు. దాంతో మరోసారి హార్ట్ ప్రాబ్లమ్ రాదు. చాలామంది హార్ట్ పేషెంట్స్​ బరువు తగ్గడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవట్లేదని పోయిన ఏడాది ఐరోపా చేసిన స్టడీలు చెప్తున్నాయి. హార్ట్ ఎటాక్​, గుండె రక్తనాళాల పూడికల వంటి సమస్యలతో ఉన్నవాళ్లు హాస్పిటల్లో చేరినప్పుడు 20శాతం కంటే తక్కువ మంది బరువు తక్కువ ఉన్నారు. దీని ప్రకారం, మిగతా 80 శాతం మంది కూడా ఒబెసిటీతో ఉన్నవాళ్లే. అయితే, 16నెలల తర్వాత మళ్లీ చెక్​ చేస్తే ఊబకాయులు86 శాతం ఇంకా ఒబెసిటీతోనే ఉన్నారు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లలో 14శాతం మంది ఒబెసిటీ బారిన పడ్డారు. కాగా ఇందులో దాదాపు సగం మంది మహిళలే. వీళ్లలో ముగ్గురిలో ఒకరికి ఎక్సర్​సైజ్​, డైట్ గురించి జాగ్రత్తలు తెలియదు. ప్రతి ఐదుగురిలో ఒకరు తాము ఓవర్ వెయిట్ ఉన్నారనే సంగతి కూడా తెలియదు. అయితే, ఒబెసిటీలో కూడా రకాలున్నాయి అంటున్నారు స్పెషలిస్ట్​లు. పిల్లల్లో వచ్చేదాన్ని చైల్డ్​హుడ్ ఒబెసిటీ అని, పెద్దవాళ్లలో వచ్చేదాన్ని అడల్ట్ ఒబెసిటీ అని అంటారు. వాటికి కారణం, ఒకటి జన్యుపరంగా, రెండోది లైఫ్​ స్టైల్​లో మార్పుల వల్ల వస్తుంది. మరి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి? అంటే... బరువు పెరుగుతున్నారని తెలియగానే జాగ్రత్తపడటం మంచిది అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

తగ్గాలంటే.. టైమ్​ ఫాలో కావాలి

లైఫ్ స్టైల్ ఒకేలా ఉండడం వల్ల కూడా పెద్దలు, పిల్లలు ఒబెసిటీ బారిన పడుతున్నారు. దీన్ని ఫెమిలియల్ ఒబెసిటీ అంటారు. ఒత్తిడి ఎక్కువై, స్ట్రెస్​ రిలీఫ్​ కోసం ఎప్పుడుపడితే అప్పుడు, ఏది పడితే అది అతిగా తింటారు. దానివల్ల వచ్చేదాన్ని అక్వైర్డ్​ ఒబెసిటీ అంటారు. టైమింగ్స్​ ఫాలో కాకుండా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. సూర్యోదయం నుంచి మొదటి రెండు గంటల్లో బ్రేక్​ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం12 నుంచి 2 గంటలలోపు భోజనం చేయాలి. సాయంత్రం 6 నుంచి 8 లోపు డిన్నర్ చేయాలి. ఈ టైమింగ్స్ ఫాలో అయినప్పడే మెటబాలిక్ రేట్ కరెక్ట్​గా ఉంటుంది. అందుకు కారణం కార్టిసాల్ అనే హార్మోన్ ఈ టైంలోనే యాక్టివ్​గా ఉంటుంది. 8 గంటల తర్వాత ఘనాహారం తినకూడదు. ఆ టైంలో తింటే కార్టిసాల్ యాక్టివ్​గా ఉండదు. దాంతో జీర్ణం కాదు. పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది. లేటుగా తినడం అలవాటైతే బరువు కూడా పెరగడం మొదలవుతుంది. రెనిన్ అనే హార్మోన్ పెరిగినప్పుడు ఆకలి తగ్గుతుంది. లెప్టిన్​ అనే హార్మోన్ రిలీజ్​ పెరిగినప్పుడు ఆకలి పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉన్నవాళ్లు సరిగా తినరు. ఒక్కోసారి ఎక్కువ తింటారు. అలా చేయడం వల్ల వచ్చిన కొవ్వు నిల్వ ఉంటుంది.  హంగర్ సైకిల్ మారడం వల్ల బాడీ షేప్ మారిపోతుంది. రక్తనాళాల్లో ఉన్న లోపలి పొర (ఎండోక్రేనియల్ స్వెల్లింగ్) దెబ్బతినడం వల్ల బ్లడ్ క్లాటింగ్​లో తేడాలొచ్చి, బ్రెయిన్, హార్ట్​లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొందరిలో స్లీప్ ఆప్నియా వస్తుంది. అంటే, ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. మధ్యమధ్యలో చాలాసార్లు మెలకువ వస్తుంది. మరికొంతమందికి డయాబెటిస్, కీళ్ల నొప్పులు వస్తాయి. బరువు పెరిగితే థైరాయిడ్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్లే వస్తాయి. వాటికి సర్జరీల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. తినే టైమింగ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఫాలో అయితే చాలు.

పోషకాహారమే తినాలి

కొంతమందికి ఆకలి లేకపోయినా కొన్నిసార్లు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు తినాలనే ఆలోచనను అదుపులో ఉంచాలి. తినే ఫుడ్​లో పోషకాలు​ ఉండేలా చూసుకోవాలి. చాలామంది ‘అన్నం ఎక్కువ తింటున్నాం’ అని చెప్తారు. అలాంటివాళ్లు కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు తినొచ్చు. అలాగే ప్రతిరోజూ ఫ్రూట్స్​ తినడం అలవాటు చేసుకోవాలి. చక్కెర ఎక్కువ ఉండే ఆహారం కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్నవి తినాలి. ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. జంక్​ ఫుడ్​ అస్సలు తినొద్దు. దాని వల్ల క్యాలరీలు పెరుగుతాయి. అలాగే వంట చేసేటప్పుడు ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడకూడదు. వేపుళ్లు, చిప్స్, కూల్ డ్రింక్స్, మద్యం మానేయాలి. 

ఒళ్లు వంచాలి

మూడేండ్ల వయసు నుంచి ఐదేండ్ల వయసు వరకు రోజూ శారీరక శ్రమ అనేది చాలా అవసరం. 6–17 ఏండ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు ప్రతి రోజూ ఒక గంటైనా శారీరక శ్రమ చేయాల్సిందే.17 ఏండ్ల కంటే పెద్దవాళ్లు వారానికి150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా రోజులో అరగంట ఎక్సర్​సైజ్ చేయాలి. క్యాలరీలు ఖర్చు చేసేందుకు ఏరోబిక్ ఎక్సర్​సైజ్​లు అంటే వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. వీటితోపాటు మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనసు తేలికపడుతుంది. ఇవి కూడా బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. వీటితోపాటు టీనేజర్స్​కు 8 నుంచి10 గంటలు నిద్ర అవసరం. పెద్దవాళ్లకు రోజుకి ఏడు గంటల నిద్ర పోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

బిఎంఐ అంటే... 

బరువును కొలిచే కొలమానం బాడీ మాస్ ఇండెక్స్(బిఎంఐ). ఇందులో శరీర బరువు ఆధారంగా ఒబెసిటీ ఉందా? లేదా అని తెలుస్తుంది. ఒక వ్యక్తి బరువు, ఎత్తును కొలిచి ఇది తెలుసుకుంటారు. మెడికల్​గా చెప్పాలంటే... బిఎంఐ స్కోర్​ను బట్టి ఇలా విభజిస్తారు. (BMI= (బరువు)kg/(ఎత్తు)m2)
బిఎంఐ18.5 కంటే తక్కువ = అండర్ వెయిట్
బిఎంఐ 18.5 నుంచి 25 లోపు = హెల్దీ
బిఎంఐ 25 నుంచి 30 లోపు = ఓవర్ వెయిట్
బిఎంఐ 30 నుంచి 35 లోపు = ఒబేస్ (క్లాస్ 1)
బిఎంఐ 35 నుంచి 40 లోపు = ఒబేస్ (క్లాస్ 2)
బిఎంఐ 40 లేదా అంతకంటే ఎక్కువ = ఒబేస్​ (క్లాస్​ 3 – మార్బిడ్)
బిఎంఐ అనేది కచ్చితమైన కొలమానం కాదు అథ్లెటిక్స్​ ఆడేవాళ్లలో. కొన్నికొన్నిసార్లు ఈ స్కోర్ తప్పు కూడా కావచ్చు. అది కూడా . ఎందుకంటే వాళ్ల శరీరంలో కొవ్వు లేకపోయినా, కండరాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఒబెసిటీ ఉందా? లేదా? అనేది సరిగా అంచనా వేయలేం. అయితే ఈ కారణంగా కొందరు మెడికల్ ఎక్స్​పర్ట్స్‘వెయిస్ట్ టు హైట్ రేషియో’(డబ్ల్యూహెచ్​ఆర్​టి)అనే పద్ధతికి మారారు. ఇందులో నడుము కొలతతో పాటు, ఎత్తు కొలుస్తారు. దీని ప్రకారం నడుము బరువు ఎత్తు కంటే ఎక్కువ ఉంటే ఒబేస్​ అని అర్థం. అంటే నడుము కొలత పదిలో ఆరు కంటే ఎక్కువ ఉండటమన్నమాట.    

హెల్దీ డైటింగ్ ఇలా చేయాలి

ఒక వయసు వచ్చాక రకరకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ చేయలేరు. అందువల్ల వాళ్లు డైట్ పాటించాలి. అలాగని విపరీతంగా ఉపవాసాలు చేయడం, తక్కువ ఫుడ్ తీసుకోవడం చేయకూడదు. అలా చేస్తే బరువు త్వరగా తగ్గుతారు, కానీ... ఫ్యూచర్​లో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హెల్దీ డైట్ తీసుకోవాలి. చాలామంది బ్రేక్​ ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. అలాంటివాళ్లు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది... టైంకి తింటేనే వెయిట్ లాస్​ అవుతారు అని. రాత్రిళ్లు కూడా త్వరగా తినాలి. అది కూడా తక్కువ తినాలి. అర్థరాత్రిళ్ల వరకు పని చేయాల్సి వచ్చినప్పుడు, మధ్యలో ఆకలి వేస్తుంది. అలాంటప్పుడు ఫ్రూట్స్​, డ్రై ఫ్రూట్స్ తినాలి. అంతేకానీ, శ్నాక్స్​ పేరుతో బిర్యానీ, బజ్జీ, బోండా, సమోసా... అంటూ అన్​హెల్దీ ఫుడ్ తినకూడదు. అలాగే జ్యూస్​, కూల్ డ్రింక్స్​ కూడా తాగకూడదు. లంచ్​ ఆలస్యంగా తినడం వల్ల డిన్నర్ లేట్ అవుతుంది. ఇలాంటప్పుడు మధ్య మధ్యలో హెల్దీ ఫుడ్ తినాలి. మైదాతో చేసిన నూడిల్స్, పాస్తా వంటివి కాకుండా ఫైబర్​ ఎక్కువ ఉండే జొన్న, గోధుమ ఉప్మా వంటివి తినాలి. లంచ్​లో కూరగాయలు ఎక్కువ తినాలి. దుంప కూరలు తప్పించి, మిగతా కూరగాయలన్నీ తినొచ్చు. అయితే, అవి కూడా వేపుళ్లు కాకుండా, ఇగురు కూరల్లా తినాలి. ఒబెసిటీ ఉన్నవాళ్లకి నిద్ర సరిగా పట్టదు. వాళ్లు పడుకునే ముందు పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. పెద్దవాళ్లు ఒత్తిడి తగ్గించుకోవాలి. పిల్లల్లో డైట్​తోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ కచ్చితంగా చేయించాలి. జెనెటికల్​గా ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్​ అయితే ఆటలు ఆడడం, ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల ఈజీగా తగ్గే అవకాశం ఉంది. 

నిద్ర మీద రీసెర్చ్​

మయో క్లినిక్​లో జరిగిన రీసెర్చ్ ఏం చెప్తోందంటే.. నిద్రలేమి వల్ల ఎక్కువ ఫుడ్ తింటారు. దాంతో క్యాలరీలు పెరిగి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా పొత్తికడుపులో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుంటుంది.  దీని మీద ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్​ ఆఫ్ కార్డియాలజీ’ రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్​ను​ కార్డియో వాస్కులర్​ మెడిసిన్ రీసెర్చర్​ నైమా కొవస్సిన్ లీడ్ చేశారు. పొత్తికడుపులో కొవ్వు పెరగడానికి 9 శాతం కారణం సరైన నిద్ర లేకపోవడమే. విసరల్​ ఫ్యాట్ పొత్తికడుపులో ఉన్న ఇంటర్నల్​ ఆర్గాన్స్​ చుట్టూ పేరుకుంటుంది. ఆ ఆర్గాన్స్ గుండెకు, జీవక్రియకు లింక్​ అయి ఉంటాయి. అయితే, వాటి చుట్టూ కొవ్వు చేరడం వల్ల గుండె, జీవక్రియకు సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. 

సర్జరీతో భయం లేదు

 60 కిలోల బరువు ఉండాల్సిన మనిషి 85 కిలోలు దాటితే వాళ్లకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమవుతుంది. ఇందులో కూడా నాలుగైదు టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేస్తారు. కానీ, చాలామంది సర్జరీ అంటే భయపడతారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. పెండ్లి అయినవాళ్లు, కానివాళ్లు, ఎవరైనా సరే సర్జరీ చేయించుకోవచ్చు. సైంటిఫిక్​గా ప్రూవ్​ అయిన సర్జరీ ఇది. మనదేశంలో ఇరవై ఏండ్లుగా, ప్రపంచంలో నలభై ఏండ్లుగా  ఈ సర్జరీలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పూర్తిగా సేఫ్​. బేరియాట్రిక్​ సర్జరీ వల్ల ఆకలి తగ్గుతుంది. కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్​ కూడా తగ్గే అవకాశం ఉంది. హార్మోన్స్ మార్పులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే, మామూలు బేరియాట్రిక్ సర్జరీలకు మూడు లక్షల నుంచి ఆపై వాళ్ల అవసరాన్ని బట్టి ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది. – డాక్టర్. వై. కృష్ణమోహన్, కన్సల్టెంట్ బేరియాట్రిక్, క్లినికల్ డైరెక్టర్, హెచ్​ఓడీ బేరియాట్రిక్, జీఐ సర్జరీ,  కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

::: మనీష పరిమి