సెల్ ఫోన్ పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చార్జింగ్ ఎలా పెట్టాలి..

సెల్ ఫోన్ పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చార్జింగ్ ఎలా పెట్టాలి..

రోజుకో టెక్నాలజీ పుట్టుకొచ్చినా.. స్మార్ట్ ఫోన్స్ పేలిన ఘటనలు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కేరళలోని తిరువిల్వామల గ్రామంలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలు చూస్తుండగా మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటనలో మూడో తరగతి చదువుతున్న బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారిని కూడా ఆందోళనకు గురి చేసింది, ఎందుకంటే చాలా మంది పిల్లలు, యువ విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఛార్జింగ్ పెట్టే సమయంలో మొబైల్ ఫోన్ వాడకానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో ప్రధానంగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడాన్ని నివారించడానికి వివిధ జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఇది  నిరంతర సమస్యగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్ పేలుళ్లను నివారించడానికి నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగం

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సేపు డైరెక్టు సూర్యకాంతిలో ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. దీని వల్ల ఫోన్ వేడెక్కడం నుంచి కొన్ని సార్లు జాగ్రత్తపడవచ్చు

స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో ప్లగ్ చేసినప్పుడు ఉపయోగించడం

మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు, ముఖ్యంగా డైరెక్ట్ సూర్యకాంతి లేదా వేడి వాతావరణంలో ఉపయోగించడం మంచిది కాదు. కొన్ని ఛార్జర్‌లు వేడెక్కడానికి దోహదం చేస్తాయి. కాబట్టి తయారీదారు ఆమోదించిన ఛార్జర్‌లు, కేబుల్‌లను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ను ఓవర్‌ఛార్జ్ చేయడం

ఎక్కువ గంటలు ఛార్జ్‌లో ఉంచడం ద్వారా ఫోన్‌ను ఓవర్‌ఛార్జ్ అవుతుంది. కాబట్టి దాన్ని నివారించాలి. మీ ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, వెంటనే ఛార్జర్‌ను డిస్‌కనెక్ట్ చేయడం ఉత్తమం. అదనంగా, మీ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మీ దిండు కింద ఉంచకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది వేడెక్కడం, అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది.

స్మార్ట్‌ఫోన్ హీట్ అయినా వినియోగించడం

మీ స్మార్ట్‌ఫోన్ విపరీతమై వేడికి గురైతే దాన్ని ఉపయోగించడం ఆపివేసి, కొన్ని నిమిషాలు చల్లబరచడం చాలా ముఖ్యం. ఫోన్‌ను తాత్కాలికంగా ఆఫ్ చేయడం వల్ల శీతలీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. దాంతో పాటు సాఫ్ట్‌వేర్‌ను తాజాగా ఉంచడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు తరచుగా వేడెక్కడంతోపాటు వివిధ సమస్యలకు పరిష్కారాలను కలిగి ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం

ఈ దురదృష్టకర సంఘటన స్మార్ట్‌ఫోన్‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ మార్గదర్శకాలను ఫాలో కావడం ద్వారా, స్మార్ట్‌ఫోన్ వినియోగంతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకోవడం ద్వారా, యూజర్స్ వారు, వారి చుట్టూ ఉన్న వారిని కాపాడిన వారవుతారు.

ఇవే కాకుండా మరి కొన్ని కారణాల రిత్యా స్మార్ట్ ఫోన్లు వేడెక్కుతాయి. ఏదైమైనా మొబైల్ ఫోన్ ను ఎంత తక్కువ వినియోగిస్తే అంత ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.