ఎండలతో పాటు కరెంట్​ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..

ఎండలతో పాటు కరెంట్​ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..

వానాకాలం, చలికాలంలో కంటే ఒక్క ఎండాకాలంలోనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎందుకంటే మండుతున్న ఎండల వల్ల ఇల్లు నిప్పుల కుంపటిలా మారుతుంది. ఇల్లు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. దీనికోసం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పొద్దంతా నడుస్తూనే ఉంటాయి. కానీ వీటివల్ల కరెంట్ బిల్లు మాత్రం తడిసి మోపెడు అవుతుంది. మరి ఈ సీజన్ లో కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ....

ఎండాకాలంలో గ్యాప్ ఇవ్వకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు నడుస్తూనే ఉంటాయి. ఇవి నడిస్తేనే మనం కూల్ గా ఉంటాం. అయితే వీటివల్ల కరెంట్ బిల్లు మాత్రం వాచిపోతుంది.  అయితే కొన్ని టిప్స్​ పాటిస్తే  కరెంట్​ వినియోగం తగ్గుతుందని  నిపుణులు చెబుతున్నారు. 

ఎల్ఈడీ బల్బులు : పాత ట్యూబ్ లైట్లు, బల్బులును వాడుతున్నట్టైతే వాటిని తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే వీటిని వాడితే కరెంట్ బిల్లు చాలా వస్తుంది. వీటికి బదులుగా మీరు ఎల్ఈడీ బల్బులను వాడండి. సాధారణంగా ట్యూబ్ లైట్​ 10 గంటలు వెలిగితే 1 యూనిట్ విద్యుత్ ను వినియోగించుకుటుంది.  కానీ ఎల్ ఈడీ బల్బులు 111 గంటలు వెలిగితే  కేవలం 1 యూనిట్ విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తాయి. వీటిని వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది.

మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయండి : మీరు ఎండాకాలంలో కరెంటు బిల్లును తగ్గించుకోవడానికి టీవీ,  సెట్ టాప్ బాక్స్ లను ఆఫ్ చేయడానికి మెయిన్ ను ఆఫ్ చేయండి. సింపుల్ గా టీవీ ఆఫ్ చేస్తే కరెంటు వినియోగంలోనే ఉంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. 

ఏసీలో టైమర్ సెట్ : అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాకుండా 24- నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీలను ఉపయోగించండి. దీనివల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే ఏసీలో టైమర్ ను సెట్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల కరెంటు బిల్లులు కూడా పెరగవు.

ఫ్రిజ్ : ఫ్రిజ్ ను ఖాళీ లేకుండా నింపేస్తుంటారు చాలా మంది. ఫ్రిజ్ ఉన్నది అందుకేనంటారు. కానీ ఫ్రిజ్ లో ఎక్కువ వస్తువులను ఉంచితే దాన్ని చల్లబరచడానికి ఎక్కువ విద్యుత్ శక్తి అవసరమవుతుంది. కాబట్టి తగ్గించి, అవసరమైన వస్తువులను మాత్రమే ఫ్రిజ్ లో పెట్టండి. ఇది మీ కరెంట్ బిల్లును తక్కువగా చేస్తుంది. 

కొత్త పరికరాలు : పాత మోడల్ ఫ్రిజ్ లు, ఏసీలను ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. కానీ మీరు కరెంట్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మాత్రం వీటిని పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఇవి ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అందుకే కొత్త కొత్త మోడల్ ఫ్రిజ్ లు, ఏసీలను కొనడం మంచిది. 

ఫ్రిజ్ రూమ్: మెయిన్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఫ్రిజ్ ఉంచితే ఆ గదుల్లో మరింత వేడి బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఏసీ, ఫ్యాన్ వాడకం బాగా పెరుగుతుంది. అందుకే ఫ్రిజ్ ను ఎప్పుడూ కూడా వంటగదిలోనే పెట్టండి.