
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో భారీగా నల్లబెల్లం, పటికను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా చౌహన్ తెలిపిన మేరకు.. దసరా పండుగ సందర్భంగా నాటు సారా తయారీకి హైదరాబాద్ నుంచి గ్రామాలకు నల్లబెల్లం, పటికను తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఇందులో భాగంగా కడ్తాల్ మండలం టోల్ ప్లాజా వద్ద మంగళ వారం తెల్లవారు జామున వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఆగి ఉన్న వెహికల్ లో 1,950 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల పటిక, ఆటోలో 300 కిలోల నల్లబెల్లం పౌడర్, 10 కిలోల పటికను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు మహర్షి, ఖాసీం, ఎల్లస్వామిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
లింగాల మండలంలో 900 కేజీలు స్వాధీనం
లింగాల: జిల్లాలోని లింగాల మండలం మగ్దుంపూర్ చౌరస్తా వద్ద భారీగా నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం రాత్రి లింగాలకు చెందిన నల్ల పోతుల హరీశ్ఆటోలో 900 కేజీల నల్లబెల్లాన్ని తరలిస్తుండగా ఎక్సైజ్ స్పెషల్ పార్టీ టీమ్ ఆపి పట్టుకుంది. నిందితుడు హరీశ్ ను మంగళవారం తహశీల్దార్ పాండు నాయక్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఎక్సైజ్ సీఐ చెప్పారు.