సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు

సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు
  • ఎల్‌ఏసీ వెంబడి కొత్త రోడ్లు,ఎయిర్‌‌పోర్టు, హెలిప్యాడ్లు
  • డోక్లామ్ దగ్గర అండర్‌‌గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్‌
  • చైనాలో 500కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్లు
  • అమెరికా రక్షణ శాఖ వెల్లడి

వాషింగ్టన్: సరిహద్దుల్లో చైనా దూకుడు కొనసాగుతున్నది. ఎల్‌ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వెంబడి ఓ వైపు దళాలను పెంచుతూ.. మరోవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా నిర్మాణాలు చేపడుతున్నది. డోక్లామ్ దగ్గర అండర్‌‌గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేస్తున్నది. పాంగోంగ్ లేక్‌పై రెండో బ్రిడ్జి, డ్యుయల్ పర్పస్ ఎయిర్‌‌పోర్టు, పలు హెలిప్యాడ్లు నిర్మించింది. ఈ విషయాలను అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ‘మిలిటరీ, సెక్యూరిటీ డెవలప్‌మెంట్స్‌ ఇన్వాల్వింగ్ ది పీపుల్స్ రిపబ్లిక్ చైనా 2023’ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. 2022లో ఎల్‌ఏసీ వెంబడి మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను
పెంచుకుకోవడాన్ని చైనా కొనసాగించిందని పేర్కొంది.

కొత్త రోడ్లు, కొత్త గ్రామాలు

‘‘డోక్లామ్ దగ్గర అండర్‌‌గ్రౌండ్‌ స్టోరేజీ ఫెసిలిటీస్‌ను చైనా ఏర్పాటు చేసుకుంది. ఎల్‌ఏసీలోని మూడు సెక్టార్లలో కొత్త రోడ్లను నిర్మించింది. భూటాన్‌కు దగ్గర్లోని వివాదాస్పద ప్రాంతాల్లో కొత్త గ్రామాలను సృష్టించింది” అని అమెరికా రక్షణ శాఖ తన రిపోర్టులో పేర్కొంది. ఒక బార్డర్‌‌ రెజిమెంట్‌ను 2022లో మోహరించిందని చెప్పింది. ‘‘తూర్పు సెక్టార్‌‌లో మూడు కంబైన్డ్‌ ఆర్మ్స్‌ బ్రిగేడ్ల (సీఏబీ)ను, సెంట్రల్‌ సెక్టార్‌‌లో మరో మూడు సీఏబీలను మోహరించింది. అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రం బ్రిగేడ్లను విత్‌డ్రా చేసుకున్నా.. ఎల్‌ఏసీ వెంబడి చాలాచోట్ల బలగాలను కొనసాగిస్తున్నది” అని వివరించింది. చైనాకు చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ మోహరింపులు ఇకపైనా కొనసాగుతాయని అంచనా వేసింది. ఇండియా, చైనా మధ్య జరిగిన చర్చలతో అతితక్కువ పురోగతి మాత్రమే కనిపించిందని, రెండువైపులా ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదని వివరించింది. చైనా వద్ద ప్రస్తుతం 500కు పైగా ఆపరేషనల్ న్యూక్లియర్ వార్​హెడ్లు ఉన్నాయని, 2030 నాటికి ఈ సంఖ్య వెయ్యికి పెరగొచ్చని వెల్లడించింది.