ఊరూరా జాతర.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 

ఊరూరా జాతర.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు 

మెదక్/పాపన్నపేట, వెలుగు : మాఘ అమావాస్య సందర్భంగా ఉమ్మడి మెదక్​జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాపన్నపేట మండలం ఏడుపాయలలోని వన దుర్గాభవానీ మాత ఆలయం వద్ద మంజీరా నదిలో మాఘ స్నానాలు చేసేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వనదుర్గా ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తి దిగుకు నీటిని విడుదల చేయగా పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్​ సాతెల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిలప్​చెడ్ మండలం చిట్కుల్​​చాముండేశ్వరీ ఆలయం వద్ద, మెదక్ మండలం పేరూర్​ సరస్వతి ఆలయం వద్ద మంజీరా నదిలో కూడా భక్తులు మాఘ స్నానాలు చేశారు. కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలోని శనీశ్వరాలయంలో  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​ పర్సన్ సునీతారెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ కుమార్ ​పూజలు చేశారు. శివ్వంపేట  మండల కేంద్రంలోని భగలాముఖి అమ్మవారి శక్తి పీఠంలో హోమం నిర్వహించారు. వాట్​పల్లి మండలం దుద్యాల సర్వేశ్వర పూరి ఆశ్రమంలో శని మహాదేవుడికి పూజలు చేశారు. 

సింగరాయ కొండపై.. 

సిద్దిపేట/కోహెడ/సిద్దిపేట రూరల్/దుబ్బాక : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామశివారులోని సింగరాయ కొండ జన సంద్రంగా మారింది. పుష్య బహుళ అమావాస్య రోజున జరిగిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర భక్త జన సందోహంతో కిటకిటలాడింది. జాతరకు ప్రత్యేకతగా నిలిచిన తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మోయాతుమ్మేద వాగులో భక్తులు స్నానాలు చేసి లక్ష్మీ నర్సింహాస్వామిని దర్శించుకున్నారు. చెట్ల కింద వంటలు చేసుకొని భోజనాలు చేశారు. గాజుల బండ వద్ద భారీగా దుకాణాలు వెలిశాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కూడవెల్లిలో ఎంపీ, ఎమ్మెల్యే..

దుబ్బాక నియోజకవర్గంలోని అక్భర్​పేట–భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రఘునందన్​రావు దంపతులు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. దక్షణ కాశీగా భావించే ఆలయంలో వచ్చే మాఘమావాస్య జాతరలోగా భక్తులకు సమకూర్చాల్సిన సౌకర్యాలను ప్రసాద్​ పథకం కింద పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న భక్తులు వాగులో పుణ్య స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం పుల్లూరు గ్రామంలో సుమారు వంద ఎకరాల బండపై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరకు తొలిరోజు భక్తులు పోటెత్తారు. నంగునూరు మండలం పాలమాకుల గుబ్బడి గుట్టపై కొలువైన దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఏడాదికి ఒకే రోజు ఈ ఆలయాన్ని తెరవడంతో దాదాపు ఐదు వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు.