వారం రోజుల్లో 1158 కోట్ల మద్యం అమ్మకాలు

వారం రోజుల్లో 1158 కోట్ల మద్యం అమ్మకాలు
  • దాదాపు 926 కోట్ల ఆమ్దానీ 
  • నిరుడు దసరాకు 504 కోట్ల సేల్స్ 
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 26 వేల కోట్ల అమ్మకాలు​ 

హైదరాబాద్, వెలుగు: దసరా మస్తు కిక్కు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ ఖజానా నింపింది. పోయినేడు దసరాకు రూ.504 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈసారి ఏకంగా రూ.1,158 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.926 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖ టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు జరిపించడం, పొలిటికల్​ లీడర్లు దసరా దావత్​లు ఇవ్వడం, మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో మద్యం ఏరులై పారింది. హైదరాబాద్, మహబూబ్​నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఎక్కువ అమ్ముడైంది.

రాష్ట్రంలోని వైన్స్, బార్లకు 20 డిపోల నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ నెల 2, 5వ తేదీన డిపోలకు సెలవు ఉండగా.. పోయిన నెల 28, 29, 30, ఈ నెల 1,3,4, 6 తేదీల్లో పెద్ద ఎత్తున మద్యాన్ని ఎక్సైజ్ శాఖ లిఫ్ట్ చేయించింది. సాధారణంగా ఒక్కరోజు మద్యం డిపోల నుంచి రూ.80 కోట్ల విలువైన సరకు వరకే లిఫ్ట్ చేస్తారు. కానీ ఈసారి ఎక్కువ అమ్మాలని ఎక్సైజ్ శాఖ ఎక్కువ లిఫ్ట్ చేయించింది. 28న రూ.117.02 కోట్లు, 29న 181.47 కోట్లు, 30న 313.64 కోట్లు, ఒకటో తారీఖున రూ.79.51 కోట్లు, 3న  రూ.138.31 కోట్లు, 4న రూ.192.48, 6న 135.66 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే వారం రోజుల్లో మొత్తంగా రూ.1158.28 కోట్ల సేల్స్ జరిగాయి. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఏకంగా రూ.26 వేల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో దాదాపు 80 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. 

ముందు నుంచే ప్లాన్.. 
పండుగల సీజన్ లో లిక్కర్ సేల్స్​పెంచి ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రతిసారీ ముందు నుంచే ప్లాన్ చేస్తోంది. ఈసారి కూడా అదే పద్ధతిలో ఎక్కువ మొత్తంలో మద్యం లిఫ్ట్​చేయించింది. అంతే కాకుండా సేల్స్ పూర్తయ్యేలా చూడాలని టార్గెట్లు పెట్టింది. దీంతో వైన్స్​నిర్వాహకులు గ్రామాల్లో బెల్ట్​షాపుల నిర్వాహకులతో మాట్లాడుకొని పెద్ద ఎత్తున విక్రయాలు జరిపారు. దసరాకు ఒకరోజు ముందు, తర్వాతి రోజు మద్యం సేల్స్​ఎక్కువ జరిగినట్టు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా అయితే దసరా కంటే రెండు రోజుల ముందు డిపోల నుంచి మద్యం పెద్ద ఎత్తున లిఫ్ట్ చేస్తారు. కానీ ఈసారి నాలుగు రోజుల ముందు నుంచే లిఫ్ట్ చేయించారు.