ప్రభుత్వ బ్యాంకులకు లాభాలే లాభాలు!

ప్రభుత్వ బ్యాంకులకు  లాభాలే లాభాలు!

బిజినెస్‌ డెస్క్‌, వెలుగు: ప్రభుత్వ బ్యాంకులయిన ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్‌, బీఓబీ, యూకో బ్యాంకుల ప్రాఫిట్స్‌ మార్చితో ముగిసిన క్వార్టర్‌ (క్యూ4) లో పెరిగాయి. ఈ బ్యాంకుల అసెట్స్ క్వాలిటీ కూడా మెరుగుపడింది. వీటి రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. 

స్టేట్ బ్యాంక్‌ లాభం రూ. 9,113 కోట్లు
ఎస్‌బీఐకి క్యూ4 లో రూ. 9,113.53 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌లో వచ్చిన రూ.6,450.75 కోట్లతో పోలిస్తే, బ్యాంక్ లాభం ఈ సారి 41.27% పెరగడం విశేషం.   క్యూ4 లో  బ్యాంక్‌కు రూ. 31,198 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూస్తే 15.26 % ఎక్కువ. ఎస్‌బీఐకి మొత్తం 2021–22 ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 31,676 కోట్ల నికర లాభం రాగా,  రూ. 1,20,708 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. బ్యాంక్‌ నెట్‌ ఎన్‌పీఏల రేషియో క్యూ4 లో  ఏడాది ప్రాతిపదికన 1.50 % నుంచి 1.02 శాతానికి మెరుగుపడింది.  2021–22 కి గాను షేరుకి రూ.7.10 డివిడెండ్‌గా ఇవ్వనున్నారు.  రికార్డ్ డేట్‌ను ఈ నెల 26 గా నిర్ణయించారు. 

బీఓబీ లాభం 9 రెట్లు అప్‌
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కు 2021–22 ఫైనాన్షియల్ ఇయర్‌‌లో రూ. 7,272 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 829 కోట్లతో పోలిస్తే, 2021–22 లో  బ్యాంక్ లాభం తొమ్మిది రెట్లు పెరగడం విశేషం. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం కూడా  కిందటి ఫైనాన్షియల్ ఇయర్‌‌లో  ఏడాది ప్రాతిపదికన 13 % పెరిగి రూ. 32,621 కోట్లుకు చేరుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌ను పరిశీలిస్తే, బ్యాంక్‌కు రూ. 1,779 కోట్ల నికర లాభం వచ్చింది. మార్చి క్వార్టర్‌‌, 2021లో రూ. 1,047 కోట్ల నష్టాన్ని బీఓబీ ప్రకటించింది.  బ్యాంక్ నెట్‌ ఎన్‌పీఏల రేషియో క్యూ4 లో 3.09 %  నుంచి 1.72 శాతాని (ఏడాది ప్రాతిపదికన) కి మెరుగుపడింది. బీఓబీకి క్యూ4 లో రూ. 8,612 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. 2021–22 కి గాను షేరుకి రూ. 1.20 డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. 


పర్లేదనిపించిన యూనియన్ బ్యాంక్‌
క్యూ4లో  యూనియన్ బ్యాంక్‌కు రూ. 1,440 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌లో రూ. 1,330 కోట్ల ప్రాఫిట్‌ను బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్‌కు కిందటేడాది మార్చి క్వార్టర్‌‌లో రూ. 15,475 కోట్ల నికర వడ్డీ ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌లో ఇది  రూ. 17,174 కోట్లకు  పెరిగింది. 


యూకో లాభం 290% అప్‌
యూకో బ్యాంక్ లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌లో ఏడాది ప్రాతిపదికన 290 శాతం పెరిగింది. బ్యాంక్‌కు కిందటేడాది రూ. 80.02 కోట్ల  నికర లాభం రాగా, ఈ ఏడాది క్యూ4 లో 312.18 కోట్లు వచ్చాయి. 2021–22 లో రూ. 929.76 కోట్ల ప్రాఫిట్‌ను యూకో బ్యాంక్ సాధించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం క్యూ4 లో రూ. 1,652.38 కోట్లు రాగా, 2021–22 లో 6,472.95 కోట్లు వచ్చాయి.