Annapurna College: AI ఎంత ఎదిగినా.. సినిమాకు ప్రాణం భావోద్వేగాలే: ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

Annapurna College: AI ఎంత ఎదిగినా.. సినిమాకు ప్రాణం భావోద్వేగాలే: ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

ఒకప్పుడు మనిషికి మనిషే పోటీ. కానీ, ప్రస్తుత ప్రపంచంలో మానవుడికి కొత్త సవాల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చేసింది. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న AI, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. ఒకప్పుడు కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ఈ టెక్నాలజీ, నేడు బ్యాంకింగ్, కన్సల్టింగ్, హెల్త్‌కేర్, విద్య, వినోదం, తయారీ రంగాలు సహా దాదాపు ప్రతి పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హవా నడిపిస్తుంది. ఈ పరిణామాల దృష్ట్యా.. ఇండియా టాప్ సినీ ఎడిటర్, నేషనల్ అవార్డు విన్నర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad)  కీలక విషయాలు వెల్లడించారు.

AI ఎంత ఎదిగినా.. భావోద్వేగాలే గొప్పవి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్నీ రంగాల్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసే అసలు శక్తి మాత్రం హ్యూమన్ ఎమోషన్స్ మాత్రమే అని ప్రముఖ ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ కాలేజ్ నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో పాల్గొన్న ఆయన, భవిష్యత్‌లో సినిమా ఎడిటింగ్ ఎలా మారబోతోందో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కథకు ఊపిరి పోసేదే ఎడిటింగ్‌..

తొమ్మిది జాతీయ అవార్డులు అందుకున్న శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎడిటింగ్ అంటే కేవలం షాట్లను కలపడం కాదని, కథకు ప్రాణం పోసే ప్రక్రియ అని చెప్పారు. పాత్రల భావోద్వేగాలు, కథా ప్రపంచం, సినిమా రిథమ్ అన్నీ ఎడిటింగ్ ద్వారానే ప్రేక్షకులకు చేరతాయని వివరించారు. AI, VFX వంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా, వాటి వల్ల ఎడిటర్ల ప్రాధాన్యం తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.

►ALSO READ | The Odyssey Ticket: ఒక్కో టికెట్ రూ.3,300పైనే.. అయినా నిమిషాల్లో సేల్ అవుట్.. 

పైగా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎడిటోరియల్ ఆలోచన మరింత కీలకమవుతుందని చెప్పారు. ముఖ్యంగా 3D ప్రీవిజువలైజేషన్ వంటి కొత్త పద్ధతులు కథను ముందుగానే మెరుగుపరచడంలో, దర్శకుడు-ఎడిటర్ మధ్య బాండింగ్ పెంచడంలో సహాయపడతాయని తెలిపారు.

ప్రేక్షకుల మనసును గెలిచేది ఎమోషనే..

AI గురించి మాట్లాడుతూ.. అది ఎన్నో అవకాశాలను సృష్టించగలిగినా, కథలోని భావోద్వేగాన్ని పూర్తిగా అందించడం మాత్రం మనుషులకే సాధ్యమని అన్నారు. టెక్నీకల్ గా ఖచ్చితమైన ఫలితాలను AI ఇవ్వగలదేమో కానీ, సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకేది మాత్రం మనిషి అనుభవాలు, ఆత్మపరిశీలన, భావోద్వేగాలేనని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో ఎడిటర్లు AI రూపొందించిన విజువల్స్‌ను ఉపయోగించడం, కంటెంట్ ఎంపిక, షాట్ డిజైన్, భావోద్వేగాల అర్థం చేసుకోవడం వంటి కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

అలాగే, మంచి సినిమా అనేది ప్రయోగాలు చేయడం, కథపై నమ్మకం ఉంచడం ద్వారా పుడుతుందని చెప్పారు. ప్రేక్షకుల అభిరుచులను ముందుగానే అధ్యయనం చేయడం కూడా సినిమా విజయానికి కీలకమని శ్రీకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తానికి, AI సినిమా నిర్మాణ విధానాన్ని మార్చవచ్చేమో కానీ, ప్రేక్షకులను కదిలించే మానవ భావోద్వేగాలను మాత్రం ఎప్పటికీ భర్తీ చేయలేదనే సందేశాన్ని ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ స్పష్టంగా తెలియజేశారు.

శ్రీకర్ ప్రసాద్ సినిమాల విషయానికి వస్తే, భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ఎడిటర్లలో ఒకరైన  ఏ. శ్రీకర్ ప్రసాద్ 35 ఏళ్లకు పైగా కెరీర్‌లో 600కు పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సహా 17 భాషల్లో పనిచేసిన ఆయన రికార్డు స్థాయిలో 9 జాతీయ అవార్డులు అందుకున్నారు. మణిరత్నం, ఎస్.ఎస్. రాజమౌళి, విషాల్ భరద్వాజ్, ఏ.ఆర్. మురుగదాస్ వంటి టాప్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసి తన సత్తా చాటుకున్నారు.